Share News

Faith Beyond Disputes: పూజించేది ఎవరినైనా...

ABN , Publish Date - Dec 19 , 2025 | 06:17 AM

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యుద్ధాలు, కల్లోలాలు, మారణహోమాలు జరిగేది మతం పేరుమీదే. టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా, అంతరిక్షంలోని వివిధ గ్రహాలలోకి ...

Faith Beyond Disputes: పూజించేది ఎవరినైనా...

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యుద్ధాలు, కల్లోలాలు, మారణహోమాలు జరిగేది మతం పేరుమీదే. టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా, అంతరిక్షంలోని వివిధ గ్రహాలలోకి మనుషులు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్నా... ‘ఎవరి దేవుడు గొప్ప’ అనే వాదనలు, వైషమ్యాలు మాత్రం ప్రాణాంతకాలుగా కొనసాగుతున్నాయి. ఒక విధంగా... కొనసాగడం కాదు, పెరిగిపోతున్నాయి. పాలస్తీనాలో, కశ్మీర్‌, ఆర్మేనియా, సౌదీ, ఇరాన్‌, ఐర్లండ్‌, సూడాన్‌... ఇలా చెప్పుకుంటూ పోతే.. తరతరాలుగా తన్నుకుచస్తున్న ముఖ్యమైన అంశం మతమే.

నామాల వివాదం

కొన్నిచోట్ల ఒకే మతంవారు అయినప్పటికీ ఆరాధనా పద్ధతుల్లో తేడాలవల్ల (షియా-సున్నీ, ప్రొటెస్టెంట్‌-కేథలిక్‌) తీవ్ర ఘర్షణలు మామూలైపోయాయి. ‘ఏ దేవుడు గొప్ప, ఏ ఆరాధనా పద్ధతి గొప్ప?’ అనే విషయంలో వాదన ఎప్పటికీ ముగియదు. ఎందుకంటే ఎవరిది వారికే గొప్ప. ఈ మతాలేవీ పుట్టకముందే పుట్టిన భగవద్గీతలో ఈ దేవుళ్ళ పూజల రహస్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అరటిపండు ఒలిచి తినిపించినట్టు ఎప్పుడో చెప్పేశాడు. ‘నా మతం వేరు, నా దేవుడు వేరు, నా పూజా విధానం వేరు. నేను చేసే క్రతువుల వల్ల అనేక లాభాలు చేకూరుతాయి. నువ్వు చేసే పద్ధతిలో ఎంత ప్రార్థించినా ఫలితం ఉండదు’ అనే వాదనను ‘ఉత్తుత్తి వాదన’ అని స్పష్టం చేశాడు. మన దక్షిణ భారతదేశంలోనే (బహుశా కాంచీపురంలో) ‘దేవాలయ ఏనుగును ఎలా అలంకరించాలి?’ అనే వివాదం సుప్రీకోర్టు వరకూ వెళ్ళింది. ఇరు పక్షాలూ వైష్ణవులే. అయితే ఒకరు వడగలై తెగవారు, మరొకరు తెంగలై తెగవారు. ‘ఏనుగును ఊరేగించేటప్పుడు నామం ఎలా పెట్టాలి’ (ఒక ఆచారం ప్రకారం (సుమారుగా) ‘వె’ౖ ఆకారంలో, మరొక ప్రకారం ‘యు’ ఆకారంలో’) అనేదే వివాదం. ఇద్దరిదీ వైష్ణవ సంప్రదాయమే. రెండు వర్గాల వారు ఆ గుడిలోనే అన్ని ఆరాధనలను కలిసే జరుపుకొంటారు! కానీ ఏనుగుకు పెట్టే నామం గురించి సుప్రీంకోర్టు వరకూ పోయారు. చివరకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే సమయానికి... ఆ ఏనుగు మరణించింది.


కల్లోలాలను అప్పుడే ఊహించాడా?

ఏ దేవుణ్ణి ఏ రూపంలో, ఏ పద్ధతిలో, ఏ ఆచారం ప్రకారం పూజిస్తే కోరికలు తీరుతాయి? దీనికి సరైన సమాధానం ఏదైనా ఉందా? ఈ విషయం గురించి భగవద్గీత ఏడో అధ్యాయం ‘జ్ఞాన విజ్ఞాన యోగం’లో ‘‘యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితు మిచ్చతి... తస్య తస్యాచవాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్‌...’’- ‘‘ఎవరు ఏ దేవుణ్ణి పూజించాలనుకున్నా, ఆ దేవుని మీద శ్రద్ధను స్థిరంగా మార్చేది నేనే!’’ అన్నాడు శ్రీకృష్ణుడు. ‘‘స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధన మీహతే... లభతే చ తతః కామాన్‌ మయైున విహితాన్‌ హితాన్‌...’’- ‘‘అప్పుడు ఆ భక్తుడు భక్తి శ్రద్ధలతో ఆ దేవుణ్ణి ఆరాధిస్తాడు. తత్ఫలితంగా, ఆ దేవుని ద్వారా... నా అనుగ్రహం వల్ల అతని కోరికలు తీరుతాయి’’ అని చెప్పాడు. మొత్తం అన్ని రకాల మత విద్వేషాలకు ఈ శ్లోకాలు సమాధానం కాదంటారా? ఎవరు ఏ మతంలోకి మారినా... అది నావల్లనేననీ, వాళ్ళు నిష్టగా, భక్తిగా ఆ మతంలో కొనసాగడం నా అనుగ్రహమేననీ సాక్షాత్తూ శ్రీకృష్ణపరమాత్మే చెప్పిన తరువాత కూడా... ఇతర మతస్తులు తప్పు చేసినట్టు మనం ఇంకా ఎందుకు భావిస్తున్నాం? భగవద్గీత చదవకపోవడం వల్లా? చదివినా అర్థం కాకపోవడం వల్లా? దాదాపుగా ఇప్పుడున్న మతాలేవీ పుట్టకముందే, మత కల్లోలాలేవీ ప్రారంభకాకముందే... కొన్ని వేల సంవత్సరాల తరువాత జరగబోయే అనర్థాన్ని ఊహించే శ్రీకృష్ణుడు ఆ మాటలు చెప్పాడా? నిజంగా ఈ శ్లోకాలను మనం తలలోకి ఎక్కించుకోగలిగితే... ఎవరినైనా తక్కువగా చూడగలమా?

ఉండవల్లి అరుణ్‌కుమార్‌

Updated Date - Dec 19 , 2025 | 06:17 AM