Diwali Safety: తస్మాత్ జాగ్రత్త బాణసంచా ప్రమాదకరం
ABN , Publish Date - Oct 20 , 2025 | 05:43 AM
బాణాసంచా ఎంతటి వినోదాన్ని అందిస్తుందో, అప్రమత్తంగా ఉండకపోతే అంతే హానికరం అవుతుంది. మరీ ముఖ్యంగా వాటి నుంచి వెలువడే పొగల్లో విషపూరిత రసాయనాలుంటాయి కాబట్టి వీటిని కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...
బాణాసంచా ఎంతటి వినోదాన్ని అందిస్తుందో, అప్రమత్తంగా ఉండకపోతే అంతే హానికరం అవుతుంది. మరీ ముఖ్యంగా వాటి నుంచి వెలువడే పొగల్లో విషపూరిత రసాయనాలుంటాయి కాబట్టి వీటిని కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...
టపాసుల తయారీలో సల్ఫర్ (గంధకం), కార్బన్ వాడతారు. వీటి వల్లే టపాసులు పెద్ద పెద్ద వెలుగులను వెదజల్లుతాయి. అలాగే బాణాసంచా తయారీలో ఆర్సెనిక్, మాంగనీస్, సోడియం ఆక్సలేట్, అల్యూమినియం, ఐరన్ డస్ట్ పౌడర్, పొటాషియం, బేరియం నైట్రేట్ మొదలైన ఎన్నో రసాయనాలను వాడడం వల్ల టపాసులు కాల్చినప్పుడు దట్టమైన పొగలు అలముకుంటాయి. ఈ పొగల్లో సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్...మొదలైన విష వాయువులు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి హానికరం కాబట్టి ఇవిగో ఇలాంటి రక్షణ చర్యలు పాటించాలి.
ముక్కుకీ, నోటికీ కాటన్ స్కార్ఫ్ చుట్టుకోవాలి.
రంగుల పొగలు వెదజల్లే టపాసులు మరింత ప్రమాదకరమైనవి. వాటిని కాల్చకపోవటమే మంచిది.
చైనా తయారీ టపాసులు కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయువులను విడుదల చేస్తాయి. వాటికి బదులుగా దేశీయ టపాసులనే ఎంచుకోవాలి
తక్కువ పొగ వెదజల్లే టపాసులకు పరిమితమవటం మేలు
టపాసులు కాలేటప్పుడు వాటి మీదకు వంగి చూడకూడదు
మూసి ఉన్న ప్రదేశాల్లో కాకుండా వాకిట్లో లేదా మేడ పైన, ఆట స్థలాల్లో టపాసులు కాల్చటం ఉత్తమం
ఇంట్లోకి పొగ వెళ్లకుండా తలుపులు మూసి ఉంచాలి
టపాసులు కాల్చిన మరునాడు ఉదయాన్నే వాకింగ్ చేయటం మానుకోవాలి. ఆ సమయంలో వాతావరణంలో కాలుష్యాల పరిమాణం ఎక్కువగా ఉంటుంది
ఎక్కువ పొగను వెదజల్లే చిచ్చుబుడ్లు, మతాబులు, భూచక్రాలు లాంటి టపాసులను కాల్చకపోవడమే ఉత్తమం
మరీ ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలున్నవాళ్లు టపాసులకు దూరంగా ఉండాలి
అపార్ట్‌మెంట్లలో ఉండేవాళ్లు బాల్కనీల్లో కాకుండా కిందకి దిగి వచ్చి, అపార్ట్‌మెంట్ ఆవరణలో టపాసులు పేల్చాలి.