washing tricks: దుస్తులపై మరకలా... వదిలించండిలా...
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:27 AM
ఒక్కోసారి బట్టలపై అనుకోనివిధంగా మరకలు పడుతుంటాయి. సబ్బుతో ఉతికినా, వాషింగ్ మెషిన్‌లో వేసినా అవి పోవు.

ఒక్కోసారి బట్టలపై అనుకోనివిధంగా మరకలు పడుతుంటాయి. సబ్బుతో ఉతికినా, వాషింగ్ మెషిన్‌లో వేసినా అవి పోవు. కొన్ని చిట్కాలు పాటించి మొండి మరకలను సైతం సులువుగా పోగొట్టుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం!
బట్టలపై సిరా మరకలు పడితే వాటి మీద కొద్దిగా శానిటైజర్ లేదా పెర్ఫ్యూమ్ చల్లి దూదితో రుద్దాలి. ఒక చెంచా బేకింగ్ సోడాని నీళ్లతో తడిపి ముద్దలా చేసి ఈ మిశ్రమంతో రుద్దినా సిరా మరకలు వెంటనే పోతాయి. మరక మీద కొద్దిగా డెటాల్ వేసి అయిదు నిమిషాలు అలాగే ఉంచాలి. తరవాత టూత్ బ్రష్‌తో రుద్దితే మరక పోతుంది.
బట్టల మీద టీ లేదా కాఫీ ఒలికి మరకలు పడుతుంటాయి. అలాంటపుడు ఒక గిన్నెలో ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా వైట్ వెనిగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో మరకమీద రుద్దితే ఫలితం ఉంటుంది. మరక మీద టూత్ పేస్ట్ రాసి పది నిమిషాలు అలాగే ఉంచాలి. తరవాత వేడి నీళ్లతో కడిగి సబ్బుతో ఉతికితే మరకలు పోతాయి.
పార్కులో కూర్చున్నపుడు లేదా తోటపనిచేసినపుడు బట్టల మీద మరకలు ఏర్పడుతుంటాయి. అర బకెట్ నీళ్లలో అయిదు చెంచాల వెనిగర్ వేసి బాగా కలపండి. ఈ నీళ్లలో బట్టలను గంటసేపు నానబెట్టి తరవాత సబ్బుతో ఉతికితే మరకలన్నీ పోతాయి. టమాటా, తుప్పు, జ్యూస్, రక్తం మరకలను కూడా ఈవిధంగానే పోగొట్టవచ్చు.
చాక్లెట్ మరకలైనపుడు ఆ బట్టలను.... బట్టల సోడా కలిపిన నీళ్లలో అరగంటసేపు నానబెట్టి సబ్బుతో ఉతికితే చాలు.
బట్టలను వాషింగ్ మెషిన్‌లో వేసినపుడు కొన్నిటి రంగులు మిగతా వాటికి అంటుకుంటుంటాయి. సబ్బుతో రుద్దినా ఆ మరకలు పోవు. వాటి మీద 90 శాతం ఆల్కహాల్ ఉన్న ద్రావణాన్ని చల్లి దూదితో రుద్దితే రంగుల మరకలు పోతాయి.
రక్తం మరకలు పడినపుడు వాటి మీద హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం చల్లి అరగంటసేపు ఉంచాలి. తరవాత సబ్బుతో ఉతికితే మరకలు పోతాయి.
నూనె మరకలు పడినపుడు వాటి మీద డిష్ వాషింగ్ లిక్విడ్ లేదా బేకింగ్ సోడా చల్లి అరగంట తరవాత టూత్‌బ్ర్‌షతో రుద్దితే చాలు.
బకెట్ వేడి నీళ్లలో కొద్దిగా సర్ఫ్, కొద్దిగా బట్టల సోడా వేసి బాగా కలిపి అందులో బట్టలను నానబెట్టాలి. అరగంట తరవాత వాటిని సబ్బుతో ఉతికి ఎండలో ఆరవేస్తే తేలికపాటి మరకలన్నీ పోతాయి.