Share News

Entrepreneurship: పర్యావరణహితంగా ఉపాధి మార్గంగా

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:57 PM

ఆహార పదార్థాల కోసం ప్లాస్టిక్‌ రహిత కంటైనర్ల తయారీతో... పర్యావరణహిత ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఐదున్నరేళ్లలో కంపెనీని ఐదు కోట్లకు పైబడిన టర్నోవర్‌కు తీసుకువెళ్లి...

Entrepreneurship: పర్యావరణహితంగా ఉపాధి మార్గంగా

స్వశక్తితో ఎదగాలన్న తపన ఆమెను కుదురుగా కూర్చోనివ్వలేదు. ఆ తపనతోనే లక్షల రూపాయలు తెచ్చిపెట్టే కొలువు వదిలేసి... భర్త, సోదరుడితో కలిసి అంకుర సంస్థను నెలకొల్పారు.

ఆహార పదార్థాల కోసం ప్లాస్టిక్‌ రహిత కంటైనర్ల తయారీతో... పర్యావరణహిత ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఐదున్నరేళ్లలో కంపెనీని ఐదు కోట్లకు పైబడిన టర్నోవర్‌కు తీసుకువెళ్లి... తనలాంటి ఎంతోమంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ధన్విత సత్యానంద్‌ కథ ఇది.

‘‘చదువుకొనే రోజుల్లో నాకంటూ ప్రత్యేకమైన లక్ష్యాలేవీ లేవు. మంచి మార్కులు తెచ్చుకోవాలి. అందరు అమ్మాయిల్లా మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. ఇవే నా కోరికలు. కానీ ఒక్కసారి కొలువులో కుదురుకున్నాక... నా గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడే అర్థమైంది... ఇది కాదు నేను కోరుకున్న జీవితం అని. నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలి. కష్టపడి పని చేసి మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కోరుకున్నా. ఇదే విషయం మావారు శ్రీనిధి రాఘవన్‌, నా సోదరుడు భరత్‌ సత్యానంద్‌లకు చెప్పాను. వారూ అందుకు మద్దతునిచ్చారు. అలా ముగ్గురం కలిసి పలు బిజినె్‌సలు చేసి, చివరకు ‘ఏకాజ్‌’ స్టార్ట్‌పను నెలకొల్పాం. ఈ కంపెనీ ద్వారా మేం కోరుకున్నట్టే మరికొందరికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలుగుతున్నాం. దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ, త్యాగాలు ఉన్నాయి. కర్ణాటక టుమ్కూరు జిల్లా మధుగిరి మాది. పాఠశాల విద్యాభ్యాసం తరువాత డిగ్రీ కోసం బెంగళూరుకు వచ్చాను. 2007లో ‘మహావీర్‌ జైన్‌ కాలేజీ’ నుంచి బీఎస్సీ డిగ్రీ, 2010లో పూణె ‘సింబియోసిస్‌ ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ’ నుంచి ‘ఎడ్యుకేషన్‌ అడ్మినిస్ర్టేషన్‌’లో పీజీ పట్టాలు అందుకున్నాను. పీజీ అవ్వగానే బెంగళూరు ‘ఆడెన్‌ పబ్లిక్‌ స్కూల్‌’లో అడ్మినిస్ర్టేటివ్‌ కోఆర్డినేటర్‌గా చేరడంతో నా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది.


ఉద్యోగాలు మారినా...

స్కూల్లో ఎక్కువ కాలం పని చేయలేకపోయాను. ఏడాది తిరక్కుండానే ఓ ఫైనాన్సియల్‌ కంపెనీలో రెండేళ్లకు పైగా సేవలు అందించాను. కార్పొరేట్‌ కొలువు, దానికి తగిన జీతం... అన్నీ బానే ఉన్నాయి. జీవితం సంతోషంగానే సాగిపోతోంది. కానీ ఏదో వెలితి. రాఘవన్‌, భరత్‌లదీ అదే పరిస్థితి. ఐటీ కంపెనీల్లో మంచి హోదాల్లో ఉన్నారు. కానీ రొటీన్‌ పని... ఒక మూస పద్ధతికి అలవాటుపడిపోయాం. మాకు అలా ఉండడం నచ్చలేదు. ఉద్యోగాలు మారినా సంతృప్తి లేకపోవడంతో ముగ్గురం రాజీనామా చేసేశాం. సొంతంగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాం. అలా 2015లో బెంగళూరులోనే ‘కార్టియర్‌ హోటల్స్‌’ పేరుతో ఫోర్‌ స్టార్‌ హోటల్‌ ఒకటి ప్రారంభించాం. అయితే అందులో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.

అప్పుడే తెలిసింది...

ఆతిథ్య, ఆహార రంగాల్లో ముడిసరుకు సేకరించడం, వినియోగించడం మధ్యన అంతరంవల్ల ఎంతో సమయం, వనరులు వృథా అవడాన్ని గమనించాం. సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాం. ఈ ఆలోచనతోనే మా రెండో వెంచర్‌... ‘ఆగ్రైన్జ్‌ సొల్యూషన్స్‌’ సంస్థను నెలకొల్పాం. ముడిసరుకు కొనుగోలులో వృథాను సాధ్యమైనంత తగ్గించడంపై దృష్టి పెట్టాం. చీజ్‌, బటర్‌ తదితర 450 రకాల ఉత్పత్తులను సరఫరా చేసేవాళ్లం. అదే సమయంలో కొవిడ్‌ విజృంభించడంవల్ల డిమాండ్‌ తగ్గి, నష్టాలు పెరిగాయి. అవి భరించలేక, సంస్థను పక్కన పెట్టేశాం. అరుతే దిగులు పడలేదు. మరో వినూత్న ఆలోచనతో 2020 చివర్లో ‘ఏకాజ్‌ బయోవేర్‌’ను ప్రారంభించాం. ఆహార పరిశ్రమకు ప్యాకింగ్‌ కంటైనర్లను సరఫరా చేసే సంస్థ ఇది.


పర్యావరణ హితం...

మన దగ్గర ప్లాస్టిక్‌ నిషేధం అంటున్నారు కానీ... అది పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు. దానివల్ల భూమికి భారం పెరిగిపోతోంది. పర్యావరణానికి ఎనలేని నష్టం వాటిల్లుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకొని బయోడీగ్రేడబుల్‌ ప్యాకింగ్‌ మెటీరియల్స్‌ తీసుకువస్తున్నాం. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పేపర్‌తో కప్స్‌, బౌల్స్‌, డబ్బాలు తయారు చేస్తున్నాం. ఫుడ్‌ డెలివరీ సమయంలో ఇవి లీకవుతాయనే సందేహాలు మా కస్టమర్ల నుంచి ఉత్పన్నమయ్యాయి. అయితే మేం రూపొందించేవాటికి ఆ సమస్య లేదు. దీని కోసం కంటైనర్లకు ప్రత్యేక కోటింగ్‌ వేస్తాం. వాడి పడేసిన ఆరు నెలల్లో ఇవి మట్టిలో కలిసిపోతాయి. మా ఉత్పత్తులు ‘సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ’ (సిపెట్‌) ధృవీకరించినవి.’’

ఐదు కోట్లు దాటిన ఆదాయం...

మా సంస్థ నెలకొల్పి ఐదేళ్లు పూర్తయింది. ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా, క్రమంగా అనుభవం గడించి, సమష్టి కృషితో నిలదొక్కుకున్నాం. ప్యాకింగ్‌ కంటైనర్ల తయారీకి ప్రత్యేక మిషన్లు ఏర్పాటు చేశాం. ఒక్కో మిషన్‌ నిమిషానికి నలభై నుంచి నలభై ఐదు డబ్బాలు ఉత్పత్తి చేస్తుంది. 50 ఎంఎల్‌ నుంచి 1000 ఎంఎల్‌ వరకు కాగితం డబ్బాలు సరఫరా చేస్తున్నాం. ఇప్పటివరకు కప్స్‌, బౌల్స్‌, కంటైనర్లు, మూతలు, బాక్స్‌ తదితర అన్నీ కలిపి నాలుగు కోట్ల యూనిట్స్‌ విక్రయించాం. 5.2 కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని రాబట్టిగలిగాం. అన్నిటికంటే ముఖ్యంగా నాలుగు లక్షల కిలోల ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించగలిగాం. తద్వారా ఆహార పరిశ్రమ ద్వారా వెలువడుతున్న కాలుష్యాన్ని కొంతవరకు అరికట్టగలిగాం. అందుకే ఈ ప్రయాణం మాకు లాభాలనే కాదు, ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తోంది.


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?

Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి

Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు

Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత

Updated Date - Feb 07 , 2025 | 11:57 PM