Empowering Women through Education: అమ్మలు ఒక్కటై బడి కట్టారు
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:40 AM
బాలభారతి... వేల మంది మహిళల శ్రమ ఫలితం. కార్పొరేట్ బడుల్లో పిల్లలను చదివించే స్థోమతలేని తల్లులు చిన్నస్థాయిలో ప్రారంభించిన ఈ పాఠశాల... నేడు ఏడు ఎకరాల్లో, మూడు అంతస్తుల్లో, అధునాతన సౌకర్యాలతో...
బాలభారతి... వేల మంది మహిళల శ్రమ ఫలితం. కార్పొరేట్ బడుల్లో పిల్లలను చదివించే స్థోమతలేని తల్లులు చిన్నస్థాయిలో ప్రారంభించిన ఈ పాఠశాల... నేడు ఏడు ఎకరాల్లో, మూడు అంతస్తుల్లో, అధునాతన సౌకర్యాలతో పేద విద్యార్థుల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తోంది. ఇది కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పొదుపు మహిళల విజయ గాథ. వారికి ఆ సంఘం గౌరవ సలహాదారు విజయభారతి అడుగడుగునా ప్రేరణగా నిలుస్తున్నారు.
అది 1995. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్న విజయభారతి...యూఎన్‌డీపీ ప్రాజెక్టు ఆఫీసరుగా కర్నూలు జిల్లా ఓర్వకల్లులో అడుగు పెట్టారు. దక్షిణాసియాలో పేదరిక నిర్మూలన కోసం ఐక్యరాజ్య సమితి చేపట్టిన ప్రాజెక్ట్‌లో భాగంగా అక్కడ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆమె నేతృత్వంలో కాల్వ, ఉశేనాపురం గ్రామాల్లో మహిళా పొదుపు సంఘాలు ఏర్పడ్డాయి. వారు ఆర్థికంగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండడంతో... ఆ స్పూర్తి మరో 25 గ్రామాలకు విస్తరించింది. ఆ సంఘాల సభ్యులు ఓ వైపు ఆర్థిక ప్రగతితో పాటు సంఘాలను బలోపేతం చేసుకోవడం, ఇతర సామాజిక అంశాల మీద దృష్టి పెట్టారు. 1998లో ‘ఓర్వకల్లు మండలం పొదుపు లక్ష్మి ఐక్య సంఘం’ ఏర్పాటు చేసుకున్నారు. దానికి ప్రభుత్వ కమ్యూనిటీ ఇన్వె్‌స్టమెంట్ ఫండ్, యూఎన్‌డీపీ ప్రాజెక్టు సీడ్ క్యాపిటల్ కింద రూ.1.50 కోట్ల నిధి సమకూరింది. సంఘం సభ్యులే సొంతంగా మహిళా బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిసోర్స్ ఆర్గనైజేషన్ (ఎన్‌ఆర్) హోదా కల్పించి వారికి మరింత చేయూత ఇచ్చింది. వారు ఆర్థికంగా ఎదుగుతున్నా.. రిసోర్స్ పర్సన్స్ (ఆర్‌పీ)గా రాష్ట్రాలు చుట్టేస్తున్నా... బ్యాంకులకు వెళ్లి నగదు జమ, విత్‌డ్రా చేయాలంటే ఫారాలు పూరించడానికి మరొకరి సాయం తీసుకోవాల్సి వచ్చేది. అందుకు ప్రధాన కారణం నిరక్షరాస్యతే. దాన్ని వారు అవమానంగా భావించారు. ‘ఇదే పరిస్థితి మన పిల్లలకు ఎదురైతే?’ అనే వేదన వారిని వేధించేది.
సందేహాలను దాటి...
ఆ ప్రాంతంలో పేద కుటుంబాలు పిల్లలను పొలం పనులకు పంపడంతో వారి భవిష్యత్తు నాశనమవుతోంది. ఈ అంశాన్ని ఐక్య సంఘం సమావేశంలో చర్చకు పెట్టారు విజయభారతి. ‘‘మన పిల్లలను మనమే చదివించుకుందాం’’ అని ప్రతిపాదన చేశారు. ‘అది సాధ్యమయ్యే పనేనా?’ అనే ప్రశ్రలు తలెత్తాయి. ఆమె వారిలో ఆత్మస్థైర్యం నింపారు. ముందుగా కాల్వబుగ్గ గ్రామ పాఠశాలలో వంద మంది పిల్లలతో ‘సమ్మర్ క్యాంప్’ నిర్వహించారు. దానికి గ్రామ మహిళలు స్వచ్ఛందంగా వంట సరుకులు, సామాగ్రి సమకూర్చారు. వంతులవారీగా పనులు చేశారు. ఆ సమయంలో ప్రపంచ బ్యాంక్ సౌత్ ఆసియా రీజియన్ వైస్ ప్రెసిడెంట్ అనంతపురానికి వెళుతూ... ఆ సమ్మర్ క్యాంప్ చూశారు. యూఎన్‌డీపీ కింద ప్రతి మండలంలో చైల్డ్ లేబర్ క్యాంపుల నిర్వహణకు నిధులు ఇవ్వాలని ఆమె చేసిన ప్రతిపాదనతో ‘భవిత బాల కార్మికుల పాఠశాల’ ఏర్పాటుకు పునాది పడింది. ఏడాదికి 200-300 మంది చొప్పున ఏడెనిమిదేళ్లలో రెండువేల మంది బాల కార్మికులను విద్యావంతులుగానే కాకుండా జీవితంలో స్థిరపడేలా తీర్చిదిద్దారు. సామాజిక స్పూర్తితో మహిళలు సాధించిన తొలి విజయం అది.
ఎందరో హేళన చేశారు...
ఈ క్రమంలోనే... తమ పిల్లల చదువు కోసం 2008లో ఓ చిన్న గదిలో 150 మంది విద్యార్థులతో సంఘం సభ్యులు పాఠశాల ప్రారంభించారు. పొదుపు మహిళలందరినీ ఏకతాటిపైకి తెచ్చి ప్రోత్సహించిన విజయభారతి పేరు వచ్చేలా ‘బాల భారతి పాఠశాల’ అని దానికి పేరు పెట్టారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా బడి భవనం నిర్మించాలని సంకల్పించారు. వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్‌గా ఇతర దేశాలకు వెళ్లడంద్వారా వచ్చిన పారితోషికంతో విజయభారతి నాలుగు ఎకరాలు, పొదుపు సంఘాల మహిళలు మూడు ఎకరాలు కొనుగోలు చేసి ఆ పాఠశాలకు ఇచ్చారు. ఏడు ఎకరాల్లో అధునాత సౌకర్యాలతో పాఠశాల నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వడ్డీల రూపంలో వచ్చిన డబ్బును, రిసోర్స్ పర్సన్లుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లడం వల్ల వచ్చిన పారితోషికంలో కొంత వాటాను ఇచ్చి... అవసరమైన నిధులు సమకూర్చుకున్నారు. పొదుపు మహిళలే కూలీలుగా, మేస్త్రీలుగా మారిపోయారు. ఒక్క రూపాయి కూలీ ఆశించకుండా బడి స్థలంలోనే గుడారాలు వేసుకొని వంతులవారీగా శ్రమదానం చేశారు. ఒక దశలో మధ్యలో పనులు ఆగిపోతే... ‘‘ఆడవాళ్లేమిటి... స్కూల్ కట్టడమేమిటి? కోటీశ్వరులకే చేతకాలేదు. కార్పొరేట్ స్కూళ్లకు అమ్మేయండి. డబ్బులైనా వస్తాయి’’ అంటూ ఎందరో హేళన చేశారు. అయినా వారిలో ఆత్మస్థైర్యం సడలలేదు. పది వేల మందికిపైగా మహిళలు... దాదాపు పదేళ్లు శ్రమించారు. అత్యద్బుతమైన పాఠశాల భవనం నిర్మించుకున్నారు. 2017లో రెండు అంతస్తులు పూర్తి చేశారు. అప్పటి సీఎం చంద్రబాబునాయుడు దాన్ని ప్రారంభించారు.
వారి పట్టుదలకు నిదర్శనం...
సెమీ రెసిడెన్షియల్ స్కూల్ తరహాలో నడుస్తున్న ఈ పాఠశాలలో ప్రస్తుతం మూడు అంతస్తుల్లో 42 తరగతి గదులు, ఏడు హాల్స్ ఉన్నాయి. డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, కంప్యూటర్ శిక్షణ హాల్, సైన్స్ ల్యాబ్, కాన్ఫరెన్స్ హాల్ సహా ఆఫీసు, ప్రిన్సిపల్ గది, ఎంఎంఎస్ గది, స్పోర్ట్స్ రూమ్, ఉపాఽధ్యాయుల గదులు, సువిశాలమైన ఆట స్థలం, ఆట వస్తువులు... ఇలా అధునాతన, సాంకేతిక సదుపాయాలు సమకూర్చుకున్నారు. ఇక్కడ నర్సరీ నుంచి 10వ తరగతివరకూ 1,070 మంది బాలబాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణ బాధ్యతలు పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. గ్రామాఖ్య సంఘాలు, ఓర్వకల్లు మండల పొదుపు లక్ష్మి ఐక్య సంఘంలో చురుకుగా పని చేస్తున్న ఐదుగురు మహిళలను ‘ఎడ్యుకేషన్ కమిటీ’ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఆ కమిటీ రెండేళ్లు పని చేస్తుంది. అలాగే 1,070 మంది విద్యార్థులకు శ్రీబాల ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు సహకారంతో పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అదిస్తున్నారు. అలాగే 1,250 పొదుపు సంఘాలు సభ్యుల నేతృత్వంలో విద్యార్థులకు స్నాక్స్ సమకూరుస్తున్నారు. ఒకప్పుడు ‘‘మీకు ఇది సాధ్యం కాదు’’ అని హేళన చేసినవారే... తమ పిల్లల సీట్ల కోసం అభ్యర్థించే స్థాయికి ఈ పాఠశాలను తీసుకువెళ్లడం ఈ పొదుపు మహిళల కృషికి, పట్టుదలకు నిదర్శనం. వారిని విజయభారతి వెన్నంటి ఉండి నడిపిస్తున్నారు. అందరూ ఆమెను ‘అమ్మ’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.
గోరంట్ల కొండప్ప, కర్నూలు,
ఫొటోలు: ఎస్‌ఎండీ రఫీ

స్త్రీశక్తి సమష్టి విజయం
మా గురువుగారైన ఐఏఎస్ అధికారి రాజు నెల్లూరు కలెక్టర్‌గా పని చేసే సమయంలో... ఆయన ప్రేరణతోనే సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం రిసోర్స్ పర్సన్‌గా వెళ్లాను. ‘‘డబ్బు లేకపోవడం ఒక్కటే పేదరికానికి కారణం కాదు. సామాజిక సమానత్వం వచ్చినప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యం’’ అని ఆయన పదేపదే చెప్పేవారు. ఆ స్ఫూర్తితో పొదుపు ఉద్యమంలో మహిళలను భాగస్వామ్యం చేశాం. సామాజిక సమస్యలపై పోరాడే తత్వం వారిలో పెంచగలిగాం. ఆ ప్రేరణతో డ్వాక్రా మహిళలు తమ పిల్లల భవిషత్తు కోసం తామే కార్పొరేట్‌కు దీటుగా అద్భుతమైన ఓ పాఠశాలను నిర్మించడమే కాదు, నిర్వహించే స్థాయికి ఎదిగారు. పాఠశాల ఎడ్యుకేషన్ కమిటీ సారథులు అందరూ మహిళలే. వారిలో అక్షరం విలువ తెలిసిన నిరక్షరాస్యులు కూడా ఉన్నారు. స్త్రీశక్తి సాధించిన సమిష్టి విజయం ఇది. 1995లో ఓర్వకల్లు మండలంలో వలసలు, బాలకార్మికులు, బాల్యవివాహాలు, నిరాక్షరాస్యత, మహిళలపై హింస... ఇలాంటి సమస్యలు అధికంగా ఉండేవి. పదో తరగతి చదివిన మహిళలు 5 శాతం కూడా లేరు. తమ పిల్లలనైనా బడికి పంపి ఉన్నతంగా చదివించాలనే వారి ఆలోచనే అద్బుతమైన పాఠశాల నిర్మాణానికి బీజం వేసింది. తక్కువ ఫీజులతో వేలాది మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం వెనుక మహిళల పదేళ్ల శ్రమ ఉంది.
- బత్తుల విజయభారతి