Share News

Iron Lady: జపాన్‌లో ఐరన్‌ లేడీ

ABN , Publish Date - Oct 23 , 2025 | 03:10 AM

జపాన్‌ రాజకీయాల్లో ఒక కొత్త యుగం ప్రారంభమయింది. జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎంపికయ్యారు. ఐరన్‌ లేడీ అని జపాన్‌ మీడియా ముద్దుగా పిలుచుకొనే తకైచికి ఆధునిక సంగీతమంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఒక మ్యూజిక్‌ బ్యాండ్‌లో భాగస్వామి కూడా..

 Iron Lady: జపాన్‌లో ఐరన్‌ లేడీ

జపాన్‌ రాజకీయాల్లో ఒక కొత్త యుగం ప్రారంభమయింది. జపాన్‌ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎంపికయ్యారు. ‘ఐరన్‌ లేడీ’ అని జపాన్‌ మీడియా ముద్దుగా పిలుచుకొనే తకైచికి ఆధునిక సంగీతమంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఒక మ్యూజిక్‌ బ్యాండ్‌లో భాగస్వామి కూడా..

‘‘లిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు ‘బ్లాక్‌ సాబాత్‌’ మ్యూజిక్‌ బ్యాండ్‌ పాటలు వింటూ ఉండేదాన్ని. హైస్కూల్‌కు వచ్చిన తర్వాత బమ్‌, స్మోక్‌ ఆన్‌ ది వాటర్‌ లాంటి పాటలు వినటం మొదలుపెట్టా. ఈ సమయంలోనే బాస్‌ గిటార్‌, కీబోర్డ్‌, డ్రమ్స్‌ వాయించటం నేర్చుకున్నా. ఒక బ్యాండ్‌లో భాగస్వామినయ్యా! ‘రోలింగ్‌ స్టోన్స్‌’ ఆల్బమ్‌లోని ‘జంపింగ్‌ జాక్‌ ఫ్లాష్‌’ లాంటి పాటలు పాడేదాన్ని. ఆ తర్వాత హైస్కూల్లో ఉన్న ఆడపిల్లలందరం కలిసి ఒక బ్యాండ్‌ పెట్టాం...’’ అంటారు తకైచి. ఇప్పటికీ ఆమె డ్రమ్స్‌ వాయిస్తూనే ఉంటారు. తనకు సంతోషం వచ్చినా.. దుఖం వచ్చినా డ్రమ్స్‌ వాయిస్తానంటారు. ‘‘కొన్ని సార్లు నాకు, నా భర్తకు మధ్య దెబ్బలాటలు అవుతూ ఉంటాయి. ఆయన మాట్లాడే మాటలు కానీ, ఆయన ప్రవర్తన కానీ నాకు నచ్చదు. అలాంటి సమయంలో ఆయన పడుకున్న తర్వాత ఎలకా్ట్రనిక్‌ డ్రమ్స్‌ వాయిస్తా. దీని వల్ల నాలో ఉన్న కోపం అంతా పోతుంది’’ అంటారు తకైచి.


చిన్నతనంలో...

తకైచి పుట్టింది.. పెరిగింది జపాన్‌లోని నారా అనే ప్రాంతంలో. హైస్కూల్‌ పూర్తయిన తర్వాత ఆమె కోబే విశ్వవిద్యాలయంలో చేరి పట్టభద్రురాలయ్యారు. చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ప్రత్యేక ఆసక్తి ఉండటంతో 1990లలో లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. షిన్‌జో అబీ, ఫ్యూమో కిషిదాలు ప్రధానులుగా ఉన్న సమయంలో తకైచికి ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యత లభించింది. వారి కేబినెట్‌లలో ఆమె మంత్రిగా పనిచేశారు. ఒకప్పటి బ్రిటిష్‌ ప్రధాని మార్గరెట్‌ థాచర్‌ను తన రోల్‌ మోడల్‌గా భావించే తకైచిని జపాన్‌ మీడియా - ‘ఐరన్‌ లేడీ’ అని ముద్దుగా పిలుచుకుంటుంది. ప్రస్తుతం జపాన్‌ సమాజంలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంది. యువతీ, యువకుల సంఖ్య తక్కువగా ఉంది. అంతే కాకుండా పాశ్చాత్య సంస్కృతి జపాన్‌లోకి చాపకింద నీరులా ప్రవేశించిందనే విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. వీటన్నింటిపైనా తకైచి దృష్టి పెట్టాల్సి ఉంది. అందుకే తకైచి తన ప్రసంగాల్లో దీన్నే ప్రధానమైన విషయంగా ప్రస్తావించారు. ‘‘నేను నా హామీలను నిలబెట్టుకుంటాను. ప్రతి తరాన్ని కలుపుకొని ముందుకు వెళ్లినప్పుడే అభివృద్ధి సాధించగలుగుతాం. మనం కొద్ది మందే ఉన్నాం. అందువల్ల అందరం గుర్రాల్లా పనిచేద్దాం. నేను కూడా వర్క్‌లైఫ్‌ బ్యాలెన్స్‌ అనే సూత్రాన్ని పక్కన పెట్టి పనిచేస్తాను. నేను పనిచేస్తూనే ఉంటాను...’’ అని ఆమె చేసిన వ్యాఖ్యలకు జపాన్‌లో సంచలనం చెలరేగింది. తన ముందు ఉన్నది పూలబాట కాదనే విషయం తకైచికి తెలుసు. ఈ విషయాన్ని కూడా ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘నేను ఇప్పుడు ఆనందంగా లేను. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నాకు అర్ధమవుతోంది. మనందరం కలిసి చాలా పనులు చేయాల్సి ఉంది. మనం అందరం కలిసి ఎల్‌డీఎ్‌ఫను నిలబెడదాం. ప్రజల ఆందోళలను ఆశలుగా మార్చే పార్టీగా తీర్చిదిద్దుదాం’’ అని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 03:10 AM