Green Tea: గ్రీన్ టీతో మెదడు చురుకుదనం
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:15 AM
గ్రీన్ టీలోని నికోటినమైడ్, ఎపిగాలోక్టేకిన్ గాలేట్ అనే రెండు సహజసిద్ధ మూలకాలు మెదడులోని పాత కణాలు కొత్త ...
గ్రీన్ టీ ఆరోగ్యకరం అనే విషయం మనందరికీ తెలిసిందే! అయితే గ్రీన్ టీలోని సహజసిద్ధ మూలకాలు అల్జీమర్స్ నుంచి మెదడుకు రక్షణ కల్పిస్తాయనే ఒక అధ్యయనం తాజాగా వెలుగులోకొచ్చింది.
గ్రీన్ టీలోని నికోటినమైడ్, ఎపిగాలోక్టేకిన్ గాలేట్ అనే రెండు సహజసిద్ధ మూలకాలు మెదడులోని పాత కణాలు కొత్త వాటిలా చురుగ్గా పని చేసేందుకు దోహదపడతాయని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కనిపెట్టారు. ఈ రెండు మూలకాలు, నష్ట నివారణలో తోడ్పడే జిటిపి అనే కీలక శక్తి అణువులను పునరుద్ధరిస్తాయని వారు పేర్కొంటున్నారు. ఈ ప్రయోగాన్ని వయసు పైబడిన ఎలుకల మీద చేపట్టినప్పుడు, అల్జీమర్స్ వ్యాధితో ముడిపడి ఉన్న అమైలాయిడ్ బీటా అనే ప్రొటీన్ మోతాదు తగ్గడాన్ని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా మనుషులకు వయసు పైబడినప్పుడు, మెదడు కణాలు శక్తిని కోల్పోతూ ఉంటాయి. ఆ కణాలను గ్రీన్ టీలోని రెండు సహజసిద్ధ మూలకాలతో చికిత్స చేసినప్పుడు, కేవలం 24 గంటల్లోనే, శక్తిమోతాదులు పెరిగి, మెదడులో ‘ఆటొఫజీ’ ఊపందుకుంటోంది. ఈ చికిత్స ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కూడా తగ్గిస్తుంది. గతంలో అల్జీమర్స్ పరిశోధనల్లో, మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో జిటిపి పాత్రకున్న ప్రాధాన్యాన్ని పరిశోధకులు పెద్దగా పట్టించుకోలేదు. తాజా అధ్యయనంలో వాటిని బలపరుచుకునే మార్గం తెలిసింది కాబట్టి గ్రీన్ టీతో మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా అల్జీమర్స్‌కు అడ్డుకట్ట వేయగలిగే మార్గం సుగమం అయింది.