Aditi Nandi: 40ల్లో పవర్ చూపించారు...
ABN , Publish Date - Dec 15 , 2025 | 02:26 AM
నావల్ల కాదని ప్రయత్నించకుండా మానేస్తే ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేం అంటారు అదితి నంది.ముప్ఫై అయిదేళ్ల వయసులో బరువు తగ్గించుకోడానికి పవర్ లిఫ్టింగ్ శిక్షణ ప్రారంభించిన ఆమె తన తొలి అంతర్జాతీయ పోటీలోనే సత్తా చాటారు....
‘‘నావల్ల కాదని ప్రయత్నించకుండా మానేస్తే ఎప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేం’’ అంటారు అదితి నంది.ముప్ఫై అయిదేళ్ల వయసులో బరువు తగ్గించుకోడానికి పవర్ లిఫ్టింగ్ శిక్షణ ప్రారంభించిన ఆమె తన తొలి అంతర్జాతీయ పోటీలోనే సత్తా చాటారు. ఇటీవల థాయిలాండ్‌లో జరిగిన ‘యూడబ్ల్యూఎ్‌సఎ్‌ఫఎ్‌ఫ-వరల్డ్ ఛాంపియన్‌షి్‌ప’లో ఈ పశ్చిమబెంగాల్ మహిళ మూడు స్వర్ణ పతకాలతో మెరిశారు. కలలు కనడానికి, వాటిని నిజం
చేసుకోవడానికివయసు అడ్డంకి కాదంటున్న అదితి ప్రయాణం ఇది.
‘‘నాకు క్రీడలన్నా, సాహసాలు చేయడం అన్నా ఎప్పుడూ ఇష్టమే. అప్పుడప్పుడు ట్రెక్కింగ్ చేయడం సరదా. కానీ అంతవరకే. రోజూ ఆటలు ఆడే అలవాటు నాకు లేదు. చదువులో తీరిక లేకుండా ఉండడమే దానికి కారణం. నేను పుట్టి పెరిగింది పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో. చదువు పూర్తయ్యాక... ఉద్యోగంలో బిజీ అయిపోయాను. ప్రస్తుతం ఒక కార్పొరేట్ కంపెనీ హెచ్‌ఆర్ విభాగంలో సీనియర్ పొజిషన్లో ఉన్నాను. వృత్తి, కుటుంబ బాధ్యతలతో సాగిపోతున్న నా జీవితం అయిదేళ్ళ క్రితం కొత్త మలుపు తిరిగింది. కొవిడ్ కారణంగా ఇంటికే పరిమితం కావడంతో బరువు బాగా పెరిగిపోయాను. జిమ్‌లో చేరి, వ్యాయామాలు చేసినా ఫలితం పెద్దగా కనిపించలేదు. ‘‘పవర్ లిఫ్టింగ్ చెయ్యండి’’ అని ఒక ట్రైనర్ సలహా ఇచ్చారు. అప్పటివరకూ దాని గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. ప్రయత్నించి చూద్దామని మొదలుపెట్టాను. నేను కోరుకున్న ఫలితం కనిపించడమే కాదు... పవర్‌లిఫ్టింగ్ మీద ఆసక్తి కూడా బాగా పెరిగినా... పోటీల్లో పాల్గొంటానని, పతకాలు గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అయితే రాష్ట్ర స్థాయి ఎంపికల కోసం పత్రికల్లో ప్రకటన రావడం, ట్రైనర్లు, స్నేహితులు ప్రోత్సహించడంతో... ఉత్సాహంగానే పాల్గొని, నా ప్రతిభను ప్రదర్శించాను. ఆ తరువాత నా వీడియోను నేషనల్ జ్యూరీకి ఆ పోటీల నిర్వాహకులు పంపించారు. సూరత్‌లో జరిగిన నేషనల్స్‌కు పశ్చిమబెంగాల్ తరఫున ఇద్దరు పురుషులు, నేను ఎంపికయ్యాం. ఆ పురుషులిద్దరూ వివిధ కారణాల వల్ల పోటీల నుంచి మధ్యలోనే వెనుదిరిగారు. నేను మాత్రమే మిగిలాను. కోచ్, సరైన శిక్షణ లేకుండానే రజత పతకం గెలుచుకున్నాను.
ప్రమాదం జరగడంతో...
ఆ విజయం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నేను పవర్‌లిఫ్టింగ్ చేయడానికి అప్పటివరకూ నా తల్లిదండ్రులు, నా భర్త, అత్తింటివారు అభ్యంతరం చెప్పకపోయినా... ‘ఎందుకిలా శ్రమపడడం?’ అనే భావన వ్యక్తపరిచేవారు. కానీ నేషనల్స్‌లో పతకం సాధించాక... ‘‘దీన్ని నువ్వు సీరియ్‌సగా తీసుకోవాలనుకుంటే మంచి కోచ్ దగ్గర శిక్షణ తీసుకో’’ అని ప్రోత్సహించారు. తగిన కోచ్ కోసం చాలా ప్రయత్నించాను. ఎందుకంటే ట్రైనర్స్ అందరూ కోచ్‌లు కాదు. చివరకు కోల్‌కతాకే చెందిన పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్ జేసన్ మార్టిన్ దగ్గర కోచింగ్ మొదలుపెట్టాను. ఉదయం తొమ్మిది గంటలకు ఇంటి దగ్గర బయలుదేరి, ఆఫీసు పని చూసుకొని, శిక్షణ పూర్తి చేసి, తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి పదయ్యేది. కానీ పట్టుదలగా శిక్షణ కొనసాగించాను. మరో నేషనల్స్‌లో పాల్గొనే సమయానికి నాకు యాక్సిడెంట్ అయింది. దానిలో పాల్గొనలేకపోయినా... కోలుకున్నాక ఏషియన్ చాంపియన్‌షి్‌పలో పాల్గొని రజత పతకం సాధించాను. మరింత ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమయ్యాను.
‘కలా? నిజమా?’ అనిపించింది...
గత నెలాఖరులో థాయిలాండ్‌లోని పటాయాలో జరిగిన ‘యూడబ్ల్యూఎ్‌సఎ్‌ఫఎ్‌ఫ-వరల్డ్ ఛాంపియన్‌షి్‌ప’లో మాస్టర్స్ వన్ (యు52) కేటగిరీలో పోటీపడ్డాను. అది నా మొదటి అంతర్జాతీయ పోటీ కావడం, పశ్చిమబెంగాల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది నేనొక్కదాన్నే కావడం, ఎన్నో దేశాల నుంచి వచ్చినవారితో పోటీపడడాల్సి రావడంతో కాస్త నెర్వ్‌సగా అనిపించింది. కానీ ప్రదర్శనపైనే పూర్తి ఏకాగ్రత నిలిపాను. పోటీ చాలా గట్టిగానే ఉన్నా... ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రయత్నించాను. మూడు బంగారు పతకాలు (ఫుల్ పవర్‌లిఫ్టింగ్, బెస్ట్ డెడ్‌లిఫ్ట్, బెస్ట్ ఓవరాల్ ఛాంపియన్) సాధించాను. ఆ పతకాలతో... నా భుజాల చుట్టూ మన జాతీయ పతాకంతో నిలబడినప్పుడు... నాలో కలిగిన ఉద్వేగాన్ని వర్ణించడానికి మాటలు లేవు. ఇప్పటికీ ‘ఇది కలా? నిజమా?’ అనిపిస్తోంది. కొన్నేళ్ళు క్రమశిక్షణతో, నిబద్ధతతో చేసిన సాధనకు ఫలితం ఈ పతకాలు. మన దేశం తరఫున వీటిని సాధించినందుకు గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలకు కచ్చితంగా స్ఫూర్తినిస్తుంది. ఇప్పుడు పవర్‌లిఫ్టింగ్ నా జీవితంతో విడదీయలేని భాగంగా మారిపోయింది. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు. నా శరీరం సహకరించినంతకాలం పవర్‌లిఫ్టింగ్ కొనసాగిస్తాను.’’