Miss World 2025 Hyderabad: విశ్వ సుందరీమణుల చేనేత సింగారం
ABN , Publish Date - May 18 , 2025 | 04:56 AM
ప్రపంచ సుందరి పోటీలు కోసం హైదరాబాద్ వచ్చిన 55 దేశాల అందగత్తెలు రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడిని సందర్శించగా, వారు ధరించిన పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట చేనేతల చీరలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.
హైదరాబాద్‌లో జరుగుతున్న ‘ప్రపంచ సుందరి’ పోటీలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్నాయి. వందకుపైగా దేశాల నుంచి సుందరీమణులు హాజరవుతున్న ఈ పోటీలకు సంబంధించిన వీడియోలను కోట్ల మంది వీక్షిస్తున్నారు. తాజాగా 55 దేశాల అందగత్తెలు రామప్ప దేవాలయాన్ని, వేయి స్తంభాల గుడిని సందర్శించారు. ఈ సందర్భంగా వారు కట్టుకున్న చీరలు, ఓణీలు, లెహంగాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. వాటిని రూపొందించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా... వాటి వెనుక ఉన్న కథను ‘నవ్య’కు వివరించారు.
‘‘సుమారు రెండు నెలల క్రితం- అప్పటి పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ నాకు ఫోన్ చేశారు. హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి పోటీలు జరుగుతున్నాయని, వాటిలో పాల్గొనే సుందరీమణులు రామప్ప దేవాలయాన్ని, వేయి స్తంభాల గుడిని సందర్శిస్తారని.. వారికి తగిన దుస్తులను డిజైన్ చేయాలని కోరారు. తెలంగాణ చేనేత వస్త్రాలతోనే వీరి దుస్తులను రూపొందించాలని షరతు విధించారు. తెలంగాణలో చేనేతలకు సంబంధించి మూడు ముఖ్యమైన ప్రాంతాలు ప్రసిద్ధి. వీటిలో మొదటిది పోచంపల్లి. రెండోది గద్వాల్. మూడోది నారాయణపేట. ఈ మూడు చేనేతలతోనే వీరికి చీరలు, బ్లౌజులు, లంగా ఓణీలు, లెహంగాలు రూపొందించాం. బోర్డర్ల కోసం ఇతర ప్రాంతాలకు చెందిన రకరకాల హస్తకళల సాయం కూడా తీసుకున్నాం.
పది రోజుల ముందే...
సాధారణంగా మేము ఫ్యాషన్ షోల కోసం డిజైన్ చేసేటప్పుడు- మూడు యూనివర్సల్ సైజులలో కుడతాం. మోడల్స్ వచ్చి, వాటిని ధరించాక... చిన్న చిన్న మార్పులు ఉంటే అప్పటికప్పుడు చేస్తాం. ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనేవారి కొలతలు కూడా ఈ మూడు యూనివర్సల్ సైజుల్లోనే ఉంటాయని ముందే ఊహించి, దానికి తగ్గట్టుగా డిజైనింగ్‌ను చేయటం మొదలుపెట్టాం. మాకు ఈ పోటీల్లో పాల్గొనేవారి వివరాలు ముందే అందించారు. ఈ నెల ఒకటి నాటికి వారి కొలతలు కూడా తెలిసాయి. వీటికి తగ్గట్టుగా దుస్తులను డిజైన్ చేయటం మొదలుపెట్టాం.

ఈ నెల 10కి అందరూ హైదరాబాద్ వచ్చేశారు. 11న వారందరికీ దుస్తుల ట్రయల్ వేశాం. ముందుగా అనుకున్నట్లే అన్ని సరిగ్గా కుదిరాయి. వారిలో చాలామందికి చీరలు, లెహంగాలు కట్టుకోవటం తొలిసారి. కానీ ఏ ఒక్కరు వాటిని ధరించి ఇబ్బంది పడలేదు. చాలా బావున్నాయని మెచ్చుకున్నారు.
పోచంపల్లికి మళ్లీ వైభవం...
రామప్ప గుడికి, వెయ్యి స్తంభాల గుడికి వెళ్లిన సుందరీమణులు తమ ఇన్‌స్టా అకౌంట్లలో ఆ ఫోటోలను షేర్ చేశారు. దీనివల్ల ఈ దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. ఈ మధ్యకాలంలో పోచంపల్లి వస్త్రాలకు కొద్దిగా డిమాండ్ తగ్గింది. సుందరీమణుల పర్యటన తర్వాత మళ్లీ వీటికి ఆదరణ పుంజుకుంది. అనేకమంది చేనేత కార్మికులు నాకు కూడా ఫోన్లు చేసి మా దగ్గర కూడా ఈ తరహా దుస్తులు ఉన్నాయని చెబుతున్నారు.
మిస్ ఇండియా వరల్డ్ కోసం...
ఈసారి పోటీల ప్రారంభోత్సవంలో మిస్ ఇండియా వరల్డ్ నందినీ గుప్తాకు కూడా దుస్తులను నేనే డిజైన్ చేశాను. దీని వెనక ఒక చిన్న కథ ఉంది. ఈసారి పోటీలు దక్షిణ భారత దేశంలో జరుగుతున్నాయి కాబట్టి చీర కట్టుకోవాలని నందిని భావించారు. నందిని నా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె టీమ్ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నేను వారికి కొన్ని చీరలు చూపించాను. నందిని కట్టుకుంటే అవి చాలా బావున్నాయి. కానీ నందిని కేవలం దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించటం లేదు. మొత్తం భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. కాబట్టి ఆమె ధరించే దుస్తులు కూడా ఆ విధంగానే ఉండాలి. అందుకోసం నేను సుమారు మూడు ఏళ్ల నుంచి తయారుచేస్తున్న జమ్దాని లెహంగాను ఆమెకు చూపించాను. దీనికి మేము వాడిన బోర్డర్ తయారుచేయటానికి దాదాపు రెండేళ్లు పట్టింది. దీనితో పాటుగా ఆమె దుప్పట్టా కోసం పొందూరు ఖద్దరును వాడాము. ప్రారంభోత్సవ వేళ నందిని వేసుకున్న ఈ దుస్తులకు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రశంసలు లభించాయి.’’
మూడు రకాలుగా...
సుందరీమణులందరూ గుడికి వెళ్తున్నారు కాబట్టి ఆ సందర్భానికి తగినట్టుగా దుస్తులు, అలంకరణ ఉండాలి. మన భారతీయ సంస్కృతిలోని అత్యంత అందమైన దుస్తుల్లో చీర ఒకటి. ఇది అన్ని సందర్భాలకు పనికొస్తుంది. సందర్భానుసారంగా దాన్ని కట్టుకుంటే చాలు! అందుకే సుమారు 20 మందికి చీరలు, వాటికి తగిన బ్లౌజులు కుట్టాం. మిగిలిన వారిలో 20 మందికి లెహంగాలు.. మరో 15 మందికి లంగా ఓణీలు కుట్టాం. వీటన్నింటినీ పోచంపల్లి ఇక్కత్, గద్వాల్, నారాయణపేట చేనేతలతోనే రూపొందించాం. తెలుపు-నలుపు కలనేత, నీలం, ఎరుపు, గంధం రంగు- నేపథ్యంలోనే మొత్తం దుస్తులు కనిపిస్తాయి. ఇక కొన్ని దుపట్టాలు, బోర్డర్లు ఇతర చేనేతలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. తెలంగాణ చేనేతలను సహజసిద్ధమైన రంగులతో తయారు చేస్తారు. ఒకో చేనేతకు ఒకో ప్రత్యేకత ఉంది. పోచంపల్లి ఇక్కత్, డబుల్ ఇక్కత్‌ల డిజైన్‌లు భిన్నంగా ఉంటాయి. గద్వాల్ సిల్క్ కట్టుకున్నవారికి హుందాతనాన్ని ఇస్తాయి. నారాయణపేట చేనేతలు కట్టుకొన్నవారికి సరికొత్త రూపాన్ని ఇస్తాయి. వీటి మూడింటినీ కలగలిపితే సరికొత్త అందం ఏర్పడుతుంది.
ఎవరికైనా ఒకటే...
సాధారణంగా మోడల్స్ చాలా సన్నగా ఉంటారని., వారికి చీరలు బావుండవనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ చీరకు కట్టే పద్ధతి వల్ల అందం వస్తుంది. సరైన రీతిలో కడితే ఏ ఖండం వారికైనా చీర బావుంటుంది. అంతేకాదు, చీరలు తెల్లగా ఉన్నవారికే బావుంటాయని భావన కొందరిలో ఉంటుంది. అది కూడా నిజం కాదు. నా ఉద్దేశంలో తెలుపు, నలుపు అనేవి అందాన్ని నిర్ణయించే అంశమే కాదు. చీర కట్టుకున్న తర్వాత వారు ఎలా ప్రవర్తిస్తున్నారు? ఎంత హుందాగా ఉన్నారనే విషయంపైనే అందం ఆధారపడి ఉంటుంది.
- గౌరంగ్ షా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..