Share News

Meghan Markle: మేఘన్‌ మెయిల్‌ చేసింది...

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:23 AM

పిల్లలు చిన్నతనంలో చేసిన అల్లరి పనుల గురించి తల్లిదండ్రులు మురిపెంగా అందరికీ చెబుతూ ఉంటారు. వాళ్ల అందమైన బాల్యాన్ని కొంతవరకూ డైరీలు..

Meghan Markle: మేఘన్‌ మెయిల్‌ చేసింది...

పిల్లలు చిన్నతనంలో చేసిన అల్లరి పనుల గురించి తల్లిదండ్రులు మురిపెంగా అందరికీ చెబుతూ ఉంటారు. వాళ్ల అందమైన బాల్యాన్ని కొంతవరకూ డైరీలు, ఫొటోలు, వీడియోల రూపంలో దాచిపెడుతూ ఉంటారు. కానీ పిల్లలకు మాత్రం అవేవీ గుర్తుండవు. పిల్లలు పెద్దయ్యాక వారి బాల్యాన్ని కళ్ల ముందు నిలపడమే కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకుని మురిసిపోయేలా ఏర్పాటు చేసింది మేఘన్‌ మార్కెల్‌ అనే అమెరికన్‌ అమ్మ. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పిల్లలకు అద్భుతమైన బహుమతిని సిద్ధం చేస్తోంది. పిల్లల పేరిట ఈ మెయిల్‌ ఐడీని సృష్టించి వాళ్ల బాల్యాన్ని వాళ్లకే మెయిల్‌ చేస్తోంది. ఈ సరికొత్త ఆలోచన సెలబ్రిటీలను సైతం ఆకర్షించడం విశేషం.

ఎవరీ మేఘన్‌?

పేరు వినగానే ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదా! ఆమె ఎవరో కాదు ప్రిన్స్‌ హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటిష్‌ రాజకుటుంబంలో అడుగుపెట్టిన అమెరికన్‌ మహిళ. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు ఆర్చీకి ఆరేళ్లు కాగా కూతురు లిలిబెత్‌కు నాలుగేళ్లు. వివాహానికి ముందు మేఘన్‌ మార్కెల్‌ మంచి నటిగా పేరుతెచ్చుకున్నారు. తరువాత స్వశక్తితో శ్రమించి వ్యాపారవేత్తగా కూడా ఎదిగారు.


ఆలోచన అద్భుతం!

అమ్మకు పిల్లలే ప్రపంచం. వాళ్ల బాగోగులు చూస్తూ జాగ్రత్తగా పెంచడంలోనే ఆమెకు సమయమంతా గడుస్తుంటుంది. పిల్లలు పెరిగి పెద్దయ్యే క్రమంలో ఎప్పుడు ఎలాంటి అల్లరి పనులు చేశారో అన్నీ అమ్మకు గుర్తుంటాయి. అమ్మ తనివితీరా మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది. ఎన్నో మధురానుభూతులను మూటకట్టుకుంటుంది. చూస్తుండగానే రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచి పిల్లలు పెద్దయిపోతారు. చదువులు, పరీక్షలు అంటూ క్షణం విరామం లేకుండా ఉంటారు. వాళ్లకి సమయం ఉన్నప్పుడు మాత్రమే చిన్నప్పటి తీపి జ్ఞాపకాల గురించి అమ్మానాన్నలు చెప్పాల్సి వస్తుంది. దీనివల్ల పిల్లలు పూర్తి స్థాయిలో సంతోషాన్ని ఆస్వాదించలేకపోతున్నారని భావించింది మేఘన్‌. పిల్లల్ని పెంచుతూ ఒక అమ్మగా తను ఎంత ఆనందం పొందిందో... అంతే సంతోషాన్ని పిల్లలకు కూడా అందించాలనుకుంది. తమ బాల్యాన్ని మళ్లీ మళ్లీ చూసుకుంటూ పిల్లలు మురిసిపోవాలనుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు తన స్నేహితురాలు అనుసరిస్తున్న ఈ మెయిల్‌ ప్రక్రియ గురించి తెలిసింది. వెంటనే పిల్లల పేరిట ఈ మెయిల్స్‌ క్రియేట్‌ చేసేసింది మేఘన్‌.

మార్కెల్‌ మెయిల్‌...

రోజూ పడుకునే ముందు ఆ రోజు పిల్లలు చేసిన అల్లరి పనులు, ఫన్నీ ఇన్సిడెంట్స్‌ గురించి రాసి వాళ్లిద్దరికీ మెయిల్‌ చేస్తుంది మేఘన్‌. సందర్భానుసారం తీసిన ఫొటోలు, వీడియోలను కూడా జతచేస్తుంది. పిల్లల మొదటి అడుగులు, వచ్చీరాని మాటలు, ఆట పాటల... ఇలా వాళ్ల బాల్యాన్ని ఏరోజుకారోజు మెయిల్‌ చేస్తోంది. రిపోర్ట్‌ కార్డులు, భోజనాల వేళ అలకలు, పిల్లలిద్దరి మధ్య పెరిగే అనుబంధం... ఇలా ఎన్నింటినో మెయిల్‌ ద్వారా పంపిస్తోంది. ‘‘పిల్లలు మెయిల్‌ చూస్తారా?’’ అని ఎవరైనా ప్రశ్నిస్తే ‘నా పిల్లలు పెద్దయ్యాక అంటే పదహారు లేదా పద్దెనిమిదేళ్లు వచ్చాక వాళ్లకి ఈ మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తాను. వీటిలో వాళ్ల బాల్యం ఉందని చెబుతాను. సమయం ఉన్నప్పుడల్లా చూసుకుని ఆనందించమంటాను. ఇదే తల్లిగా నేను వాళ్లకిచ్చే అద్భుతమైన బహుమతి.’ అంటూ సమాధానమిస్తారు మేఘన్‌.


పేరెంటింగ్‌ పాఠం

మేఘన్‌ మార్కెల్‌ పంపిన మెయిల్స్‌ భవిష్యత్తులో పిల్లలకు మరుపురాని అనుభూతిని అందిస్తాయి. వాళ్ల చిన్నతనంలోకి తొంగిచూసే అవకాశాన్ని కల్పిస్తాయి. వాళ్ల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి. అమెరికాలోని కాన్షియస్‌ కో పేరెంటింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకుడైన డోర్సీ పోర్టర్‌ మాట్లాడుతూ ‘‘మేఘన్‌ అనుసరిస్తున్న ఈ మెయిల్‌ ప్రక్రియ అనేది తల్లి బిడ్డల భావోద్వేగాలకు మాత్రమే పరిమితమైన అంశం కాదు, ఎంతో పకడ్బందీగా రూపొందించిన పేరెంటింగ్‌ పాఠం’’ అంటూ ప్రశంసించారు.

ఆలియా కూడా...

ఆలియా భట్‌ కూడా తన రెండేళ్ల కూతురు రాహా కోసం ఈ మెయిల్‌ ఐడి క్రియేట్‌ చేసినట్లు ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ చెప్పింది. నెలవారీ సంఘటనల సమాహారాన్ని ఫొటోలు, వీడియోలతో సహా తన కూతురికి మెయిల్‌ చేస్తున్నట్లు తెలిపింది. రాహా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అమూల్యమైన క్షణాలను మెయిల్‌ చేశానంది. ఈ మెయిల్‌ ఐడీని రాహాకు పద్దెనిమిదేళ్లు వచ్చాక ఆమెకు బహుమతిగా ఇవ్వడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పింది. ఓ స్నేహితురాలి ద్వారా ఈ అంశం తెలిసిందనీ తనకు బాగా నచ్చిందనీ తన కూతురికి ఇంతకంటే మంచి బహుమతి వేరే ఏదీ ఉండదని చెప్పుకొచ్చింది ఆలియా.

2.jpg

Updated Date - Oct 09 , 2025 | 03:23 AM