Sofa Posture: ఉపకరణాలు...ఉపయోగకరంగా...
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:29 AM
సోఫాలు, దిండ్లు, పరుపులు ఎంత మెత్తగా ఉంటే అంత మంచివనుకుంటాం. సౌకర్యంగా ఉంటే చాలనుకుని, వాటి వాడకానికి అలవాటు పడిపోతాం. కానీ దైనందిన జీవితంలో ఉపయోగించే ఉపకరణాల విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. కీళ్లు, కండరాలు శ్రమకు గురవకుండా ఉండడం కోసం ఎలాంటి ఉపకరణాలను ఎంచుకోవాలో, వాటి ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వైద్యులు వివరిస్తున్నారు.....
సోఫాలు, దిండ్లు, పరుపులు ఎంత మెత్తగా ఉంటే అంత మంచివనుకుంటాం. సౌకర్యంగా ఉంటే చాలనుకుని, వాటి వాడకానికి అలవాటు పడిపోతాం. కానీ దైనందిన జీవితంలో ఉపయోగించే ఉపకరణాల విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. కీళ్లు, కండరాలు శ్రమకు గురవకుండా ఉండడం కోసం ఎలాంటి ఉపకరణాలను ఎంచుకోవాలో, వాటి ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వైద్యులు వివరిస్తున్నారు.
మనం ప్రతిరోజూ వాడుకునే ఉపకరణాలు నెమ్మది నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని కుదేలు చేస్తూ ఉంటాయి. మన ఇళ్లలోని సోఫాలు మెత్తగా, సౌకర్యంగా ఉంటే చాలనుకుంటాం. పరుపులు, దిండ్లు వీలైనంత మందంగా, మెత్తగా ఉండేలా చూసుకుంటాం. కానీ అవి శరీర భంగిమలను పక్కదారి పట్టిస్తున్నాయా? అనే కోణంలో ఆలోచించం. వీటితో పొందే సౌకర్యానికి మించి, వాటి ఎత్తు, వాటిని వాడుకునే సమయంలో కీళ్ల మీద పడే ఒత్తిడుల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి.
సోఫాలు ఎలా ఉండాలంటే...
చాలా మంది నేలకు అంటుకుపోయినట్టుండే సోఫాలను ఇష్టపడుతూ ఉంటారు. కూర్చోగానే అడుగుకి కుంగిపోయే అతి మెత్తని సోఫాలు, లేచి నిలబడడానికి ఇబ్బందిగా ఉండే సోఫాలు ఆరోగ్యకరం కాదు. సోఫాల తయారీలో ఉపయోగించే మెటీరియల్ కంటే సోఫా ఎత్తు, మెత్తదనం మరింత ముఖ్యం. అవసరానికి మించి మెత్తగా ఉండే సోఫా బదులు, కాస్త గట్టిగా ఉండే సోఫాను ఎంచుకోవడం శ్రేయస్కరం. మరీ ముఖ్యంగా...
సోఫాలో కూర్చున్నప్పుడు పాదాలు నేల మీద ఆనేలా ఉండాలి
మోకాళ్లు, తుంటి సమాంతరంగా ఉండాలి
తుంటి కీలు, మోకాళ్లు 90 డిగ్రీల కోణాన్ని మించకూడదు, తగ్గకూడదు
సోఫా... వెన్నుకూ, తలకూ ఆసరా అందించేలా ఉండాలి
సోఫా వీపుకు ఆనుకునే భాగం 90ు ఎక్కువ కోణంలో వెనక్కి వాలి ఉండాలి.
ప్రతి మూడేళ్లకూ సోఫా రీఫిల్ చేయాలి లేదా కుషనింగ్ మారుస్తూ ఉండాలి
ఎక్కువ సమయం పాటు టివి చూడాలనుకుంటే వెనక్కి వాలినట్టుండే రిక్లెనర్స్ వాడుకోవాలి
పరుపు ఇలా...
మెమరీ ఫోమ్ పరుపులు అత్తుత్తమం. పడుకోగానే గుంతలా ఏర్పడే పరుపులు ఆరోగ్యకరం కాదు. పరుపు మరీ గట్టిగా, మరీ మెత్తగా ఉండకూడదు. ఉదయం నిద్ర లేవగానే ఒంటి నొప్పులు వేధిస్తున్నా, తరచూ కండరాలు పట్టేస్తున్నా వాడుకునే పరుపులో లోపం ఉందని గ్రహించాలి. అలాగే మంచం కూడా సరిపడా ఎత్తులో ఉండాలి. ఎత్తు తక్కువ మంచాలు వాడుకున్నప్పుడు మోకాళ్ల మీద ఒత్తిడి పడుతుంది.
8 నుంచి 10 అంగుళాల మందం పరుపులు శ్రేయస్కరం
పడుకోగానే శరీర వెనక భాగమంతా పరుపులో కూరుకుపోయేంత మెత్తగా ఉండకూడదు
ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ అవసరం లేదు కానీ మెమరీ ఫోమ్ పరుపు వాడుకోవాలి
ఒకే చోట పడుకుంటూ ఉండే ఎంత నాణ్యమైన పరుపైనా గుంతగా మారిపోతుంది. కాబట్టి తరచూ తిప్పుతూ ఉండాలి
దిండ్లు సౌకర్యంగా...
కొందరికి లావుపాటి దిండు లేనిదే నిద్ర పట్టదు. ఇంకొందరికి దిండు వాడే అలవాటే ఉండదు. ఈ రెండు అలవాట్లూ ప్రమాదకరమే! రెండు దిండ్లు కలిపి తల కింద పెట్టుకోవడం మరింత ప్రమాదకరం. కాబట్టి వాడుకునే దిండు మరీ మందంగా లేదా మరీ పలుచగా ఉండకూడదు. అలాగే...
దిండు మెడ వంపులో ఇమిడిపోయేలా ఉండాలి
దిండు వల్ల తలకూ, మెడకూ మధ్య దూరం పెరిగేలా ఉండకూడదు
మెడ వంపు కుదించుకుపోయే దిండును వాడకూడదు
తరచూ దిండ్లను మారుస్తూ, శరీర భంగిమలను ఇబ్బందికి గురి చేయకూడదు
నేల మీద కూర్చుంటే...
గంటల తరబడి పూజ గదిలో నేల మీద పద్మాసనం వేసుకుని పూజ చేయడం, ఇండియన్ టాయిలెట్స్ వాడుకోవడం, నేల మీద కూర్చుని పనులు చేసుకోవడం వల్ల మోకాళ్ల మీద అదనపు ఒత్తిడి పడుతుంది. మరీ ముఖ్యంగా భారతీయుల్లో సహజసిద్ధంగా విటమిన్ డి లోపంతో కీళ్ల సమస్యలు చిన్న వయసులోనే మొదలవుతున్నాయి. ఈ సమస్యకు అస్తవ్యస్థ జీవనశైలి తోడైతే సమస్య మరింత తీవ్రమవుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించాలి
పూజ గదిలో ఎత్తుగా ఉండే స్టూలు వాడుకోవాలి
మోకాళ్లు 90 డిగ్రీలకు మించి వంగకుండా చూసుకోవాలి
మరీ ముఖ్యంగా మోకాళ్ల నొప్పులున్నవాళ్లు నేల మీద కూర్చోడం మానేయాలి
ఇండియన్ టాయ్‌లెట్స్ వాడకుండా ఉండడమే ఉత్తమం
వెస్టర్న్ కమోడ్ కూడా మరీ ఎత్తుగా ఉండకూడదు. తక్కువ ఎత్తులోనూ ఉండకూడదు
చలికాలం నొప్పులు
చలికాలం కండరాలు ఎక్కువగా సంకోచవ్యాకోచాలకు లోనవుతూ ఉంటాయి. ఈ కాలంలో కీళ్లు పట్టుతప్పకుండా నియంత్రించే క్రమంలో కండరాలు బిగుసుకుపోతూ ఉంటాయి. ఇలాంటి సహజసిద్ధ శరీర ప్రొటెక్టివ్ మెకానిజం వల్ల ఈ కాలంలో ప్రత్యేకించి ఉదయం వేళ్లలో కండరాలు పట్టుకుపోతూ ఉంటాయి. ఉదయం నిద్రలేవగానే మంచం పైనుంచి కిందకు దిగడంకోసం శరీరాన్ని కదిలించగానే, అప్పటివరకూ విశ్రాంత స్థితిలో ఉన్న కండరాలు అకస్మాత్తుగా చురుగ్గా మారలేక పట్టుకుపోవచ్చు. ఇది ప్రమాదకరం కాదు. అయినప్పటికీ ఈ కాలంలో అవసరానికి మించిన విశ్రాంతి, నిద్ర మానుకోవాలి. వీలైనంత వరకూ శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. క్రమం తప్ప వ్యాయామం చేయాలి. ఒకవేళ కండరాలు పట్టేస్తే, వాటంతట అవి సర్దుకోడానికి కనీసం ఐదు రోజుల సమయం పడుతుంది. ఆ అసౌకర్యాన్ని, నొప్పినీ వదిలించుకోవడం కోసం వైద్యులు సూచించిన మజిల్ రిలాక్సెంట్స్, నొప్పి మందులు వాడుకోవాలి.
చేతి కర్ర వాడితే...
గుండెపోటుకు గురైన వాళ్లు మూడు కాళ్ల చేతి కర్ర వాడుకోవాలి
కండరాల పటుత్వాన్ని కలిగి ఉండి, గుండె ఆరోగ్యం బాగున్న 70 ఏళ్లు దాటినవారు సాధారణ చేతి కర్ర వాడుకుంటే సరిపోతుంది
మోకాళ్ల నొప్పులున్నవాళ్లు ఏ మోకాలు నొప్పిగా ఉంటే అటువైపు చేతి కర్ర వాడుకోవాలి
తుంటి నొప్పి ఉన్నవాళ్లు కుడి తుంటి నొప్పికి, ఎడమ వైపు చేతి కర్ర వాడుకోవాలి.
ఎడమ తుంటి నొప్పికి కుడి వైపు చేతి కర్ర వాడుకోవాలి
మూర్ఛ, పార్కిన్సన్స్ ఉన్నవాళ్లు, వాకర్, మూడు కాళ్ల చేతి కర్ర తప్పనిసరిగా వాడుకోవాలి