Home Worship: ఇంట్లో విగ్రహాలు ఎలా ఉండాలి?
ABN , Publish Date - Dec 19 , 2025 | 06:13 AM
ఈ ప్రశ్నకు పూర్వులు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. వాటి ప్రకారం గృహారాధనలో వినియోగించి విగ్రహాలు నిలుచున్న లేదా కూర్చున్న...
ఇంట్లో ఆరాధించే విగ్రహాలు ఏ రూపాల్లో ఉండాలి? ఈ ప్రశ్నకు పూర్వులు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. వాటి ప్రకారం: గృహారాధనలో వినియోగించి విగ్రహాలు నిలుచున్న లేదా కూర్చున్న రూపాలలోనే ఉండాలి. పరుండి ఉండే శయన విగ్రహాలు ఉండకూడదు. అలాగే సాత్విక ప్రతిమలు ఉండవచ్చు కానీ, సంహార రూపంలో క్రోధ, ఉగ్రరూపంలో ఉండే విగ్రహాలు... తామసిక విగ్రహాలు సాధారణ గృహాల్లో ఉండకూడదు. ప్రత్యేకించి ఏదైనా ఉపాసన చేసే సాధకులు... తమ గురువుల అనుమతితో, ఆయా మంత్రాల అధిష్ఠాన దేవతల విగ్రహాలు ఆరాధన చేయాలనుకున్నా... అవి కూడా ప్రమాణాన్ని అనుసరించే ఉండాలి.
లోహాలు మాత్రమే...
‘పాద్మ సంహిత’ గ్రంథం చెబుతున్న ప్రకారం: గృహారాధనలో కేవలం లోహమయ ప్రతిమలు మాత్రమే ఉంచాలి. శిలా విగ్రహాలు, మట్టి లేదా కొయ్య విగ్రహాలు ఇంట్లో ప్రతిష్ఠించకూడదు. లోహాలలో కూడా బంగారం లేదా వెండి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఆరకూట (పిత్తళి), తామ్రం (రాగి) లాంటి లోహాలతో చేసిన ప్రతిమలు శ్రేయస్కరం. మూడు లోహాలతో కలిపి చేసిన త్రిలోహ విగ్రహాలు, అయిదు లోహాలతో చేసిన పంచలోహ విగ్రహాలు కూడా సకల శుభ ఫలితాలు కలిగిస్తాయనీ, లోహంతో చేసిన ప్రతిమలు అందరి కోరికలను నెరవేర్చుతాయనీ ఆ గ్రంథం వివరించింది. అలాగే ఆధునిక కాలంలో వస్తున్న ప్లాస్టిక్, ఇతర పదార్థాలతో చేసిన విగ్రహాలను ఇంట్లో అలంకార ప్రతిమలుగా సముచిత స్థానాల్లో పెట్టుకోవచ్చు తప్ప పూజా గృహంలో ఆరాధనలో ఉంచకూడదు.
వాటికి ప్రమాణం అవసరం లేదు
శుభ ఆయాది పొంతనలు చూసి, హస్త, హృదయ, అంగుష్ట, మాత్రా ప్రమాణాలకు అనుగుణంగా విగ్రహాలను తయారు చేయించుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ మనస్సుకు నచ్చిన ఏదైనా లోహ విగ్రహం తటస్థించినప్పుడు... పైన పేర్కొన్న నాలుగు ప్రమాణాలలో ఏదైనా ప్రమాణానికి సరిపోతే ఆ విగ్రహాన్ని తప్పకుండా స్వీకరించవచ్చు. పారంపర్యంగా గృహంలో తిరువారాధన జరుగుతూ ఉండే విగ్రహాలకు, ఆచార్యుల ద్వారా, నిత్యానుష్ఠానపరులైన యతీశ్వరుల ద్వారా, మహనీయులైన పెద్దల ద్వారా లభించిన విగ్రహాలకు ఎటువంటి ప్రమాణాలు అవసరం లేదు. భగవంతుడు ఆ రూపంలో మన ఇంటికి విచ్చేశాడని భావించి పూజించుకోవచ్చు.
డి.యన్.వి. ప్రసాద్
స్థపతి, 9440525788