Share News

Oscar-winning Film: ఆ కదలికలన్నీ హీల్స్‌తోనే వస్తాయి!

ABN , Publish Date - Mar 05 , 2025 | 05:35 AM

ప్రస్తుతం సినిమా ప్రేమికులందరి దృష్టి ఐదు ఆస్కార్లు గెలుచుకున్న అనోరా చిత్రంపైనే ఉంది. ఈ చిత్రంలో ల్యాప్‌ డ్యాన్సర్‌ అయిన వేశ్య పాత్ర పోషించిన మైకీ మాడిసన్‌కు ఉత్తమ నటి అవార్డు కూడా దక్కింది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాడిసన్‌ ఒక పత్రికకు ఇచ్చిన ఆసక్తికరమైన ఇంటర్వ్యూ ఇది..

Oscar-winning Film: ఆ కదలికలన్నీ హీల్స్‌తోనే వస్తాయి!

‘‘డ్యాన్సర్లకు ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజీ ఉంటుంది. దీనిని పట్టుకుంటేనే పాత్రకు న్యాయం చేయగలుగుతాం. అందుకే ఈ పాత్ర చిత్రీకరణ ముందే నేను అనేక క్లబ్‌లకు వెళ్లాను. అనేక మంది డ్యాన్సర్లను కలిశాను. చాలా మంది డ్యాన్సర్ల నగ్నత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ నా దృష్టిలో వారికి ఆ నగ్నత్వమే ఒక డ్రెస్సు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు నగ్నంగా నటించాల్సి వచ్చింది. ఆ సీన్లలో ఎంతగా లీనమయిపోయాన నంటే.. నాకు ఎప్పుడూ నగ్నంగా ఉన్నట్లు అనిపించలేదు. చివరిలో ఒక సన్నివేశం ఉంటుంది. అందులో పూర్తిగా డ్రెస్సు వేసుకొని ఉంటా. అప్పుడు నగ్నంగా ఉన్నట్లు అనిపించింది. ఇక్కడ కాళ్లకు వేసుకొనే హీల్స్‌ గురించి కూడా చెప్పాలి. డ్యాన్సర్ల జీవితాల్లో ఇవి చాలా ముఖ్యమై నవి. ఎందుకంటే వారి కదలికలన్నీ ఆ హీల్స్‌ ద్వారానే వస్తాయి. అంతే కాదు ఈ హీల్స్‌ వల్ల వారి నడకలో కూడా తేడా వస్తుంది. నాకు ఎప్పటి నుంచో అలాంటి హీల్స్‌ వేసుకోవాలనిపించేది. ఈ చిత్రం వల్ల నాకు ఆ కోరిక తీరింది.

తక్కువ సినిమాలే..

ఇప్పటి దాకా నేను చాలా తక్కువ సినిమాలు చేశాను. ఎక్కువగా టెలివిజన్‌ సీరియల్స్‌లో నటించాను. అయితే ఆ సమయంలో కూడా నాకు సినిమాల్లో నటించాలని ఉండేది. ఆ సమయంలో ఒక హారర్‌ సినిమాలో నటించాను. ఆ సినిమా చూసిన తర్వాత ‘అనోరా’ చిత్రం నిర్మాతలు నన్ను సంప్రదించారు. కథ వినిపించారు. నా పాత్ర చిత్రీకరణకు రెండున్నర నెలలు పట్టింది. ఈ సినిమాలో అర్మేనియాకు.. రష్యాకు చెందిన అనేక మంది నటీనటులు ఉన్నారు. నాకు ఈ రెండు భాషలు రావు. వారు ఆ భాషల్లో మాట్లాడుతున్నప్పుడు అర్థమయినట్లు నటించేదాన్ని. కొన్ని సీన్లలో నా కళ్ల నుంచి నీళ్లు కారాలి. నాకు చిన్నప్పటి నుంచి ఏడిస్తే ఒక కంటిలో నుంచే నీళ్లు ఎక్కువగా వచ్చేవి. రెండో కంటిలో నుంచి తక్కువగా వచ్చేవి. ఈ సినిమా డైరక్టర్‌ సీన్‌ నాకు సన్నివేశం చెప్పి కెమెరా వెనక్కి వెళ్లిపోయేవారు. చిత్రీకరణ మొదలయిన వెంటనే కట్‌ చెప్పి... ‘రెండో కంటిలో నీళ్లు రావటంలేదు’’ అనేవారు. నాకు రెండో కంటి నుంచి నీళ్లు రావంటే మొదట తను నమ్మలేదు.


ఆ తర్వాత ఆయనకు కూడా అసలు విషయం అర్థమయింది. ఇక సినిమా పూర్తయిన తర్వాత దీనిని అనేక సినిమా ఫెస్టివల్స్‌లో ప్రదర్శించారు. దీనిలో కాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కాన్స్‌ ఫెస్టివల్‌లో ఒక నటిగా పాల్గొనాలనేది నా చిన్ననాటి కోరిక. ఆ కోరిక ఈ చిత్రంతో తీరింది. థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చూడటం.. వాళ్లు చప్పట్లు కొడుతుంటే ఆనందించటం.. మరపురాని అనుభవాలు.

Updated Date - Mar 05 , 2025 | 05:35 AM