Genetic Disorders: జన్యు సమస్యలకూ చెక్!
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:46 AM
మనకు వచ్చే కొన్ని రకాల వ్యాధులకు మూలం జన్యువులు. వాటి గురించి అవగాహన ఉంటే కొన్ని ఆరోగ్య సమస్యలను ముందే గుర్తించవచ్చు. బాగా ఇబ్బంది పెట్టకుండా నియంత్రించవచ్చు. యువతలో... ముఖ్యంగా అమ్మాయిలలో ఈ అవగాహనను కల్పించటానికి ప్రయత్నిస్తున్న వారిలో ‘జీనోమ్ ఫౌండేషన్’ రీసెర్చ్ డైరక్టర్ డాక్టర్ గాడిచర్ల కనకభూషణం ఒకరు. ప్రస్తుత ఆధునిక యుగంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న జన్యు సమస్యల గురించి ‘నవ్య’తో డాక్టర్ కనకభూషణం పంచుకున్న విశేషాలు..
‘‘కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలకు మూలాలు జన్యువుల్లో ఉంటాయి. ఉదాహరణకు ఇన్‌ఫెర్టిలిటీ, పీసీఓడీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు జన్యువులు కూడా ప్రధాన కారణమని ఇటీవల కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కోణం నుంచి చూసినప్పుడు- మూల కారణాలను తెలుసుకోకుండా- సమస్యలను సరిదిద్దటానికి ప్రయత్నిస్తే ఫలితం ఉండదు. అయితే ఈ జన్యుపరమైన సమస్యల గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. విద్యావంతుల్లో కూడా వీటిపై అవగాహన తక్కువే. వారికి అవగాహన కల్పించటానికి, అవసరమైన వారికి వైద్యపరమైన సూచనలు అందించటానికి ‘జీనోమ్ ఫౌండేషన్’ను ప్రారంభించాం. ప్రజలలో, ముఖ్యంగా యువతలో జన్యు ఆధారిత ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించటం మా లక్ష్యం. దీనికోసం తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహిస్తున్నాం. వాటిలో అమ్మాయిలను పరీక్షించి, వారిలో ఏమైనా జన్యుపరమైన సమస్యలు ఉంటే చెబుతున్నాం. దీనివల్ల వారు భవిష్యత్తులో తమకు రాబోయే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకొని, సరిచేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
సంబంధం ఉంది...
చాలా మందికి జన్యువులకు, జబ్బులకు మధ్య ఉన్న సంబంధం గురించి తెలియదు. ఈ విషయంపై అవగాహన ఉంటే అనేక రకాల ఆరోగ్యసమస్యలు ముందే నివారించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఒక కాలేజీలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశాం. దీనిలో 300 మంది బాలికలకు పరీక్షలు నిర్వహించాం. వీరిలో 100 మందికి పైగా ‘పీసీఓడీ’ ఉన్నట్లు తేలింది. మరి కొంతమంది డిప్రెషన్, ఆహార అలర్జీలతో బాధపడుతున్నట్లు మేము గుర్తించాం. వీటన్నింటికీ జన్యుసమస్యలు కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. వారికి జీవశైలి వల్ల ఈ సమస్యలు వచ్చాయా? లేక జన్యువులే కారణమా? అనే విషయాన్ని కనుగొంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇదే విధంగా చిన్న వయస్సులో రొమ్ము క్యాన్సర్ వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. దీనికి జన్యువుల ప్రేరణ ఒక కారణమని శాస్త్రవేత్తలు ఎప్పుడో కనుగొన్నారు. ఎలాంటి జన్యుపరివర్తన ఉన్నవారికి రొమ్ము క్యాన్సర్ వస్తోందో కనుగొనగలిగితే.. ఆ తరహా జన్యువులు ఉన్నవారిని ముందే గుర్తించవచ్చు. రొమ్ము క్యాన్సర్‌ను ప్రేరేపించే అంశాలకు అడ్డుకట్ట వేయమని సలహా ఇవ్వవచ్చు. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. జన్యు సమస్య ఉన్న ప్రతి వారికి వ్యాధులు వస్తాయని కూడా కచ్చితంగా చెప్పలేం. అయితే జన్యు సమస్య బయటపడటానికి దోహదం చేసే అంశాలను నియంత్రించగలిగితే చాలా వ్యాధులను నివారించవచ్చు. అందుకే మేము అనేక ప్రాంతాల్లో అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా యువతకు జన్యు సమస్యల గురించి తెలియాల్సిన అవసరం ఎంతయినా ఉంది.
జీనోమ్ సెంటర్‌లో...
ప్రజలలో అవగాహన కల్పించటంతో పాటు- జన్యుపరమైన వ్యాధులు సంక్రమించే ముప్పు ఉన్న వ్యక్తులకు కూడా ‘జీనోమ్ ఫౌండేషన్’ ద్వారా సేవలు అందిస్తున్నాం. వీరికి ‘జెనెటిక్ మార్కర్స్’, ‘జెనెటిక్ అనాలసిస్’, ‘గట్ మైక్రోబియం’ పరీక్షలు చేసి నివారణ మార్గాలు సూచిస్తాం. కొందరు మొదటిసారి గర్భం దాల్చినప్పుడు జన్యు సమస్యలను పెద్దగా పట్టించుకోరు. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత జన్యు సమస్యలు ఉన్నాయని తేలుతుంది. ఇలాంటి వారు రెండోసారి గర్భం దాల్చాలనుకున్నప్పుడు వారికి సరైన సలహాలు ఇవ్వటంలో ‘జీనోమ్ సెంటర్’ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇదే విధంగా రొమ్ము క్యాన్సర్ వచ్చిన కొందరు మహిళలకు కీమో థెరపీ సరిగ్గా పనిచేయదు. ఇలాంటి వారి జన్యువులను విశ్లేషించి, వారికి ఏ తరహా థెరపీ పనిచేస్తుందో చెబుతాం. ప్రస్తుతం మేము హైదరాబాద్‌లోని ‘కిమ్స్’, ‘బసవతారకం’, ‘గాంధీ’ (విశాఖపట్నం), ‘కిమ్స్ ఐకాన్’ (విశాఖపట్నం)లలోని క్యాన్సర్ విభాగాలతో కలిసి పని చేస్తున్నాం.
మాది విశాఖపట్నం. అక్కడి ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎండీ పూర్తి చేసిన తర్వాత సిదార్థ మెడికల్ కాలేజీలో గైనకాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశాను. ఆ తర్వాత ‘జీనోమ్ ఫౌండేషన్’తో కలిపి పనిచేస్తున్నాను.
లోపాలు సరిదిద్దలేం, కానీ...
జన్యువుల్లో ఉన్న లోపాలను సరిదిద్దడం అసాధ్యం. అయితే హార్మోన్ స్రావాలను నియంత్రించే సంకేతాలను జన్యువులు వెలువరిస్తూ ఉంటాయి. ఈ హార్మోన్ స్రావాల మీదే అవయవాల సామర్థ్యం, పనితీరు ఆధారపడి ఉంటుంది. జన్యువులు తప్పుడు సంకేతాలు ఇవ్వకుండా నియంత్రించగలిగితే జన్యు సంబంధమైన సమస్యలు నివారించుకోవచ్చు. ‘జీనోమ్ ఫౌండేషన్’కు సంబంధించిన చికిత్సలన్నీ ఈ సూత్రం ఆధారంగానే పనిచేస్తాయి.
ఇవి కూడా చదవండి..