Share News

Healthy diet: పది రకాల కూరగాయలు

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:48 PM

దుంపకూరలు, ఆకుకూరలు, చిగుర్లు, పండ్లు, కాయలు, కాడలు, మొలకలు, బెరళ్లు, పూలు, పుట్టగొడుగులు... ఇలా పది రకాలుగా ఉన్న శాకాల్ని మనం తరచూ వండుకుంటూ ఉండాలి.

Healthy diet: పది రకాల కూరగాయలు

మూల పత్ర కరీరాగ్ర ఫల కాండాధిరూఢకా!

త్వక్‌ పుష్పం కవకంచేతి శాకం దశవిధం స్మృతమ్‌!

ఆహారంలో శాకాలది అంటే కూరగాయలది ప్రధాన భాగస్వామ్యం. కూరగాయలు మొత్తం పది రకాలున్నాయి. దుంపకూరలు, ఆకుకూరలు, చిగుర్లు, పండ్లు, కాయలు, కాడలు, మొలకలు, బెరళ్లు, పూలు, పుట్టగొడుగులు... ఇలా పది రకాలుగా ఉన్న శాకాల్ని మనం తరచూ వండుకుంటూ ఉండాలి. ధాన్యాన్ని నానబెట్టి ఉంచితే మొలకలొస్తాయి. మొలకెత్తిన ధాన్యం కూరగాయగా మారిపోయి, అదనపు పోషకాలిస్తుంది. వరిధాన్యం, పప్పుధాన్యం, కూరగాయలు, నెయ్యి, నూనె సుగంధ ద్రవ్యాలు కలబోసినదే నిజమైన భోజనం. మాంసాహారులు మాంస ద్రవ్యాలను వీటికి అదనంగా చేర్చుకోవచ్చు. చిక్కుడులాంటి గింజలు కూడా అదనపు రుచినిస్తాయి.

పురుగు మందుల తాకిడి లేని కూరగాయలను ఎంచుకుని, జీర్ణశక్తిని అనుసరించి కూరగాయల్ని తగిన రీతుల్లో వండుకోవాలి. శరీరానికి సరిపడేవాటినే ఎంచుకోవాలి. ఎక్కువ పోషకాలుండి తక్కువ ధరకు తేలికగా దొరికేవాటిని తెచ్చుకోవడం మేలు. కూరగాయలనేవి ఆరోగ్యవంతులకే కాదు, అనారోగ్యంతో బాధపడేవారికీ, పిల్లలకూ అందరికీ ఉపయోగించేవిగా ఉండాలి. శరీరానికి ఎలాంటి ఇబ్బందీ కలిగించనిదే ఆరోగ్యదాయక శాకం.


పైన చెప్పిన పది రకాల కూరగాయల్ని తరచూ మార్చి మార్చి తింటూ ఉండాలని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఒకే రకం కూరగాయని విడవకుండా తింటే అస్థిభేదక (ఎముకలు దెబ్బతినటం), నేత్రశక్తి నాశక (కంటి చూపు మందగించటం), రక్తశుక్రనాశక (రక్త కణాల్ని, పురుషుల్లో జీవకణాల్ని నశింపచేయటం), ప్రఙ్ఞాక్షయం (మేథశక్తిని హరించడం), ఫాలిత్యకారక (జుట్టు నెరిసిపోవడం), స్మరణ శక్తి నాశక (ఙ్ఞాపకశక్తిని నశింప చేయడం) అని ‘భావప్రకాశ’ అనే ఆయుర్వేద గ్రంథం వివరించింది. కాబట్టి, ఒకే రకం కూరగాయలు కాకుండా ఒక రోజు దుంపకూర, ఒకరోజు ఆకుకూర, ఒకరోజు కాయగూర... ఇలా పది రకాల్నీ మార్చిమార్చి తినాలనేది సూచన. ఒక ఇంటి నిర్మాణానికి ఇసుక, సిమెంటు ఇటుక అన్నీ కావాలి. కేవలం ఇసుకతోనో ఇటుకతోనో నిర్మాణం సాగదు. ఆహారం అయినా అంతే! పది రకాల శాకాలలో ఏదో ఒకటి రోజూ అన్నంలో ఉండేలా ఆహార ప్రణాళిక ఉండాలి! కేరెట్‌, ముల్లంగి, కీరా, టమోటాలాంటి శాకాల్ని వండకపోయినా తేలికగానే అరుగుతాయి. తక్కిన కూరగాయల్ని సుపక్వంగా అంటే చక్కగా వండుకొని తినటమే మంచిది.

శాకాహారుల భోజనం పేరుకే గానీ, అందులో శాకాల పాత్ర తక్కువగా ఉంటోంది. చింతపండు లేదా మసాలా గ్రేవీలు ఎక్కువగా, కూర తక్కువగా ఉండేలా వండుకుంటున్నారు. గరిటెడు సొరకాయ పులుసు కూరలో రెండో మూడో సొరకాయ ముక్కలుంటే, మిగతాదంతా పులుసు ఉంటోంది. ఆ రెండు ముక్కలతోనే శాకాహారం అంటే సరిపోదు. కూర ఎక్కువగా, అన్నం తక్కువగా తినగలిగేలా వండుకోవాలి. శాకములు 50 శాతం, పప్పు ధాన్యాలు 25 శాతం, అన్నం 25 శాతం ఉండేట్లు తింటే మధుమేహం, బీపీ సహా ఏ జబ్బులూ రాకుండా ఉంటాయి. కూర, పప్పు, పచ్చళ్లను అతిగా చింతపండు రసం కలిపి, లేదా అల్లం వెల్లుల్లి పేస్టు కలపివండటంవలనే మన ఆహారం శాకములు లేని శాకాహారంగా మారిపోతోంది.

గంగరాజు అరుణాదేవి


మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?

Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి

Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు

Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత

Updated Date - Feb 08 , 2025 | 12:10 AM