Share News

Ghazala Hashmi: వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మన హైదరాబాదీ

ABN , Publish Date - Nov 06 , 2025 | 04:51 AM

ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశాలపై 2017లో డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ప్రయాణ ఆంక్షలు గజాలా హష్మీలో ఆగ్రహావేశాలను రేకెత్తించాయి. అమెరికన్‌ పరిపాలనలో సమ్మిళితత్వం, సమానత్వం...

Ghazala Hashmi: వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మన హైదరాబాదీ

ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశాలపై 2017లో డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన ప్రయాణ ఆంక్షలు గజాలా హష్మీలో ఆగ్రహావేశాలను రేకెత్తించాయి. అమెరికన్‌ పరిపాలనలో సమ్మిళితత్వం, సమానత్వం ఉండాలని కోరుకొనేవారి ప్రతినిధిగా... ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు... అదే ట్రంప్‌ అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో... ప్రతిష్ఠాత్మకమైన వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఘనమైన విజయాన్ని గజాలా సాధించారు. ఆమె ఆ పదవికి ఎన్నికైన మొదటి ఇండియన్‌-అమెరికన్‌గా, తొలి సౌత్‌-ఏషియన్‌ అమెరికన్‌గా, తొలి ముస్లింగా... చరిత్ర సృష్టించారు. మార్పు దిశగా సాగుతున్న వర్జీనియాలో... డెమొక్రటిక్‌ పార్టీ కొత్త తరం నాయకత్వానికి ప్రతినిధిగా పరిశీలకులు అభివర్ణిస్తున్న గజాలా తొలి అడుగులు వేసింది మన హైదరాబాద్‌లోనే!

తల్లిదండ్రుల స్ఫూర్తితో...

1964 జనవరి 17న... హైదరాబాద్‌లో గజాలా జన్మించారు. ఆమె బాల్యం మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో గడిచింది. ఆమె తాత రాష్ట్ర ఆర్థిక శాఖలో ఉద్యోగి. తండ్రి జియా హష్మీకి జార్జియాలో ఉద్యోగం రావడంతో... తల్లి, అన్నలతో పాటు నాలుగేళ్ళ వయసున్న గజాలా భారతదేశాన్ని వదిలి అమెరికాకు వలస వెళ్ళారు. జియా హష్మీ అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బి చేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కరోలినాలో అంత ర్జాతీయ సంబంధాలపై పిహెచ్‌డి చేశారు. తరువాత ప్రొఫెసర్‌గా పనిచేశారు. ‘సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టడీ్‌స’ను స్థాపించి, పదవీ విరమణ చేసేవరకూ ఆ సంస్థ డైరెక్టర్‌గా కొనసాగారు. హైదరాబాద్‌లోని కోఠీ ఉమెన్స్‌ కాలేజీలో చదివిన గజాలా తల్లి తన్వీర్‌ హష్మీ... బీఏ, బీఈడీ చేశారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో... బోధనా వృత్తి మీద గజాలా మక్కువ పెంచుకున్నారు. హైస్కూల్‌ స్థాయిలోనే ఉపకారవేతనాలు, ఫెలోషి్‌పలు అందుకున్నారు. జార్జియా సదరన్‌ యూనివర్సిటీలో బిఏ ఆనర్స్‌, అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో... ఆమెరికన్‌ సాహిత్యంలో పిహెచ్‌డి చేశారు.


33-navya.jpg

ప్రజా సమస్యలపై గళం విప్పి...

అజహార్‌ రఫీతో వివాహం తరువాత... రిచ్మాండ్‌ ప్రాంతంలో గజాలా స్థిరపడ్డారు. వారికి యాస్మిన్‌, నూర్‌ అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ రిచ్‌మండ్‌లో ప్రొఫెసర్‌గా గజాలా వృత్తి జీవితం ప్రారంభించారు. ఆ తరువాత రెనాల్డ్స్‌ కమ్యూనిటీ కాలేజీలో పని చేశారు. ఆ కాలేజీలో ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ టీచింగ్‌ అండ్‌ లెర్నింగ్‌’ (సిఇటిఎల్‌)కు వ్యవస్థాపక డైరెక్టర్‌గా వ్యవహరించారు. ముప్ఫయ్యేళ్ళపాటు ప్రొఫెసర్‌గా పని చేసిన గజాలా... 2019లో రాజకీయాల్లో ప్రవేశించారు. రిపబ్లికన్‌ ప్రాబల్యం ఉన్న స్టేట్‌ సెనేట్‌ సీటులో సంచలన విజయం సాధించారు. 2023లో మరోసారి గెలిచారు. 2024లో... ‘సెనేట్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ హెల్త్‌ కమిటీ’కి ఛైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. ‘రైట్‌ టు వర్క్‌’ చట్టాలకు మద్దతివ్వడంతో పాటు విద్య, ఆరోగ్య సంబంధమైన బిల్లులను సెనేట్‌లో ప్రవేశపెట్టడం ద్వారా ఆమె ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. తాజాగా లెఫ్టినెట్‌ గవర్నర్‌ పదవికోసం పోటీ పడిన గజాలా... గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్యం లాంటి అంశాల్లో నెలకొన్న అసమానతలను తొలగిస్తాననీ, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తాననీ హామీ ఇచ్చారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి అంకితమవుతానని ప్రకటించారు. ఇటీవలి ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి జాన్‌ రీడ్‌పై ఘన విజయం సాధించారు.

తగ్గేది లేదు...

తను గెలిచిన తరువాత గజాలా మాట్లాడుతూ... ‘‘ప్రజలను అధోగతి పట్టించేవారిని కాకుండా వారి అభ్యున్నతికి పాడుపడే నాయకత్వాన్ని వర్జీనియా ఎన్నుకొంది. వర్జీనియాకు ఎంతో వైవిధ్యం ఉంది. భవిష్యత్‌ పట్ల దార్శనికత ఉంది. వాటి పట్ల విశ్వాసం ఉంచిన ఓటర్లకు ధన్యవాదాలు. ‘మన వైవిధ్యమే మనకున్న గొప్ప బలం’ అని ఈ రోజు వర్జీనియా రుజువు చేసింది.

మనం వెనక్కి తగ్గేది లేదు... కలిసి కట్టుగా ముందుకు సాగుదాం’’ అని పిలుపునిచ్చారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆమె ఎన్నిక కావడంతో... సెనేట్‌లో ఖాళీ అయిన ఆమె స్థానాన్ని ప్రత్యేక ఎన్నిక ద్వారా భర్తీ చేస్తారు. వర్జీనియా స్టేట్‌ సెనేట్లో ప్రస్తుతం డెమొక్రాట్లకు ఇరవై ఒక్క స్థానాలు, రిపబ్లికన్లకు పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి. సీట్ల మధ్య వ్యత్యాసం తక్కువ కావడంతో... గజాలా పాత్ర కీలకం కాబోతోంది.

ఈ వార్తలు కూడా చదవండి:

Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయాలు

PM with World Cup Winners: ప్రధాని మోదీని కలిసిన టీమిండియా.. ప్రపంచకప్ విజేతలకు పీఎం అభినందనలు

Updated Date - Nov 06 , 2025 | 07:29 AM