Share News

Kamya Karthikeyan: సాధించింది... సమున్నతంగా!

ABN , Publish Date - Jan 20 , 2025 | 04:11 AM

ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో మొదట ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది కామ్య.

Kamya Karthikeyan: సాధించింది... సమున్నతంగా!

మనసుంటే మార్గం ఉంటుంది. ఈ సామెతను నిజం చేసి, ఏడు ఖండాల్లోని ఏడు పర్వతాలను అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది 17 ఏళ్ల కామ్య కార్తికేయన్‌. ఈ ముంబయి వాసి పర్వతారోహణ ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకుందాం.

ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంతో మొదట ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది కామ్య. ఆ తర్వాత యూర్‌పలోని ఎల్‌బ్రస్‌ పర్వతం, ఆస్ట్రేలియాలోని కోషిస్కో పర్వతం, దక్షిణమెరికాలోని ఏకన్‌కాగ్వా పర్వతం, ఉత్తరమెరికాలోని డెనాలి పర్వతం, ఆ తర్వాత ఆసియాలోని ఎవరెస్టు పర్వతాలను వరుసగా అధిరోహించింది. చివరిగా ఏడవ పర్వతాన్ని అధిరోహించడం కోసం అంటార్కికాకు చేరుకున్న కామ్య, గత నెల 24న తన తండ్రి, ఇండియన్‌ నేవీ కమాండర్‌ ఎస్‌.కార్తికేయన్‌తో కలిసి విన్సన్‌ పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. ఆ విధంగా ప్రపంచంలోని ఏడు ఎత్తయిన పర్వతాలను అధిరోహించడం ద్వారా ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన ప్రదేశాలకు చేరుకుంది. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించి చూపించింది.

ట్రెక్కింగ్‌తో మొదలుపెట్టి...

పర్వతారోహణ పట్ల తన తండ్రికున్న మక్కువ నుంచి ప్రేరణ పొందిన కామ్య, చిన్న వయసు నుంచే ట్రెక్కింగ్‌ మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఏడేళ్ల వయసులో పర్వతారోహణ పట్ల ఆసక్తి ఏర్పడడానికంటే ముందు కామ్యకు ట్రెక్కింగ్‌ మీద ఆసక్తి పెరిగింది. మూడేళ్ల వయసు నుంచే ఎక్కువ దూరాల పాటు ట్రెక్కింగ్‌ మొదలుపెట్టిన కామ్య, 2015లో, ఏడేళ్ల వయసులో చంద్రశిల పీక్‌కు ట్రెక్కింగ్‌ చేయడం ద్వారా తన హిమాలయ పర్వతారోహణ ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఆ తర్వాత మరింత పురోగతి సాఽధించి, 2016, 2017లో హర్‌ కి దున్‌, కేదార్‌నాథ్‌ పీక్‌, రూప్‌కుండ్‌ లేక్‌లకూ, ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌కూ ట్రెక్కింగ్‌ చేసి ఇంతటి మైలురాయిని అందుకున్న ప్రపంచంలోని రెండవ బాలికగా పేరు తెచ్చుకుంది. 2019లో కామ్య బ్రిగు లేక్‌ను దాటి, హిమాచల్‌ ప్రదేశ్‌లోని సార్‌ పాస్‌ను దాటేసింది.


21 అంతస్తులు... 20 కిలోల బరువు...

పిల్లలు సాధించిన విజయాలకు పొంగిపోని తల్లితండ్రులు ఉండరు. కామ్య తల్లి లావణ్య కార్తికేయన్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. కూతురు సాధించిన విజయాలు చూసి గర్వంతో పొంగిపోతున్న ఆ తల్లి కామ్య గురించి మాట్లాడుతూ... ‘‘ఇప్పటివరకూ సాధించిన విజయాల కోసం కామ్య ఎన్ని త్యాగాలు చేసిందో, ఎంత కష్టపడిందో తల్లిగా నాకు తెలుసు. కామ్య ప్రతి రోజూ 2 నుంచి 3 గంటలు సాధన చేస్తుంది. పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తుతుంది. ముంబయిలో ఉండేవాళ్లం కాబట్టి అక్కడ మలబార్‌ కొండల మీద ట్రెక్కింగ్‌ సాధన చేస్తూ ఉండేది. అలాగే మేం 21వ అంతస్తులో ఉండేవాళ్లం. కాబట్టి పర్వతారోహణకు తగినట్టుగా కండరాలను బలపరుచుకోవడం కోసం 10 నుంచి 20 కిలోల బరువుతో పైకీ కిందకూ ఎక్కి దిగడం సాధన చేసింది. ఇలా కామ్య అనుకున్నది సాధించడం కోసం శాయశక్తులా కష్టపడింది. పట్టుదలగా కృషి చేసింది కాబట్టే ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలనే కలను సాకారం చేసుకోగలిగింది. 2021లో కామ్య, ప్రధానమంత్రి బాలశక్తి పురస్కారాన్ని పొందింది. ప్రధాని మాటలే కామ్యకు ప్రేరణగా మారాయని అనిపిస్తుంది. ఈ సందర్భంగా నేను తల్లులందరికీ ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. తల్లులందరం దృఢంగా ఉండగలిగితే, మనం దృఢమైన ఆడపిల్లలను పెంచగలుగుతాం’’ అంటూ కామ్య గురించి చెప్పుకొచ్చింది లావణ్య కార్తికేయన్‌. కామ్య కథ ప్రపంచవ్యాప్త యువతకు, ప్రత్యేకించి కన్న కలలను నిజం చేసుకోవాలనే అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుంది. ప్రపంచంలోని ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించడం ద్వారా విజయాలను సాధించడానికి వయసుతో సంబంధం లేదనీ, కలలను సాకారం చేసుకోవాలనే దృఢ సం కల్పం, అంకితభావాలుంటే ఎవరైనా అనుకున్నది సాధించగలుగుతారనీ కామ్య నిరూపించింది.

Updated Date - Jan 20 , 2025 | 04:11 AM