Share News

Arunika Kumar: అరుణకాంతులు

ABN , Publish Date - Dec 24 , 2025 | 06:23 AM

ఒకవైపు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ రాజసం.. మరోవైపు తిహాడ్‌ జైలు గోడల మధ్య నిశ్శబ్దం. ఈ రెండు విభిన్న ప్రపంచాలను తన కూచిపూడి నృత్యంతో కలిపిన అసాధారణ ప్రయాణం .....

Arunika Kumar: అరుణకాంతులు

ఒకవైపు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ రాజసం.. మరోవైపు తిహాడ్‌ జైలు గోడల మధ్య నిశ్శబ్దం. ఈ రెండు విభిన్న ప్రపంచాలను తన కూచిపూడి నృత్యంతో కలిపిన అసాధారణ ప్రయాణం అరుణిమ కుమార్‌ది. కళ కేవలం ప్రదర్శనకు మాత్రమే కాదని, అది మానవత్వానికి, మానసిక స్వస్థతకు, సాంస్కృతిక వారధికి ఓ శక్తివంతమైన సాధనమని ఆమె నిరూపిస్తున్నారు. లండన్‌ను కేంద్రంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో కూచిపూడి కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ వేలాదిమంది జీవితాల్లో స్ఫూర్తి నింపుతున్నారు.

ఇటీవలే కింగ్‌ చార్లెస్‌3 చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ‘బ్రిటిష్‌ ఎంపైర్‌ మెడల్‌’ అందుకున్న తొలి కూచిపూడి నృత్యకారిణిగా అరుణిమ చరిత్ర సృష్టించారు. కళ ద్వారా సమాజ సేవకు, సాంస్కృతిక సమ్మేళనానికి ఆమె చేస్తున్న కృషికి దక్కిన అరుదైన గౌరవమిది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి డిగ్రీలు అందుకుని ఫైనాన్స్‌ రంగంలో పనిచేసిన అరుణిమ జీవితం ఓ అరుదైన మలుపు తీసుకుంది. తీవ్ర అనారోగ్యంతో ఆపరేషన్‌ థియేటర్‌లో మృత్యువుతో పోరాడుతున్నప్పుడు ఆమె ఒకటే అనుకున్నారు. ‘‘ఒకవేళ నేను బతికితే నా జీవితాన్ని అర్థవంతంగా మలచుకోవాలి’’ అని. ఆ సంకల్పమే ఆమెను చిన్నప్పుడు ఎంతగానో ప్రేమించిన కూచిపూడి వద్దకు చేర్చింది.

నాట్యంతో పరివర్తన

ఢిల్లీలోని తిహాడ్‌ జైలులో అరుణిమ చేస్తున్న కృషి ఆమె ప్రస్థానంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన అంశం. ఆసియాలోనే అతిపెద్ద కారాగారాల్లో ఒకటైన ఈ జైలులో ఆమె ఖైదీలకు కూచిపూడి నేర్పిస్తున్నారు. ‘‘ప్రతి మనిషిలోనూ ఒక అంతర్గత లయ ఉంటుంది. దానిని ప్రోత్సహిస్తే వారి మనసు, శరీరం, హృదయం పరివర్తన చెందుతాయి’’ అంటారు అరుణిమ. ఒకప్పుడు తనను చిత్రహింసలు పెట్టిన భర్తను హత్యచేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళ అరుణిమకు ఎదురైంది. ‘ఇక్కడ మీరు ఖైదీలా బందీగా ఉన్నానని అనుకుంటున్నారా?’ అన్న ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం అరుణిమను కదిలించివేసింది. ‘‘లేదు, ఇక్కడే స్వేచ్ఛగా ఉన్నాను. రోజూ దెబ్బలు తినే భయం లేదు. భయంతో నిద్ర లేవాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడే నాకు నిజమైన స్వేచ్ఛ దొరికింది’’ అన్న ఆమె మాటలు ‘బంధిని’ అనే నృత్యరూపకానికి ప్రాణం పోశాయి. ‘నిజమైన ఖైదీ ఎవరు?’ అనే ప్రశ్నను ఈ రూపకం సంధిస్తుంది.


భవిష్యత్‌ తరాలకు వారసత్వం

లండన్‌లోని తన స్టూడియోలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎందరికో అరుణిమ గురువుగా మారారు. గోల్డ్‌మన్‌ సాక్స్‌ వంటి సంస్థల్లో పనిచేసే ఉన్నతోద్యోగులు సైతం ఆమె వద్ద నృత్యం నేర్చుకుంటూ మానసిక ప్రశాంతత పొందుతున్నారు. ‘‘ఈ నృత్యం మా జీవితంలో ఒక భాగమైపోయింది. ఇది మా మనసు, శరీరం, ఆత్మను ఏకం చేస్తోంది’’ అని ఆమె విద్యార్థులు చెబుతారు. భారతీయ కళను విదేశీ గడ్డపై ప్రదర్శిస్తున్న ఆమె... ఒక సంప్రదాయాన్ని కాపాడటం లేదు.. దానికి కొత్త అర్థాన్ని ఇస్తూ కొత్త తరానికి అందిస్తున్నారు. అణచివేతకు గురైనవారికి, తమ మూలాలు వెతుక్కుంటున్న వారికి... ఇలా ఎందరికో నాట్యంతో ఒక చికిత్సలా, స్ఫూర్తి దీపికలా దారి చూపుతున్నారు.

ప్రయాణాన్ని మార్చిన క్షణం

యూకేకి వెళ్లిన తొలినాళ్లలో భారతీయ శాస్త్రీయ నృత్యంపై, ముఖ్యంగా కూచిపూడిపై అక్కడి వారికి ఉన్న అవగాహన తక్కువని అరుణిమ గ్రహించారు. ప్రవాస భారతీయ యువత తమ మూలాలతో సంబంధం కోల్పోతున్నారని గమనించారు. తన నాట్యం ద్వారా ఆ కొరతను తీర్చాలని సంకల్పించారు. సవాళ్లను అధిగమించి లండన్‌లోని సౌత్‌బ్యాంక్‌ సెంటర్‌లో ప్రదర్శన ఇచ్చే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ క్షణం ఆమె ప్రయాణాన్ని మార్చేసింది. నేడు భారతదేశం వెలుపల అతిపెద్ద కూచిపూడి శిక్షణ సంస్థను ఆమె నడుపుతున్నారు. ఏటా 250 మందికిపైగా విద్యార్థులకు శిక్షణ ఇస్తూ బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌ వంటి అత్యున్నత వేదికలపై భారతీయ కళను ప్రదరిస్తున్నారు.

Updated Date - Dec 24 , 2025 | 06:23 AM