Sahaja Yoga Kundalini awakening: భక్తే కాదు విశ్వాసమూ ప్రధానమే
ABN , Publish Date - Jul 18 , 2025 | 03:08 AM
భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. ఇది ప్రతి భక్తుడూ కోరుకొనే విషయమే. కానీ ఇది అంత సులభమైనది కాదు. భగవంతుడి ఆశీస్సులు పొందాలంటే... ఆయనపై అనన్యమైన భక్తి, అపరిమితమైన విశ్వాసం ఉండాలి. అంతేకాదు, తమ కోరిక స్వార్థ ప్రయోజనాలకోసం...
సహజయోగ
భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. ఇది ప్రతి భక్తుడూ కోరుకొనే విషయమే. కానీ ఇది అంత సులభమైనది కాదు. భగవంతుడి ఆశీస్సులు పొందాలంటే... ఆయనపై అనన్యమైన భక్తి, అపరిమితమైన విశ్వాసం ఉండాలి. అంతేకాదు, తమ కోరిక స్వార్థ ప్రయోజనాలకోసం కాకుండా... ప్రజాహితంగా, సమాజహితంగా ఉండాలనేది కూడా భక్తులు గ్రహించాలి. పరమేశ్వరుడిమీద మన నమ్మకం ఎంత కచ్చితంగా, ఎంత నిజాయితీగా ఉండాలో సహజయోగ ప్రదాత శ్రీమాతాజీ నిర్మలాదేవి ఒక కథలో వివరించారు.
దేవుడికి ప్రీతిపాత్రుడైన ఒక భక్తుడు ఆయనను దర్శించుకోవడానికి బయలుదేరాడు. దారిలో ఒక ముని ఎదురుపడ్డాడు. అతను దేనికోసమో ఎదురుచూస్తున్నట్టు కనిపించాడు. ‘‘నేను భగవంతుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు. ఆయనకు తెలియజేస్తాను’’ అన్నాడు ఆ భక్తుడు. ‘‘అలాగా... సంతోషం. నాకు తినడానికి ఇప్పటివరకూ ఆహారం రాలేదు. కాస్త తొందరగా ఏర్పాటు చేయమని భగవంతుడికి చెప్పండి’’ అన్నాడు ఆ ముని. అతను తనను ఎగతాళి చేస్తున్నాడనుకున్న ఆ భక్తుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మరికొంత దూరంలో మరో ముని తారసపడ్డాడు. అతను తల్లక్రిందులుగా, ఎంతో క్లిష్టతరమైన తపస్సు చేస్తూ నానా తిప్పలూ పడుతున్నాడు. ‘‘నేను భగవంతుడి దగ్గరకు వెళ్తున్నాను. నీ గురించి ఏదైనా చెప్పమంటావా?’’ అని అడిగాడు భక్తుడు. ‘‘ఆయన దర్శనం కోసం నేను ఎంతో కాలంగా తపస్సు చేస్తున్నాను. ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలో అడుగు’’ అన్నాడతను. ‘సరే’నంటూ ఆ భక్తుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. భగవంతుణ్ణి కలుసుకున్నాడు. భగవంతుడు అతణ్ణి కుశల ప్రశ్నలు అడిగాడు. ‘‘ఇంకా ఏదైనా అడగాలా?’’ అన్నాడు. అప్పుడు ఆ భక్తుడు రెండో ముని సందేహాన్ని చెప్పాడు. ‘‘కంగారేమీ లేదు. అతను ఇంకా తపస్సు చేయాల్సిందే’’ అన్నాడు. ఆ తరువాత మొదటి ముని కోరిక గురించి చెప్పాడు. భగవంతుడు వెంటనే తన సేవకులను పిలిచి... ఆ ముని కోరుకున్న ఆహారాన్ని వెంటనే పంపించాలని ఆజ్ఞాపించాడు. ‘‘అదేమిటి స్వామీ! అంత కఠోర తపస్సు చేస్తున్న వ్యక్తిని ఇంకా కొంతకాలం వేచి ఉండాలంటున్నారు. తిండికోసం ఆరాటపడుతున్నవాడికి వరం ప్రసాదించారు. ఎందుకని?’’ అని అడిగాడు భక్తుడు. ‘‘సరేగానీ... ఆ మునులతో నేను భగవంతుణ్ణి కలిసే సమయానికి ఆయన సూది బెజ్జం నుంచి ఒంటెను బయటకు తీస్తున్నాడు’’ అని చెప్పు. అంతే! అప్పుడు నీకే అర్థమవుతుంది’’ అన్నాడు దేవుడు.
అది హృదయం లోతుల్లోంచీ రావాలి...
ఆయన దగ్గర సెలవు తీసుకున్న భక్తుడు అక్కడినుంచి బయలుదేరాడు. తపస్సు చేసుకుంటున్న ముని దగ్గరకు వచ్చాడు. ‘‘నువ్వు ఇంకా తపస్సు చేయాల్సి ఉందని దేవుడు చెప్పాడు. అయితే ఆయనను కలుసుకున్నప్పుడు... సూది బెజ్జంలోనుంచి ఒక ఒంటెను తీస్తూ ఉంటే కళ్ళారా చూసి ఆశ్చర్యపోయాను’’ అన్నాడు. అప్పుడు ఆ ముని ‘‘అది అసాధ్యమైన కార్యం. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళలేదు. కేవలం నన్ను నమ్మించడం కోసం ఇలా చెబుతున్నావు’’ అని కొట్టి పారేశాడు. ఆ తరువాత... తను మొదట కలుసుకున్న ముని దగ్గరకు భక్తుడు వెళ్ళాడు. అప్పటికే ఆ ముని... తనకు దేవుడు పంపిన ఆహారం తిని ఆనందంలో ఉన్నాడు. ‘‘భగవంతుడు సూది నుంచి ఒంటెను బయటకు తీయడం చూసి ఆశ్చర్యం కలిగింది. అలాంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూడలేదు’’ అని చెప్పాడు భక్తుడు. అందుకు ఆ ముని ‘‘ఇందులో అద్భుతం కానీ, ఆశ్చర్యపడాల్సినది కానీ ఏముంది? ఆయన సర్వేశ్వరుడు. ఆయనకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. ఒంటెను ఏమిటి? సూది బెజ్జంలోంచి విశ్వాలన్నిటినీ తీయగల సమర్థుడు’’ అని చాలా ధీమాగా చెప్పాడు. భక్తి శ్రద్ధలు మాత్రమే కాదు, భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం తప్పనిసరిగా ఉండాలని చెప్పే అనేక ఉదాహరణలు మన పురాణ గ్రంథాలలో ఉన్నాయి. పైన చెప్పిన కథలో మనం తెలుసుకోవాల్సినది ఏమిటంటే... భగవంతుడి శక్తి మీద భక్తుడికి ప్రగాఢ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం హృదయం లోతుల్లోంచీ రావాలి. ఆత్మ ద్వారా వ్యక్తం కావాలి.
అన్నీ సాధ్యమే...
కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందిన సహజయోగులకు... వారి ఆత్మ విశ్వాసం ద్వారా ఇది సులభసాధ్యం అవుతుంది. అప్పుడు అది అంధ విశ్వాసం కాదు. ఆత్మ వికాసంతో సాధించుకున్న విశ్వాసం. మనలో నిగూఢంగా, నిద్రాణ స్థితిలో ఉన్న దివ్యశక్తి అయిన కుండలినీ శక్తి... ఒక సద్గురువు సమక్షంలో జాగృతి చెందాలి. ఆత్మసాక్షాత్కారాన్ని అనుభూతిపరంగా మనం స్వయంగా గ్రహించాలి. భగవంతుడి ప్రేమను, అనుగ్రహాన్ని తక్కువగా అంచనా వేసుకోలేం కదా! మరి ఆత్మ సాక్షాత్కారాన్ని ఆయన సునాయాసంగా ప్రసాదిస్తాడనే విషయంలో సందేహం ఎందుకు? అంతా ఆయన ఇష్టప్రకారమే జరుగుతుంది. ఆయనను ప్రశ్నించడానికి, అంచనా వేయడానికి మనమెవరం? మనకు ఉండవలసినది ఆయన మీద, ఆయన శక్తి మీద తిరుగులేని విశ్వాసం మాత్రమే. దాని ద్వారా అన్నీ సాధ్యమేనని నమ్మాలి.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్