హరే శ్రీనివాస
ABN , Publish Date - Jun 20 , 2025 | 06:06 AM
దాదాపు రెండేళ్ళపాటు టి.టి.డి. ఎగ్జిక్యూటివ్ అధికారిగా... స్వామి వారి ప్రథమ సేవకుడిగా తాను చేసిన విశేష కార్యక్రమాలను వివరిస్తూ డాక్టర్ కె.వి.రమణాచారి రచించిన గ్రంథం ‘హరే శ్రీనివాస!’...
వ్యాసపీఠం
దాదాపు రెండేళ్ళపాటు టి.టి.డి. ఎగ్జిక్యూటివ్ అధికారిగా... స్వామి వారి ప్రథమ సేవకుడిగా తాను చేసిన విశేష కార్యక్రమాలను వివరిస్తూ డాక్టర్ కె.వి.రమణాచారి రచించిన గ్రంథం ‘హరే శ్రీనివాస!’. ఇందులో ‘శ్రీనివాసుడు
నాకు జవాబిచ్చాడు’ మొదలు ‘వెంకటాద్రి దిగి వెంకటాద్రి ఎక్కి వరకూ’... ఇరవై రెండు అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాల శీర్షికలు వాటిని చదవాలన్న ఉత్సుకతను పాఠకుల్లో రేకెత్తిస్తాయి.
‘‘ఎందుకు ఈ భక్తులందరూ వందలాది కిలోమీటర్ల దూరం రైళ్ళు, బస్సులు, కార్లు, కాలినడక... ఇలా ఇన్ని రకాలుగా ఆపసోపాలు పడుతూ తిరుపతి వస్తున్నారు?...’’ అనే ప్రశ్నతో ఈ గ్రంథం ప్రారంభం అవుతుంది. ‘‘నిన్నే తమ సర్వస్వంగా భావిస్తున్న భక్తులు నిన్ను దర్శించాలని ఇంత కష్టపడి, ఇంత దూరం వస్తే నువ్విచ్చే దర్శనం లిప్తకాలమా?...’’ అనే ప్రశ్నను... తను టి.టి.డి. ఈవో కాకముందు డాక్టర్ రమణాచారిగారు తనలోతాను అనేకసార్లు వేసుకున్నారట. అలాగే ‘‘సర్వశక్తిమంతుడివి కదా! నీ భక్తుల దగ్గరకు నీవే వెళ్ళి, సంతృప్తికరమైన దర్శనంతో వాళ్ళను తరింపజేయవచ్చు కదా! స్వామే భక్తుల దగ్గరకు ఎందుకు వెళ్ళకూడదు?...’’ ఇది భక్తుడిగా ఆయన స్వామివారికి వేసిన ప్రశ్న. టి.టి.డి. ఈవోగా బాధ్యతలు స్వీకరించాక ఆ ప్రశ్న ఆయనలో మళ్ళీ ఉదయించింది. దానికి స్వామి ఇచ్చిన సమాధానం ఏమిటి? అది ఇచ్చిన పద్ధతి ఏమిటి? ‘చతుర్యుగ బంధ భక్తి చైతన్య యాత్ర’కు బీజం ఎలా పడింది? వీటన్నిటికీ జవాబులు ఈ గ్రంథంలో లభిస్తాయి. ఆ సర్వాంతర్యామి సేవకుడిగా తన అనుభవాలను ఆసక్తికరంగా, సభక్తికంగా ఈ పుస్తకంలో డాక్టర్ రమణాచారి నిక్షిప్తం చేశారు.
For More Business News
ఆసక్తి పెంచేలా...
డాక్టర్ రమణాచారి తలపెట్టి విజయవంతం చేసిన చతుర్యుగ బంధ భక్తి చైతన్య యాత్ర, అఖండ హరినామ సంకీర్తన, నిత్యకళ్యాణం, పుస్తక, ప్రసాదం, దివ్య భారతి, ఎస్వీబీసీ, శ్రీ అన్నమాచార్య ఆరువందల జయంతి వేడుక, పాలకమండలి అమృతోత్సవం... ఇలా ఎన్నో కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి చదువుతూ ఉంటే... ఆయన భక్తి తత్పరత, పాలనానుభవం, కార్యదక్షత ఎంతటివో అర్థమవుతుంది. ఈ గ్రంథం చదవడం ప్రారంభిస్తే... పూర్తి అయ్యేవరకూ ఆగలేం. రచన అటువంటిది. విషయం భగవంతునిది. రచయిత పండిత, సంప్రదాయ కుటుంబానికి చెందినవారు. ఎం.ఏ. తెలుగు చేసి, పిహెచ్.డి. పట్టా పుచ్చుకున్నావారు. వీరి రచనలో చదివించే లక్షణం ఉంది. పఠనాసక్తిని పెంచే విధంగా శీర్షికలు ఉన్నాయి. తన ఆలోచనను చెప్పి, దాన్ని అమలుపరిచే క్రమంలో ఎదురైన సమస్యలను వివరిస్తున్న సందర్భంలో... పాఠకుని మనసు మరింత వేగంగా పరిగెడుతుంది. ‘సమస్య ఎలా పరిష్కారమవుతుంది? దైవకార్యం ఎట్లా విరబూసి పరిమళిస్తుంది?’ అనే ఆసక్తిని పెంచే విధంగా రచన సాగింది. పుస్తకం ముగించినప్పుడు అనిపిస్తుంది... ‘ఇంతలోనే నూట ఎనభై పుటలు చదివేసినామా!’ అని. డాక్టర్ కె.వి.రమణాచారిగారి ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామి పాఠకులకు అందించిన ప్రసాదం ఈ ‘హరే శ్రీనివాస!’ గ్రంథం.
అనూమాండ్ల భూమయ్య
Also Read:
మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి