Share News

Ayurvedic Herbs: గడ్డల్ని కరిగించే కంద ఆకులు

ABN , Publish Date - Aug 16 , 2025 | 01:20 AM

సంస్కృతంలో కందకు సూరణం, వేరు వెల్లకి అనే పేర్లు ఉన్నాయి. శూరుడిలా పోరాడేది కాబట్టి ఈ దుంపను సూరణం అంటారు....

Ayurvedic Herbs: గడ్డల్ని కరిగించే కంద ఆకులు

సంస్కృతంలో కందకు ‘సూరణం’, ‘వేరు వెల్లకి’ అనే పేర్లు ఉన్నాయి. శూరుడిలా పోరాడేది కాబట్టి ఈ దుంపను సూరణం అంటారు. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం- కడుపులో పెరిగే గడ్డలు, ఏలిక పాములపై ఇది పోరాడుతుంది. భౌగోళికంగా చూస్తే - కంద మొక్క దక్షిణాదివారి స్వంతం. ఉష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే మొక్క ఇది! భారతదేశం మొత్తం మీద తెలుగు నేలపైన పెరిగే కందకు ప్రసిద్ధి ఎక్కువ. పూర్వం వానప్రస్థాశ్రమంలో కంద మూలాలు తింటూ జీవించేవారని చెప్పేవారు. కంద మూలాలంటే సాధారణ అర్థంలో దుంపకూరలని! కంద అనేది సంస్కృత పదం, దుంప అనేది తెలుగు. ఈ రకంగా చూస్తే కంద లాంటి దుంప కూరలు, ఇతర ఉడకబెట్టిన దుంపలు తింటారని అర్థం. ఇక కంద ఆకులు వెడల్పుగా పెద్దవిగా రెమ్మలురెమ్మలుగా ఉంటాయి. వీటిలో ఎ- విటమిన్‌, ప్రొటీన్లు, ఫైబర్‌ ఉంటాయి. ఇక కంద వల్ల కలిగే లాభాలేమిటో చూద్దాం..

  • కంద ఆకులకు వేడి చేసే స్వభావం ఉంటుంది. అయితే ఈ స్వభావం వల్ల కంద ఆకులు శరీరంలోని ఉన్న దోషాలను పోగొడతాయి. కఫదోషం వల్ల కలిగే వ్యాధులు ఉన్నవారికి ఈ ఆకులను వండిపెట్టవచ్చు.

  • ఒకప్పుడు బోదవ్యాధి ఎక్కువగా ఉండేది. ఆ సమస్య ఉన్నవారికి కంద మంచి ఔషధం.

  • కంద కాడల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి పొట్టను మృదువుగా చేస్తాయి.

  • కంద ఆకులను ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా తింటారు. అయితే లేత కంద ఆకులను తింటేనే మంచిది. ముదురు ఆకుల్లో ఆగ్జలైట్‌ క్రిస్టల్స్‌ ఎక్కువగా ఉంటాయి. ముదురు ఆకులను నేరుగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఒకవేళ ముదురు ఆకులను తినాలనుకొనేవారు ఆకులను శుభ్రపరచి, సన్నగా తరిగి, మజ్జిగలో వేసి బాగా మెత్తపడేదాకా ఉడికిస్తే ఈ క్రిస్టల్స్‌ తొలగిపోతాయి.

గంగరాజు అరుణాదేవి

Updated Date - Aug 16 , 2025 | 01:20 AM