Muscle Weakness: కండరాల మీద ఓ కన్నేసి...
ABN , Publish Date - May 27 , 2025 | 04:35 AM
తప్పుడు జీవనశైలి, అధిక బరువు, సరైన ఆహారం లేకపోవడం వల్ల కండరాలు బలహీనమై నొప్పులకు కారణమవుతాయి. విటమిన్ డి3 లోపం మెడ, వీపు నొప్పులకు దారి తీస్తూ, దీనికి సూర్యరశ్మి, పాల ఉత్పత్తులు, ఆకుకూరల ద్వారా పరిష్కారం సాధ్యమవుతుంది.
ప్రతి క్షణం మన శరీరంలో ఏదో ఒక కండరం పని చేస్తూనే ఉంటుంది. మన శరీర కదలికలన్నీ కండరాల మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి అవి మొండికేసినా, దెబ్బ తిన్నా, క్షీణించినా నొప్పులు, అసౌకర్యాలు తప్పవు. కాబట్టి కండరాల మీద ఓ కన్నేసి ఉంచాలంటున్నారు వైద్యులు.
మనకు తెలియకుండానే మనమెన్నో మార్గాల్లో కండరాలను ఇబ్బంది పెడుతూ ఉంటాం. తప్పుడు కోణంలో చేతులను, కాళ్లను వంచుతాం. అవసరానికి మించి ఒకే అవయవ కండరాలను ఒత్తిడికి లోను చేస్తాం. అంతే కాదు, కండరాలను బలపరిచే ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తూ, కండరాల బలహీనత బారిన పడుతూ ఉంటాం. ఫలితంగా నొప్పులు వేధించినా అవి స్వీయ తప్పిదాలనే విషయాన్ని గ్రహించకుండా, అవే పొరపాట్లు మళ్లీ మళ్లీ చేస్తూ, అంతిమంగా వైద్యులను కలిసే పరిస్థితిని కొని తెచ్చుకుంటూ ఉంటాం.
కండరాల బలహీనత ఇందుకే...
సాధారణంగా 60 ఏళ్ల వయసులో కీళ్ల నొప్పులు మొదలవుతాయి. కానీ నేడు 40 ఏళ్లకే కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. మెట్లు ఎక్కినా, కొద్ది దూరం నడిచినా మోకాళ్లు నొప్పి పెడుతూ ఉంటాయి. ఇందుకు కారణం మోకీళ్లకు దన్నుగా ఉండే కండరాలు బలహీనపడడమే! ఇలా మోకాళ్లలోని కండరాలు బలహీనపడడానికి అధిక బరువు, కండర బలహీనత, ఇండియన్ టాయలెట్స్ వాడకం ప్రధాన కారణాలు. సమస్య ఏ కారణంతో ముడిపడి ఉన్నప్పటికీ కండరాల నొప్పులు దరి చేరకుండా ఉండాలంటే ఎత్తుకు తగిన బరువును కలిగి ఉండాలి. భారతీయ మహిళలు సగటున 158 సెంటీమీటర్ల ఎత్తు ఉంటారు కాబట్టి 58 నుంచి 60 కిలోల బరువు ఉంటే సరిపోతుంది. పురుషులు 178 సెంటీమీటర్ల ఎత్తు ఉంటారు కాబట్టి బరువు 72 కిలోలు ఉంటే సరిపోతుంది. కానీ మన దేశంలో సగటున ప్రతి ఒక్కరూ ఐదారు కిలోలు అధిక బరువును కలిగి ఉంటున్నారు
అధిక బరువు: మన శరీరం ఒక కిలో ఎక్కువ బరువు పెరిగితే, శరీరం మీద రెండు కిలోల భారం పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
వ్యాయామం: రోజుకు కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయాలి. లేదంటే వారంలో నాలుగు రోజుల పాటు అరగంట చొప్పున వారం మొత్తంలో 150 నిమిషాలకు తగ్గకుండా చూసుకోవాలి
50 ఏళ్లు దాటిన వాళ్లు మెట్లు, ఇండియన్ టాయిలెట్స్ వాడకపోవడమే మంచిది
మెడ నొప్పి వెనక...
విటమిన్ డి3 లోపం సర్వసాధారణమైపోయింది. దీంతో తలెత్తే ప్రధాన ఇబ్బంది మెడ నొప్పి. ప్రతి వంద మందిలో 80 మందికి విటమిన్ డి3, 30 కంటే తక్కువగా ఉంటోంది. విటమిన్ డి సమృద్ధిగా దొరికే పాల ఉత్పత్తులు, ఆకుకూరలు సరిపడా తీసుకోకపోవడం, సూర్యరశ్మికి బహిర్గతం అవకపోవడం వల్ల ఈ విటమిన్ లోపం ఎక్కువమందిని వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్లలో మెడ నొప్పితో పాటు, వీపు నొప్పి కూడా ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం విటమిన్ డి3 సప్లిమెంట్లు తీసుకోవడంతో పాటు సూర్యరశ్మికి కూడా బహిర్గతమవుతూ ఉండాలి. అలాగే ఆకుకూరలు, పాల ఉత్పత్తులు సరిపడా తీసుకోవాలి.
డైటింగ్‌తో... కండర నష్టం
బరువు తగ్గడం కోసం పలురకాల డైట్స్‌ను అనుసరించడంలో భాగంగా తీసుకునే ఆహారంలో కోత విధిస్తే, కొవ్వుతో పాటు కండర నష్టం కూడా జరుగుతుంది. డైట్ చేశాం కాబట్టి బరువు తగ్గినట్టు భావిస్తూ ఉంటారు. కానీ సరిపడా పోషకాలు అందక, కండరాలు కూడా నష్టపోతున్నామనే విషయాన్ని చాలా మంది గ్రహించరు. కండరాలు దృఢంగా ఉండాలంటే సరిపడా పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు అవసరం. బరువు తగ్గే క్రమంలో కండరాలు వదులుగా మారి, సాగిపోతున్నట్టు తయారైతే, దాన్ని కండర నష్టంగానే పరిగణించాలి. సరిపడా పోషకాలు అందేలా ఆహార పరిమాణాన్ని తగ్గించుకోగలిగితే, బరువు తగ్గడంతో పాటు కండర నష్టం జరగకుండా నియంత్రించుకోవచ్చు. అలాగే డైట్ చేస్తున్న వాళ్లు కండరాలు దృఢంగా ఉండడం కోసం తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.
కండరాలు చిరిగితే?
ముఖ్యంగా జిమ్‌లో ప్రత్యేకించి భుజానికి సంబంధించిన వ్యాయామాలు చేసే వారిలో రొటేటర్ కఫ్ కండరం ఒత్తిడికి లోనవుతుంది. వ్యాయామం చేసే క్రమంలో తప్పుడు కోణంలో భుజాలను కదిలించినప్పుడు ఈ కండరం కందిపోవడం మొదలుపెడుతుంది. దాంతో విపరీతమైన నొప్పితో పాటు, భుజాన్ని పైకి లేపలేని పరిస్థితి తలెత్తుతుంది. కొన్నిసార్లు ఈ కండరం పాక్షికంగా లేదా పూర్తిగా చిరిగిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి. ఎక్స్‌రే, ఎమ్మారైలతో ఈ చిరుగును వైద్యులు సులువుగా గుర్తించగలుగుతారు. సమస్య పాక్షికంగా ఉంటే, విశ్రాంతితో సమస్య పరిష్కారమవుతుంది. ఒకవేళ చిరుగు ఎక్కువగా ఉంటే, కీహోల్ సర్జరీ చేయవలసి ఉంటుంది. ఈ సర్జరీతో సమస్య పూర్తిగా సర్దుకుంటుంది. వ్యాయామం మూలంగా కండరాలు చిరిగిపోకుండా ఉండాలంటే ఒకేసారి అధిక బరువులతో వ్యాయామం చేయకుండా బరువులను క్రమేపీ పెంచుకుంటూ పోవాలి. ఎక్కువ బరువులను బలవంతంగా వ్యాయామాలు చేయడానికి బదులుగా తక్కువ బరువులతో ఎక్కువ రిపిటీషన్స్ చేయాలి. ఇలాంటి వ్యాయామాలతో కండరాలు పెరుగుతాయి. దృఢంగా పెరుగుతాయి.
కండరాల ఆరోగ్యం ఇలా...
కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా మాంసకృత్తులు తీసుకోవాలి. గుడ్డు తెల్లసొన, డ్రైఫ్రూట్స్, సలాడ్స్, మొలకలు క్రమం తప్పకుండా తింటూ ఉండాలి. శాకాహారులు ప్రొటీన్ కోసం సోయా ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. అలాగే విటమిన్ డి3, క్యాల్షియం, శరీరానికి అవసరమైన ఖనిజలవణాలు కూడా సరిపడా అందేలా చూసుకుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాథాన్యం ఇవ్వాలి. పరిమితంగా చేపలు తీసుకోవాలి. రెడ్ మీట్, మటన్ తగ్గించాలి. సోయా, పాల ఉత్పత్తులతో పాటు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నువ్వుల లడ్లు తింటూ ఉండాలి. వీటితో సరిపడా క్యాల్షియం దక్కుతుంది. అలాగే మధ్యాహ్న భోజనంలో సలాడ్ తప్పనిసరిగా తినాలి. ఉదయం లేదా సాయంత్రం సెనగలు, పెసలు, బొబ్బర్లు... వీటిలో ఏదో ఒక మొలకలు తినాలి. వారంలో కనీసం నాలుగు సార్లు, 30 నుంచి 35 నిమిషాల పాటు లేదా వారం మొత్తంలో 150 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి.
నొప్పి, వాపు, అవయవాన్ని కదిలించలేకపోవడం.. దెబ్బతిన్న కండరం ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను కలవాలి. వారు సూచించినంత కాలం ఆ కండరాలకు విశ్రాంతినివ్వాలి.
కండరాలు శ్రమకు, ఒత్తిడికీ లోనైనప్పుడు అసౌకర్యం, నొప్పులు మొదలవుతాయి. ఆయా కండరాలకు 72 గంటల పాటు విశ్రాంతిని ఇచ్చినప్పుడు అవి పూర్తిగా కోలుకుంటాయి. కానీ చాలా మంది ఉపశమనం కోసం నూనెలతో మర్దనలు మొదలుపెట్టేస్తారు. ఇలా చేయడం వల్ల కండరం మరింత ఒత్తిడికి లోనవుతుంది. కాబట్టి విశ్రాంతి, చల్లనీటి కాపడం, అవయవాన్ని ఎత్తులో ఉంచడం లాంటివి చేయాలి. వీటితో అలసిన కండరాలు స్వాంతన పొందుతాయి. ఒకవేళ అప్పటికీ నొప్పి అదుపులోకి రాకపోతే వైద్యులను కలవాలి.
డాక్టర్ బాలరాజు నాయుడు,
రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్,
స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ ట్రామా స్పెషలిస్ట్,
ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్, హైదరాబాద్’
ఈ వార్తలు కూడా చదవండి
ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న
బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్.. వీడియోలతో సెటైర్లు
Read Latest Telangana News And Telugu News