Srila Prabhupada: విశ్వగురువు
ABN , Publish Date - Nov 14 , 2025 | 03:39 AM
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘హరేకృష్ణ ఉద్యమం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం... ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యుడు శ్రీల ప్రభుపాద. ఆయన పశ్చిమ దేశాలతో...
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘హరేకృష్ణ ఉద్యమం’ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం... ఇస్కాన్) వ్యవస్థాపక ఆచార్యుడు శ్రీల ప్రభుపాద. ఆయన పశ్చిమ దేశాలతో సహా యావత్ ప్రపంచానికి సనాతన ధర్మానికి చెందిన ఆచారాలను పరిచయం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నూట ఎనిమిది రాధాకృష్ణ దేవాలయాలను స్థాపించారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు హరినామ సంకీర్తలను, నగర సంకీర్తనలను, ఏటా పూరీలో జరిగే విధంగా జగన్నాథ రథయాత్రలను, వేద సాహిత్యాన్ని, దాని రూపాలైన భగవద్గీత, శ్రీమద్ భాగవతాలను, గురుకుల విధానాన్ని, గోశాలలను, వైదిక వ్యవసాయాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. ‘సాధారణ జీవనం, అత్యున్నత తాత్త్విక చింతన’ అనే భావనను బోధించారు. పదివేల మందికి పైగా వ్యక్తులను సనాతన ధర్మ మార్గంలోకి తీసుకువచ్చారు.
హరేకృష్ణ ఉద్యమం ప్రాచీనమైన బ్రహ్మ-మధ్వ-గౌడీయ సంప్రదాయానికి చెందినది. ఈ విశిష్టమైన సంప్రదాయంలో శ్రీల ప్రభుపాద 32వ ఆచార్యులు. 1966లో, న్యూయార్క్ నగరంలో ‘ఇస్కాన్’ను ఆయన ప్రారంభించారు. రోజువారీ జీవితంలో తీరిక లేకుండా గడుపుతూ, ఉన్నతమైన జీవన సూత్రాలను తెలుసుకోలేని వ్యక్తుల మనస్సుల్లో కృష్ణ చైతన్యాన్ని నింపడం దీని ప్రధానమైన లక్ష్యం. శ్రీల ప్రభుపాదులు ఏర్పరచిన ఈ సంస్థ ఉద్దేశాల్లో ప్రధానమైనది... ప్రజల దృష్టిని సర్వశక్తిమంతుడైన శ్రీకృష్ణునివైపు మళ్ళించడం. తద్వారా కృష్ణ చైతన్యాన్ని అభ్యసిస్తూ... మన మరచిన ఆ భగవత్సంబంధాన్ని తిరిగి స్థాపించుకోవడం. ‘శ్రీకృష్ణుడు జంతువులు, పక్షులు, వృక్షాలు, క్రిమి కీటాకాలతో సహా సమస్త జీవులకు తండ్రి (పితామహస్య జగతః అహం బీజ-ప్రదఃపితా)’’ అని ‘భగవవద్గీత’ చెబుతోంది. ‘యావత్ ప్రపంచం శ్రీకృష్ణుడు మూల పురుషునిగా ఉన్న వసుధైక కుటుంబం’ అని దీని అర్థం. చెట్టు మొదట్లో నీరు పోస్తే... ప్రతి శాఖ, ఆకు, పండు, ఎలా సంతృప్తి చెందుతాయో... అదే విధంగా సమస్త అస్తిత్వానికీ మూలమైన కృష్ణుణ్ణి సంతృప్తి పరచడం ద్వారా లోకంలోని సకల జీవులను సంతృప్తి పరచవచ్చు.
కృష్ణ చైతన్య పునరుద్ధరణ కోసం
ప్రతి ఒక్కరిలో నిద్రాణమై ఉన్న కృష్ణ చైతన్యాన్ని పునరుద్ధరించడం కోసం... శ్రీకృష్ణుని నామాలను జపించడాన్ని ఒక సాధారణ పద్ధతిగా శ్రీల ప్రభుపాదులు పరిచయం చేశారు. 1969 నుంచి 1977 మధ్య... 22 వేల పేజీల సాహిత్యాన్ని తన వాక్కు రూపంలో ఆయన నిక్షిప్తం చేశారు. అరవైకి పైగా భాషల్లో ఎనభైకి పైగా పుస్తకాలను ప్రచురించారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా అరవై కోట్ల పుస్తకాలను ఆయన శిష్యులు వితరణ చేశారు. భగవద్గీత లాంటి ప్రాచీన గ్రంథాలలోని నిజమైన జ్ఞానాన్ని యథాతథంగా ఆంగ్లంలో ప్రపంచానికి అందించడం ఆయన చేసిన ముఖ్యమైన సేవ. అంతేకాదు... (వేదాంత సూత్రానికి సహజ వ్యాఖ్యానంగా పరిగణించే) శ్రీమద్ భాగవతం, ఈ యుగంలో శ్రీకృష్ణుని అవతారమైన శ్రీచైతన్య మహాప్రభువు జీవితం, బోధల గురించి వివరించే ‘చైతన్య చరితామృతం’ అనే గ్రంథాలకు వ్యాఖ్యానాలు రచించారు. ప్రజలు తమ రోజువారీ జీవితాల్లో ఈ పుస్తకాలలోని అంశాలను చదివి, ఆచరిస్తే... శ్రీకృష్ణ చైతన్యంలో స్థితప్రజ్ఞులు అవుతారు.
1977 నవంబర్ 14న శ్రీధామ బృందావనంలో మహాసమాధి అయిన శ్రీల ప్రభుపాద... శ్రీకృష్ణుని నిత్య లీలలలోకి ప్రవేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఆ దివ్య తిథిని భక్తులు వేడుకగా జరుపుకొంటారు. విశ్వగురు శ్రీల ప్రభుపాదకు నివాళులు అర్పిస్తారు. గురువు భౌతిక నిష్క్రమణంతో గురుసాంగత్యం ఆగదని శ్రీల ప్రభుపాద స్పష్టం చేశారు. ఆయన అనుయాయుల ద్వారా, ఆయన పుస్తకాలు, విగ్రహ రూపాలు, సంస్థ, శిష్యులద్వారా ఎవరైనా ఇప్పటికీ మార్గదర్శకత్వం పొందవచ్చు. శ్రీల ప్రభుపాద శాసనాన్ని అనుసరించి... రోజూ ‘హరేకృష్ణ’ మహా మంత్రాన్ని నిర్ణీత సంఖ్యలో జపిస్తూ, కృష్ణ చైతన్య నియమాలను పాటిస్తూ దీక్ష పొందవచ్చు.