Share News

Chickpea Leaves Benefits: భోజన కుతూహలం శక్తినిచ్చే శనగాకులు

ABN , Publish Date - Sep 20 , 2025 | 03:09 AM

ప్రకృతిలోని ప్రతి ఆకుకూరకు కొన్ని ప్రత్యేకమైన గుణధర్మాలు ఉంటాయి. వీటిని మన పూర్వీకులు గమనించి గ్రంథస్తం చేశారు. ఈ విధంగా ‘భోజనకుతూహలం’ గ్రంథంలో శనగాకుల వల్ల కలిగే...

Chickpea Leaves Benefits: భోజన కుతూహలం శక్తినిచ్చే శనగాకులు

శనగాకులను, కందిపప్పును కలిపి ఉడికించాలి. ఒక మూకుడులో కొద్దిగా నూనె వేడిచేసి దానిలో ఈ మిశ్రమాన్ని వేసి వేయించాలి. దానిలో తాలింపు పెట్టాలి.

ప్రకృతిలోని ప్రతి ఆకుకూరకు కొన్ని ప్రత్యేకమైన గుణధర్మాలు ఉంటాయి. వీటిని మన పూర్వీకులు గమనించి గ్రంథస్తం చేశారు. ఈ విధంగా ‘భోజనకుతూహలం’ గ్రంథంలో శనగాకుల వల్ల కలిగే అనేక ప్రయోజనాలు మనకు కనిపిస్తాయి. శనగ ఆకులు పుల్లగా ఉంటాయి. రుచిగా ఉంటాయి. తిన్న తర్వాత ఆలస్యంగా అరుగుతాయి. కఫం, వాతం వల్ల కలిగే వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలగజేస్తాయి. ఈ ఆకులకు ఉన్న లక్షణాలు, ఔషధ గుణాలేమిటో చూద్దాం..

  • శనగాకులలో ప్రొటీన్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మిగిలిన ఆకు కూరల కన్నా వీటి వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.

  • శనగాకులకు శరీరవేడిని తగ్గించే తత్వం ఉంది. అందువల్ల క్రమం తప్పకుండా శనగాకుల కూరను తింటే శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అయితే ఒకే రోజు ఎక్కువ పరిమాణంలో తినకూడదు. అలా తింటే మలబద్ధకం ఏర్పడే అవకాశముంటుంది.

  • ముదర శనగ ఆకుల కన్నా.. లేత శనగ ఆకులలో ఎక్కువ పౌష్టిక గుణాలుంటాయి. ఒక బేసిన్‌లో లేదా కుండీలో మట్టి పోసి శనగలు చల్లితే మొలకలు వస్తాయి. ఆరు అంగుళాల ఎత్తు పెరిగిన తర్వాత వాటిని కోసి తినటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. పాలకూర, క్యాబేజీ కన్నా శనగాకుల్లో ఎక్కువ ఖనిజాలు ఉన్నాయని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల వీటిని సలాడ్స్‌లో కూడా వేసుకొని తినవచ్చు.

లేత శనగాకులను శుభ్రపరుచుకోవాలి. వాటిలో లేత శనగలను కలపాలి. ఈ రెండింటినీ కలిపి ఉడికించి తాలింపు పెట్టుకుంటే రుచికరమైన కూర తయారవుతుంది. కొందరు ఈ కూరలో ఎండు కొబ్బరి కూడా కలుపుతారు. దీని వల్ల కూర రుచి మరింతగా పెరుగుతుంది

ఒక మూకుడులో నూనెను వేడిచేసి శనగాకులను వేయించాలి. వీటిలో ఉల్లిపాయలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీలో రుబ్బాలి. ఈ పచ్చడికి తాలింపు పెడితే మంచి రుచి వస్తుంది.

గంగరాజు అరుణాదేవి

Updated Date - Sep 20 , 2025 | 03:09 AM