Sri Krishna Janmashtami: అల్లరి కృష్ణునికి అటుకుల నైవేద్యం..
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:20 AM
కృష్ణునికి అటుకులు, పాలు, మీగడ, వెన్న అంటే ఇష్టమని మనందరికీ తెలుసు. కృష్ణాష్టమి రోజున వీటితో రకరకాల వంటకాలు తయారుచేసి...
కృష్ణునికి అటుకులు, పాలు, మీగడ, వెన్న అంటే ఇష్టమని మనందరికీ తెలుసు. కృష్ణాష్టమి రోజున వీటితో రకరకాల వంటకాలు తయారుచేసి కృష్ణునికి నివేదిస్తూ ఉంటాం. తక్కువ సమయంలో తేలికగా అటుకులతో తయారుచేసే రుచికరమైన నైవేద్యాల గురించి తెలుసుకుందాం...

అటుకుల లడ్డు
కావాల్సిన పదార్థాలు
అటుకులు- రెండు కప్పులు, నెయ్యి- అయిదు చెంచాలు, జీడిపప్పు పలుకులు- కొన్ని, బాదం పలుకులు- కొన్ని, ఎండు కొబ్బరిపొడి- రెండు చెంచాలు, యాలకులు- మూడు, తురిమిన బెల్లం- ముప్పావు కప్పు, కాచి చల్లార్చిన పాలు- మూడు చెంచాలు
తయారీ విధానం
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో అటుకులు వేసి దోరగా వేయించి పళ్లెంలోకి తీయాలి. వాటిని చల్చార్చాలి. స్టవ్ మీద పాన్ పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి వేడిచేయాలి. అందులో జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు వేసి ఎర్రగా వేయించాలి. తరవాత ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి స్టవ్ మీద నుంచి దించాలి.
మిక్సీలో చల్లారిన అటుకులు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తరవాత బెల్లం తురుము వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జీడిపప్పు-బాదం పలుకుల మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అందులో మూడు చెంచాల నెయ్యి వేసి కొద్దికొద్దిగా పాలు చిలకరిస్తూ ముద్దలా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో కొద్దికొద్దిగా తీసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. అంతే..! కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకుల లడ్డు రెడీ..!

అటుకులు పెసరపప్పు పాయసం
కావాల్సిన పదార్థాలు
అటుకులు- ఒక కప్పు, పెసరపప్పు- అర కప్పు, బెల్లం- ఒకటింబావు కప్పులు, నెయ్యి- నాలుగు చెంచాలు, కాచి చల్లార్చిన పాలు- మూడు కప్పులు, యాలకుల పొడి- అర చెంచా, కొబ్బరి ముక్కలు- కొన్ని, జీడిపప్పు పలుకులు- కొన్ని, బాదం పప్పులు- కొన్ని, కిస్‌మి్‌సలు- కొన్ని, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి అందులో పెసరపప్పు వేసి దోరగా వేయించి మరో గిన్నెలోకి తీయాలి. అందులో నీళ్లు పోసి పెసరపప్పును రెండుసార్లు కడగాలి. తరువాత రెండు కప్పుల నీళ్లు పోసి పావుగంటసేపు నానబెట్టాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో బెల్లం వేసి పావుకప్పు నీళ్లు పోయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరవాత స్టవ్ మీద నుంచి దించి మరో గిన్నెలోకి వడబోయాలి. స్టవ్ మీద పాన్ పెట్టి మూడు చెంచాల నెయ్యి వేసి వేడిచేయాలి. అందులో కొబ్బరి ముక్కలు, జీడిపప్పు పలుకులు, బాదం పప్పులు, కిస్‌మిస్‌లు వేసి ఎర్రగా వేపి పళ్లెంలోకి తీసుకోవాలి. తరువాత అటుకులు వేసి, దోరగా వేయించి మరో పళ్లెంలోకి తీయాలి. అదే గిన్నెలో నానబెట్టిన పెసరపప్పును నీళ్లతో సహా వేసి ఉడికించాలి. మధ్యలో ఒక చెంచా నెయ్యి వేసి కలపాలి. పెసరపప్పు మెత్తగా ఉడికిన తరువాత వేయించిన అటుకులు వేసి కలపాలి. రెండు నిమిషాల తరువాత పాలు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని అయిదు నిమిషాలు ఉడికించి స్టవ్ మీద నుంచి దించాలి. తరవాత బెల్లం నీళ్లు పోసి కలపాలి. మళ్లీ గిన్నెను స్టవ్ మీద పెట్టి రెండు నిమిషాలు మిశ్రమాన్ని ఉడికించాలి. అదే సమయంలో... వేయించి పెట్టుకున్న కొబ్బరిముక్కలు, జీడిపప్పు, బాదం పప్పులు, కిస్‌మి్‌సలతోపాటు యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. అంతే! కమ్మని అటుకులు-పెసరపప్పు పాయసం నైవేద్యానికి రెడీ!