Medicinal Benefits of Vamu Leaves: వాము ఆకుల్లో ఘాటైన ఔషధ గుణాలు
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:24 AM
వాము, తులసీ, పుదీనా ఈ మూడు ఒకే కుటుంబానికి చెందిన మొక్కలు. అందుకే వీటి ఘాటైన వాసన, ఔషధగుణాలు..
వాము, తులసీ, పుదీనా- ఈ మూడు ఒకే కుటుంబానికి చెందిన మొక్కలు. అందుకే వీటి ఘాటైన వాసన, ఔషధగుణాలు కొంతవరకు పోలికలు కలిగివుంటాయి. వాము ఆకులను చేత్తో నలిపితే వచ్చే బలమైన వాసనకు కారణం థైమాల్ అనే నూనె. ఇది సూక్ష్మక్రిములను సంహరించే గుణం కలిగి ఉండడం వలన ఆకులు సహజ యాంటీసెప్టిక్‌గా పని చేస్తాయి. తులసీ, పుదీనాకి కూడా ఈ తరహా ఔషధ గుణాలే ఉన్నాయి. వాము ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలను మన పూర్వీకులు గుర్తించి గ్రంధస్తం చేశారు. ఆ వివరాలలోకి వెళ్తే..
వాము ఆకులు ఉష్ణ స్వభావం కలిగినవి. వాతం, కఫాలను తగ్గిస్తాయి. కడుపు నొప్పిని తగ్గించడంలో, జీర్ణాగ్ని వెలిగించడంలో ప్రత్యేకమైన గుణం కలిగినవి! వాము ఆకులు ఘాటైన వగరుతో కూడిన కారపు రుచి కలిగి, మిరప కారానికి సమానంగా వేడిని కలిగిస్తాయి.
వాము ఆకులకు అజీర్ణాన్ని తగ్గించే శక్తి ఉంది. అందుకే అజీర్తితో బాధపడే వారు క్రమం తప్పకుండా వాము ఆకులను తింటే ఈ సమస్య తొలగిపోతుంది.
వామాకులు శ్వాసకోస సమస్యలకు ఉపశమనం కలిగిస్తాయి. దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలకు వామాకులు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు.
వాము ఆకులు కడుపులో ఉండే గడ్డలను కరిగిస్తాయి. నులిపురుగులను చంపుతాయి. విషదోషాలు ఏవైనా ఉంటే వాటిని కూడా హరిస్తాయి.
వాము ఆకులు శరీరానికి వేడిని కలిగిస్తాయి. అందువల్ల వేడితత్వం ఉన్న వారు పరిమితంగా తీసుకోవాలి. ముఖ్యంగా పురుషులు వీటిని తక్కువ తినాలి. లేకపోతే శుక్రకణాలు తగ్గే ప్రమాదం ఏర్పడవచ్చు.
గంగరాజు అరుణాదేవి