Share News

Health: మోకాళ్ల నొప్పులా?

ABN , Publish Date - Jan 20 , 2025 | 04:04 AM

సాధారణంగా మహిళలకు వయసు పెరిగేకొద్దీ మోకాళ్లలో మృదులాస్థి అరిగిపోతుంటుంది.

Health: మోకాళ్ల నొప్పులా?

సాధారణంగా మహిళలకు వయసు పెరిగేకొద్దీ మోకాళ్లలో మృదులాస్థి అరిగిపోతుంటుంది. దీనివల్ల మెట్లు ఎక్కేటపుడు, దిగేటపుడు, నడుస్తున్నపుడు మోకాళ్లలో విపరీతంగా నొప్పి వస్తుంది. తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా వరకు ఈ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆ చిట్కాల వివరాలు...

అల్లం నీళ్లు : స్టవ్‌ మీద గిన్నె పెట్టి రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించండి. దీనిలో ఒక చెంచా అల్లం తురుం, ఒక చెంచా పసుపు వేసి రెండు నిమిషాలు ఉడికిన తరవాత ఈ నీళ్లను వడకట్టి అందులో ఒక చెంచా తేనె కలిపి తాగండి. ఇలా రోజూ తాగితే మోకాళ్ల నొప్పి తగ్గుతుంది.

పసుపు పాలు : ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, ఒక చెంచా తేనె కలుపుకుని తాగుతూ ఉంటే మోకాళ్ల నొప్పి, వాపు తగ్గుతాయి. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, పాలలోని కాల్షియం కలిసి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

దాల్చిన చెక్క టీ : స్టవ్‌ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి వేడిచేయండి. అందులో ఒక అంగుళం పొడవున్న దాల్చిన చెక్క లేదా అర చెంచా దాల్చిన చెక్క పొడి వేసి అయిదు నిమిషాలు ఉడకనివ్వండి. తరవాత ఈ నీటిని వడకట్టి అందులో ఒక చెంచా తేనె కలుపుకుని తాగండి. ఇలా రెండు రోజులకోసారి తాగుతూ ఉంటే మోకాళ్లలో గుజ్టు పెరిగి నొప్పి తగ్గుతుంది.


అరటిపండు : అరటిపండులో ఎ, బి, సి విటమిన్లతోపాటు ఐరన్‌, కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, పిండి పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కండరాలను బలోపేతం చేస్తాయి. ప్రతిరోజూ ఒక అరటి పండు తింటూ ఉంటే మోకాళ్లలోని కీళ్లు పెళుసుబారకుండా మృదువుగా కదులుతాయి. దీంతో వాపు, నొప్పి బాధించవు.

దానిమ్మ గింజలు : వీటిలో సి విటమిన్‌, పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి మోకాళ్లలో కీళ్ల చుట్టూ ఆవరించి ఉన్న గుజ్జును కాపాడతాయి. ప్రతిరోజూ గుప్పెడు దానిమ్మ గింజలు తింటూ ఉంటే మోకాళ్ల నొప్పులు రావు.

వాము : వాము వాత గుణాన్ని హరిస్తుంది. మోకాళ్లలో కదలికలను సులభతరం చేస్తుంది. ప్రతిరోజూ భోజనం తరవాత ఒక చెంచా వాము తింటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

పోషకాహారం : నానబెట్టిన బాదం, వాల్‌నట్స్‌, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలను తరచూ తినాలి. పాలకూర, మెంతికూర, తోటకూరలను ఆహారంలో చేర్చుకుంటే మోకాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చిక్కుళ్లు, గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మోకాళ్ల సమస్యలు రావు.

Updated Date - Jan 20 , 2025 | 04:04 AM