Share News

Tanya Goyals Journey in Air Purification: ప్రత్యామ్నాయంతో సాధికారత దిశగా!

ABN , Publish Date - Nov 10 , 2025 | 05:06 AM

ఒక అసౌకర్యం... సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. ఒక జంటను అనూహ్యంగా పారిశ్రామికవేత్తలను చేసింది. తాన్యా గోయల్‌... తన భర్తతో కలిసి ఆమె ప్రారంభించిన వ్యాపారం...

Tanya Goyals Journey in Air Purification: ప్రత్యామ్నాయంతో సాధికారత దిశగా!

ఒక అసౌకర్యం... సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. ఒక జంటను అనూహ్యంగా పారిశ్రామికవేత్తలను చేసింది. తాన్యా గోయల్‌... తన భర్తతో కలిసి ఆమె ప్రారంభించిన వ్యాపారం... ఇప్పుడు ఎయిర్‌ప్యూరిఫయర్స్‌ రంగంలో పెను మార్పులకు కారణమైంది. ఎంతోమంది మహిళలకు జీవనోపాధి కల్పించి... సాధికారత వైపు అడుగులు వేయిస్తోంది. ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30’ జాబితాలో చోటు దక్కించుకున్న తాన్యా కథ ఇది.

‘‘దాదాపు నాలుగేళ్ల కిందట... నేను, మావారు కరణ్‌ బన్సాల్‌ జైపూర్‌లోని ఓ అపార్ట్‌మెంటులో ఉండేవాళ్లం. ఆ ఇంట్లో సీలింగ్‌ బాగా కిందకు ఉండేది. ఆ ఎత్తుకు సరిపడేలా, మంచి గాలి ఇచ్చేలా సీలింగ్‌ ఫ్యాన్‌ ఒకటి కొందామని మార్కెట్‌కు వెళ్లాం. ఆన్‌లైన్‌లో వెతికాం. కానీ ఎక్కడా సరైన ఫ్యాన్‌ కనిపించలేదు. బాగా గాలి రావాలి. సీలింగ్‌ ఎత్తుకు తగినట్టు ఇమిడిపోవాలి. పొరపాటున చేతులు తగిలినా ప్రమాదం లేకుండా ఉండాలి. అలాంటి ఫ్యాన్‌ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాం. బ్లేడ్‌ లేని ఫ్యాన్సీ ఫ్యాన్లు చూశాం. అయితే సంప్రదాయ బ్లేడ్‌ గల ఫ్యాన్లతో పోలిస్తే గాలి చాలా తక్కువగా వస్తుంది. మేం గమనించిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే... మార్కెట్‌లో లభించే ఫ్యాన్లవల్ల గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ఆందోళనకర స్థాయిల్లో పెరుగుతోందని. మనం సాధారణంగా ఉపయోగించే ఎయిర్‌ ప్యూరిఫయర్లను గది మూలలో పెట్టడంవల్ల ప్రయోజనం అంతంతమాత్రమేనని అర్థమైంది. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేశాం. సీలింగ్‌ ఫ్యాన్‌, ఎయిర్‌ప్యూరిఫయర్లకు సరైన ప్రత్యామ్నాయం కనుగొనాలనే నిర్ణయానికి వచ్చాం. అలా ఆవిర్భవించిందే... ‘కార్బన్‌ ఎన్విరోటెక్‌’. మా ఈ సంస్థ ద్వారా ‘కార్బన్‌ ఎయిర్‌జోన్‌’ ఒక పరికరాన్ని తీసుకువచ్చాం.


అలా మొదలైంది...

మా ఇద్దరిదీ రాజస్థాన్‌లోని జైపూర్‌ పట్టణం. నేను ‘ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ లా స్కూల్‌’లో బీఏ ఎల్‌ఎల్‌బీ చదివాను. 2019లో ‘జియాంగ్‌ యూనివర్సిటీ’ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ లా పట్టా పొందాను. చదువుకొంటూనే పలు సంస్థల్లోని వివిధ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ చేశాను. తరువాత కొంత కాలం లీగల్‌ కన్సల్టెంట్‌గా, జిందాల్‌ స్కూల్‌లో అసిస్టెంట్‌ లెక్చరర్‌గా పని చేశాను. కరణ్‌ ఐఐటీ గువహటిలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌, అమెరికాలోని పర్డ్యూ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదివాడు. మూడేళ్ల కిందట మా ఇద్దరికీ పరిచయమైంది. మనసులే కాదు, అభిప్రాయాలు కూడా కలవడంతో పెళ్లితో ఒక్కటయ్యాం.

కొలువులు కాదనుకొని...

ఇక మా కంపెనీకి బీజం... ఒక అసౌకర్యం నుంచి మొదలైన ఆలోచన. దాని కోసం మేమిద్దరం ఉద్యోగాలు వదిలేయాలకున్నాం. కెరీర్‌, భవిష్యత్తు పరంగా చూస్తే... మేం తీసుకున్నది సాహసోపేత నిర్ణయం. ఎందుకంటే ఇద్దరివీ ఉన్నత ఉద్యోగాలు. మంచి సంపాదన. అన్నీ వదిలేసి 2021లో ‘కార్బన్‌ ఎన్విరోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను స్థాపించాం. ఎన్నో అధ్యయనాలు, పరిశోధనల తరువాత ‘కార్బన్‌ ఎయిర్‌జోన్‌’ పరికరాన్ని అభివృద్ధి చేశాం. 2023లో దీన్ని అందుబాటులోకి తెచ్చాం. ఇది ఫ్యాన్‌లా, గాలిని శుభ్రపరిచే యంత్రంలా, గది అంతా కాంతినిచ్చే లైట్‌లా ఉపయోగపడుతుంది. అంటే అన్నీ ఒకే పరికరంలో ఇమిడివుంటాయి.


ఎక్కడైనా అమరిపోతుంది...

ఇల్లు, కార్యాలయాల్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మార్కెట్‌లో లభించి సంప్రదాయ ఫ్యాన్లు, ఎయిర్‌ప్యూరిఫయర్లతో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు మెరుగైనదని కచ్చితంగా చెప్పగలం. అన్నిరకాల సీలింగ్‌లకూ సరిపోతుంది. ఇందులో సీఎ్‌ఫడీ టెక్నాలజీని ఉపయోగించాం. దీనివల్ల ఎయిర్‌ఫ్లో అద్భుతంగా ఉంటటుంది. అన్ని మూలలకూ విస్తరిస్తుంది. గాలి నాణ్యతనూ కాపాడుతుంది. ప్రత్యేకించి తక్కువ ఎత్తున్న సీలింగ్‌లకు అమర్చినా భద్రత పరంగా సంకోచించాల్సింది లేదు. ఇటీవలే దీనికి లైటర్‌ వెర్షన్‌ అంటే చిన్న గదుల్లో కూడా ఇమిడేలా మరో మోడల్‌ను తీసుకువచ్చాం. మా సంస్థ ద్వారా ఎంతో మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. అది నాకు ఎంతో సంతృప్తినిస్తోంది.

బడా బ్రాండ్లతో కలిసి...

టైటాన్‌ క్యాపిటల్‌, ఆల్‌ ఇన్‌ క్యాపిటల్‌, రెయిన్‌మ్యాటర్‌ తదితర ప్రముఖ సంస్థల నుంచి మా స్టార్ట్‌పకు నిధులు సమకూరుతున్నాయి. ఇది మా ఆర్‌ అండ్‌ డీ (రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌)కు ఎంతో దోహదపడుతోంది. మొదటి ఎనిమిది మాసాల్లో వెయ్యికి పైగా ఎయిర్‌జోన్‌ యూనిట్లు విక్రయించాం. ఇక ప్రముఖ మ్యాగజైన్‌ ‘ఫోర్బ్స్‌ ఇండియా’ ప్రకటించిన 30 అండర్‌ 30’ 2025 జాబితాలో నాకు చోటు దక్కింది. అది నాకు ఎనలేని ఉత్సాహాన్నిచ్చింది. నిత్య జీవితంలో అవసరమయ్యే పరికరాలను మరింత సౌకర్యవంతంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన స్ఫూర్తిని నాలో నింపింది.’’

Updated Date - Nov 10 , 2025 | 05:06 AM