Share News

Womens Health: నీరసం నలతగా మారితే...

ABN , Publish Date - May 27 , 2025 | 04:46 AM

నిరంతర నీరసం తేలికగా తీసుకోవద్దు; ఇది థైరాయిడ్‌, మధుమేహం, పోషక లోపాలు, రక్తహీనత వంటి సమస్యలకు సంకేతంగా ఉండవచ్చు. సరైన పరీక్షలతో మూలకారణం తెలుసుకుని, ఆహారం, వ్యాయామం, అవసరమైతే సప్లిమెంట్లతో దాన్ని అధిగమించాలి.

Womens Health: నీరసం నలతగా మారితే...

ఉరుకుల పరుగుల జీవితం మనది. ఈ పరుగులో ఆహారం, నిద్రలు నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటాయి. ఒత్తిడిలు, ఆందోళనలు ఆవరిస్తూ ఉంటాయి. దాంతో ఒక్కసారిగా నిస్సత్తువకు లోనై, అడుగు వేయలేని పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇదే పరిస్థితి అరుదుగా కాకుండా తరచూ వేధిస్తుంటే, మూలాల్లోకి వెళ్లి అసలు కారణాన్ని కనిపెట్టి, దాన్ని సరిదిద్దుకోవాలి.

మనలో చాలా మంది నీరసాన్ని పెద్దగా పట్టించుకోరు. దాన్నొక చిన్నపాటి నలతగా సరిపెట్టుకుని, దానంతట అదే సర్దుకుంటుందిలే అనే ఆలోచనతో బలవంతంగా పనులను చేసుకుపోతూ ఉంటారు. కానీ రాత్రంతా కంటి నిండా నిద్రపోయినా, ఉదయం నిద్ర లేచిన వెంటనే నిస్సత్తువ ఆవరిస్తున్నా, చిన్నపాటి పనులకే అలసట వేధిస్తున్నా పరిస్థితిని తీవ్రంగానే పరిగణించాలి.

Main-story.jpg

ఆరోగ్యపరమైన కారణాలు ఇవే!

శరీర జీవక్రియలు గాడి తప్పినప్పుడు బయల్పడే మొట్టమొదటి సంకేతం నీరసం. ఈ పరిస్థితి ఎన్నో సందర్భాల్లో బయల్పడుతూ ఉంటుంది. అవేంటంటే...

హైపో థైరాయిడ్‌: థైరాయిడ్‌ సమస్యల్లో కనిపించే ప్రధాన లక్షణం నీరసం. వీటితో పాటు కండరాల నొప్పులు, అతి నిద్ర, వెంట్రుకలు ఊడిపోవడం, చర్మం పొడిబారడం, నెలసరి క్రమం తప్పడం లాంటి లక్షణాలు తోడైతే వైద్యులను కలిసి థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి

మధుమేహం: మధుమేహం తలెత్తినా, ఉన్న మధుమేహం క్రమం తప్పినా నీరసం వేధిస్తుంది. నీరసంతో పాటు దాహం, ఆకలి పెరగడం, గాయాలు మానకపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తే వెంటనే వైద్యులను కలవాలి

పోషకలోపాలు: బి12 పోషకలోపం ఎక్కువ మందిలో ఉంటుంది. మరీముఖ్యంగా శాకాహారుల్లో ఈ సమస్య ఎక్కువ.

క్యాల్షియం లోపం: విటమిన్‌ డి లోపంతో, శరీరంలోకి చేరుకునే క్యాల్షియాన్ని శరీరం శోషించుకోలేదు.

అనీమియా: రక్తహీనతలో కూడా నిస్సత్తువ వేధిస్తుంది. పోషకాహార లోపంతో పాటు, పెద్దపేగుల్లో సమస్యలతో విరోచనంలో రక్తస్రావం మూలంగా కూడా నీరసం వేధిస్తుంది. మహిళల్లో ఫైబ్రాయిడ్స్‌ వల్ల అధిర రక్తస్రావంతో రక్తహీనత తలెత్తి, నిస్సత్తువ ఆవరిస్తుంది

నిద్రలేమి: మన జీవగడియారం రాత్రి నిద్రకు తగ్గట్టు రూపొంది ఉంటుంది. కాబట్టి ఆ జీవగడియారం క్రమం తప్పకుండా చూసుకోవాలి. రాత్రుళ్లు మేలుకుంటూ పగలు ఏడు గంటలు నిద్రపోయినా నిస్సత్తువ వేధించడానికి కారణం ఇదే!

ఒత్తిడి: వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఒత్తిళ్లు నిద్రకు దూరం చేస్తాయి. శరీరాన్ని నీరసింపజేస్తాయి. కాబట్టి వాటిని తగ్గించుకునే మార్గాలను కనిపెట్టాలి. అందుకోసం యోగా, ధ్యానం సహాయపడతాయి


సప్లిమెంట్లు ఎప్పుడు?

పోషక లోపాలను ఆహారంతో భర్తీ చేసుకోవడం కొంత వరకూ తేలికే! విటమిన్‌ బి12 లోపం ఉన్న వ్యక్తులు మాంసాహారులైన పక్షంలో మాంసాహారంతో ఆ లోపాన్ని భర్తీ చేసుకోవచ్చు. అయితే శాకాహారులకు ఇది సాధ్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో పోషకాలను సప్లిమెంట్ల రూపంతో తీసుకోక తప్పదు. అయితే వీటిని వాడుకునే సమయంలో ఏ పోషక లోపం కొరవడిందో దాన్ని మాత్రమే భర్తీ చేసే సప్లిమెంట్లు వాడుకోవాలి. బదులుగా ఇతరత్రా విటమిన్లు, ఖనిజలవణాల లోపాలను కూడా భర్తీ చేసే సప్లిమెంట్లను వాడుకోకూడదు.

మెనోపాజ్‌ మహిళల్లో...

నెలసరి ఆగిపోయిన తర్వాత శరీరంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి ఆగిపోయి, ఎముకలు గుల్లబారే సమస్య తలెత్తుతుంది. దాంతో ఎముకల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. కానీ ఎక్కువ మంది మహిళలు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించకుండా, పైబడే వయసులో ఇవన్నీ సహజమే అని సరిపెట్టుకుంటూ ఉంటారు. కానీ నిస్సత్తువను దూరం చేయడంతో పాటు ఎముకలను దృఢంగా ఉంచుకోవడం కోసం సప్లిమెంట్లు తప్పక వాడుకోవాలి.

ఈ పరీక్షలు అవసరం

నిస్సత్తువకు అసలు కారణాన్ని కనిపెట్టడం కోసం కంప్లీట్‌ బ్లడ్‌ పిక్చర్‌ (సిబిపి), విటమిన్‌ డి3, బి12, థైరాయిడ్‌, మధుమేహ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. ఫలితాన్ని బట్టి సమస్యను మందులతో సరిదిద్దుకోవడం ద్వారా నిస్సత్తువను దూరం చేసుకోవచ్చు.

వ్యాయామం కీలకం

శరీరం చురుగ్గా ఉండడానికి వ్యాయామం చేయడం తప్పనిసరి. గుండె సమస్యలు, కీళ్ల సమస్యలు లేనివాళ్లు కార్డియో వ్యాయామంలో భాగంగా ఏరోబిక్స్‌ చేయొచ్చు. ప్రతి రోజూ నడవడం ఆరోగ్యకరమే! కానీ కార్డియోతో పాటు కండరాలను బలపరిచే స్ట్రెంగ్తెనింగ్‌ వ్యాయామాలు కూడా జోడించాలి. ఇలా బరువులతో కూడిన వ్యాయామాలతో కండరాలను బలపరుచుకోవడం వల్ల, మన శరీర బరువును మోసే బాధ్యతను కేవలం ఎముకలే కాకుండా కండరాలు కూడా తీసుకుంటాయి. దాంతో శరీరం తేలిక అవుతుంది.


ఇలా నిస్సత్తువ బలాదూర్‌

సరైన సమయంలో సరిపడా నిద్ర

నిద్రకు గంటకు ముందు నుంచి అన్ని రకాల స్ర్కీన్స్‌కు దూరంగా ఉండాలి

ప్రొటీన్లు, పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి

రోజు మొత్తంలో మూడు ప్రధాన భోజనాలు, రెండు అల్పాహారాలు తీసుకోవాలి

కనిష్టంగా రోజుకు 30 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి

ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి

డాక్టర్‌ శ్రద్ధా సంఘాని,

కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌,

రెనోవా సెంచరీ హాస్పిటల్స్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌


ఈ వార్తలు కూడా చదవండి

ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న

బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్.. వీడియోలతో సెటైర్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 27 , 2025 | 04:46 AM