Homemade Chickpea Face Packs: ముఖం... మిలమిల
ABN , Publish Date - Dec 24 , 2025 | 06:19 AM
ఇంట్లో ఉండే శనగపిండితో ముఖాన్ని అందంగా మెరిపించుకోవచ్చు. ఆ చిట్కాలే ఇవి....
ఇంట్లో ఉండే శనగపిండితో ముఖాన్ని అందంగా మెరిపించుకోవచ్చు. ఆ చిట్కాలే ఇవి.
చిన్న గిన్నెలో రెండు చెంచాల శనగపిండిని తీసుకుని అందులో ఒక చెంచా తేనె, కోడిగుడ్డు తెల్ల సొన వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి పావుగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మెరుస్తుంది.
ఒక చెంచా శనగపిండిలో ఒక చెంచా గంధం పొడి, మూడు చెంచాల పెరుగు కలిపి పేస్టులా చేయాలి. దీన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ ముఖమంతా పలుచగా రాయాలి. పావుగంట తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంటే చర్మరంధ్రాలు పూర్తి శుభ్రమవుతాయి. జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమల సమస్య తీరుతుంది. ముఖం కాంతివంతంగా మారుతుంది.
గిన్నెలో పావు కప్పు శనగపిండి, మూడు చెంచాల టమాటా గుజ్జు, రెండు చెంచాల కీర పేస్టు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి. తరువాత మంచినీటితో కడిగేసుకుంటే ఫలితం కనిపిస్తుంది
ఒక చెంచా శనగపిండిలో రెండు చెంచాల బాదం నూనె లేదా నాలుగు చెంచాల పాలు కలిపి ముఖానికి రాసి సున్నితంగా మర్దన చేయాలి. పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖం ఛాయగా కనిపిస్తుంది. పొడిచర్మం ఉన్నవారికి ఇది మంచి ఫలితాన్నిస్తుంది.
చిన్న గిన్నెలో రెండు చెంచాల శనగపిండి, ఒక చెంచా నానబెట్టిన ఓట్స్, ఒక చెంచా తేనె, ఒక చెంచా రోజ్ వాటర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కొద్దిగా ఆరిన తరువాత వేళ్ల కొనలతో మర్దన చేయాలి. ఆపైన మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే మొటిమల వల్ల వచ్చిన మచ్చలు తొలగిపోతాయి.