Share News

Kavitha Reddy Foundation: ఈ ఆట మార్పు కోసం

ABN , Publish Date - May 29 , 2025 | 06:19 AM

రూరల్ మహిళల ఆరోగ్యం, విద్య మరియు క్రీడల అభివృద్ధికి కవితారెడ్డి నిరంతరంగా కృషి చేస్తున్నారు. ఆమె స్థాపించిన ఫౌండేషన్‌ ద్వారా వైద్య సేవలు, అవగాహన కార్యక్రమాలు, ఫుట్‌బాల్‌ శిక్షణతో గ్రామీణ బాలికలకు వెలుగునిస్తోన్నారు.

Kavitha Reddy Foundation: ఈ ఆట మార్పు కోసం

వైద్యం... ఆమె వృత్తి. ఎంతోమంది పేద మహిళలకు వైద్య సహాయం అందిస్తున్నారు. ఫుట్‌బాల్‌... ఆమెకు ఆసక్తి. గ్రామీణ బాలికలకు ఉచితంగా శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తున్నారు. తన పేరిట ఓ అకాడమీ నెలకొల్పి... మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి... రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా నిజామాబాద్‌ ప్రజల ప్రశంసలు అందుకొంటున్న సామాజిక కార్యకర్త, గైనకాలజిస్టు... డాక్టర్‌ కవితారెడ్డి ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.

‘‘నిత్యం మన చుట్టూ ఎన్నో సామాజిక సమస్యలు. వాటి పరిష్కారానికి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూస్తుంటాం. కానీ ఈ సమాజంలో జీవిస్తున్న వ్యక్తులుగా మనమూ కొంత బాధ్యత తీసుకోవాలి. అందుకే నావంతు ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఎవరి మెప్పు కోసమో కాదు... గ్రామీణ బాలికలు, మహిళల వికాసం కోసం. ముప్ఫై ఏళ్ల కిందట నిజామాబాద్‌లో మొదలైంది నా ఈ ప్రయాణం. నా వద్దకు ఎక్కువగా గర్భిణులు, బాలికలు వైద్యం కోసం వచ్చేవారు. కొందరిలో బలహీనత, అలసట లాంటివి గమనించాను. అనుమానం వచ్చి వారికి వైద్య పరీక్షలు చేయించాను. ముఖ్యంగా బాలికల్లో రక్తహీనత (అనీమియా) ఉన్నట్టు గుర్తించాను. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సరైన పోషకాహారం లభించక తలెత్తిన సమస్య ఇది. వారికి అవగాహన కల్పించడంతో పాటు వైద్యం, అవసరమైన మందులు ఇచ్చాను. అయితే ఇది ఒకరిద్దరి సమస్య కాదని అర్థమైంది. అది నిరంతరం కొనసాగిల్సిన ప్రక్రియ. ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు తేవాలన్న ఉద్దేశంతో ‘డాక్టర్‌ కవిత ఫౌండేషన్‌’ను నెలకొల్పాను. దాని ద్వారా ఉచిత వైద్య సేవలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను.

bindi.jpg

విద్యార్థినుల కోసం...

మావారు డాక్టర్‌ రవీందర్‌రెడ్డి సహకారంతో ఫౌండేషన్‌ ద్వారా సేవలు మరింత విస్తరించాను. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థినుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాను. జిల్లాలోని పాఠశాలల్లో సుమారు పదివేల మంది బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించాం. రక్తహీనత ఉన్నవారికి అవగాహన కల్పించాం. తగు సూచనలు, మందులు ఇచ్చాం. దీంతోపాటు ఇతర సేవా కార్యక్రమాలు కూడా మా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టాం.


అకాడమీకి అంకురార్పణ...

ఇదిలావుంటే... 2019లో కొన్ని క్లబ్స్‌ కలిసి నిజామాబాద్‌లో ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించాయి. దానికి మా ఫౌండేషన్‌ సహకారం అందించింది. స్థానికంగా మంచి స్పందన వచ్చింది. ఇది నాలో కొత్త ఆలోచనలను రేకెత్తించింది. ఆ క్రమంలోనే గ్రామీణ ప్రాంత బాలికలకు ఫుట్‌బాల్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ పోటీల నేపథ్యంలో నేను గమనించింది ఏంటంటే... గ్రామీణ బాలికల్లో ఫుట్‌బాల్‌ ఆడగలిగే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని. అయితే తగిన ప్రోత్సాహం, ఆర్థిక వనరులు లేక వెనకడుగు వేస్తున్నారని తెలుసుకున్నాను. ఆసక్తివున్న వారిని గుర్తించి సరైన శిక్షణ అందిస్తే వీళ్లు కూడా మెరికల్లా తయారవుతారని అనుకున్నాను. అందుకు అనుగుణంగానే ఆరేళ్ల కిందట ‘డాక్టర్‌ కవితారెడ్డి ఫుట్‌బాల్‌ అకాడమీ’ ఏర్పాటు చేశాను.

ఆదరణ కల్పించాలని...

దేశంలో క్రికెట్‌, టెన్నిస్‌ తదితర క్రీడలకు ఉన్న ఆదరణ ఫుట్‌బాల్‌కు లేదు. ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఫుట్‌బాల్‌ వైపు ఎవరూ రావడంలేదు. ముఖ్యంగా మహిళలు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఆసక్తి చూపుతున్నా వారికి ప్రోత్సాహం లభించడంలేదు. ప్రభుత్వాలు, కార్పొరేటు సంస్థలు కూడా ఇతర క్రీడలకు ఇచ్చినంత ప్రాముఖ్యత ఫుట్‌బాల్‌కు ఇవ్వడంలేదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఫుట్‌బాల్‌కు పూర్వ వైభవం తేవడానికి నావంతు ప్రయత్నం చేయాలనుకున్నాను. దానిలో భాగమే అకాడమీ ఏర్పాటు. అందులో ఒక కోచ్‌ను నియమించాం.

క్రీడా పోటీలు...

మా అకాడమీలో హాస్టల్‌ సదుపాయం కూడా కల్పించాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆర్థిక స్తోమత లేని బాలికలకు ఉచితంగా వసతి, శిక్షణ అందిస్తున్నాం. అకాడమీలో శిక్షణ పొందిన పలువురు అమ్మాయిలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. వివిధ స్థాయిల్లో పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. గత ఏడాది రాష్ట్ర ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ మార్గదర్శకత్వంలో సీనియర్‌ ఉమెన్‌ ఫుట్‌బాల్‌ టోర్నీని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ నెల 15 నుంచి 22 వరకు మహిళా కళాశాలలో ఎనిమిది రోజులపాటు తెలంగాణ ఉమెన్స్‌ లీగ్‌ నిర్వహించాం. రాష్ట్రానికి చెందినవారే కాకుండా బిహార్‌, చత్తీ్‌సఘడ్‌ క్రీడాకారులు కూడా పోటీపడ్డారు.

ఇంకా ఎన్నో...

మా ఫౌండేషన్‌ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తున్నాం. రక్తహీనతపై అవగాహన కల్పిస్తున్నాం. మహిళలు, బాలికలకు పోషకాహారం ఆవస్యకతను వివరించి చెబుతున్నాం. మా నర్సింగ్‌హోమ్‌కు వచ్చేవారికి తక్కువ ఖర్చులోనే వైద్యం చేస్తున్నాం.

పేదలకు ఉచిత సేవలు అందిస్తున్నాం. భవిష్యత్తులో మా కార్యకలాపాలను విస్తరించి, మరింతమందికి చేరువ కావాలనేది నా సంకల్పం.’’

పొలసాని సంపత్‌రావు, నిజామాబాద్‌


చదువుకొనే రోజుల్లో...

ఒకప్పుడు నేనూ ఆటల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. చదివే రోజుల్లో త్రోబాల్‌ ఆడేదాన్ని. తరువాత వివిధ కారణాలతో ఆట పక్కకు వెళ్లిపోయింది. ఫుట్‌బాల్‌ అనేది ఆట మాత్రమే కాదు... శారీరకంగా, మానసికంగా దృఢంగా మారడానికి, సామర్థ్యం పెంచుకోవడానికి ఉపయోగపడే చక్కని వ్యాయామం కూడా. ఒక మ్యాచ్‌ ఆడాలంటే చిన్నపాటి విరామంతో గంటన్నరసేపు మైదానంలో నాన్‌స్టా్‌పగా పరుగెత్తాలి. నైపుణ్యంగా బంతిని తీసుకువెళ్లి గోల్‌లో వేయాలి. ఇది సాధారణ విషయం కాదు. అంతటి సత్తా గ్రామాల్లోని మన బాలికల్లో ఉంది. దాన్ని వెలికి తీసి, సరైన దారిలో పెడితే వారు అద్భుతాలు సాధిస్తారు. నా ప్రయత్నం కూడా అదే.


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 02:57 PM