Ambikas Art: పరిసరాలే ప్రేరణగా
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:23 AM
తనలో దాగిన చిత్రకారిణిని నిద్ర లేపి, తనదైన శైలిలో చిత్తరువులను సృష్టిస్తున్నారు ఏలూరుకు చెందిన ఊరకరణం అంబిక. గ్రామీణ వాతావరణం,పల్లె ప్రజల జీవన....
తనలో దాగిన చిత్రకారిణిని నిద్ర లేపి, తనదైన శైలిలో చిత్తరువులను సృష్టిస్తున్నారు ఏలూరుకు చెందిన ఊరకరణం అంబిక. గ్రామీణ వాతావరణం,పల్లె ప్రజల జీవన విధానాల నుంచి స్ఫూర్తి పొందుతూ, వాటినే కళాఖండాలుగా మలుస్తూ, దేశ విదేశాల్లో విద్యార్థులకు చిత్రకళను బోధిస్తున్న అంబిక ‘నవ్య’తో పంచుకున్న కబుర్లు.
ఆర్టిస్ట్ అనగానే ఊహ తెలిసినప్పటి నుంచి బొమ్మలు గీసే అలవాటు ఉండి ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ నేను అందుకు భిన్నం. నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం అలవాటు లేదు. దాంతో ఎనిమిదో తరగతి ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా బొమ్మలు గీయడం కోసం కజిన్ల మీద ఆధారపడేదాన్ని. ఓ సందర్భంలో వాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఆ పనికి స్వయంగా పూనుకున్నాను. అలా వేసిన మొదటి బొమ్మ స్కూల్లో నాకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో బొమ్మలు గీయగలననే ఆత్మవిశ్వాసం పెరిగింది. నాలో అంతర్లీనంగా ఆ కళ దాగి ఉందనే విషయాన్ని కూడా నేనప్పుడే గ్రహించాను. ఆ తర్వాత చూసి బొమ్మలు గీస్తూ సాధన చేయడం మొదలుపెట్టాను. అది చూసి నాన్న కూడా బాగా ప్రోత్సహించారు. రంగుల పెన్సిళ్లు, డ్రాయింగ్ పుస్తకాలు ఇచ్చి నా అభిరుచికి మద్దతు పలికారు. నిజానికి చిత్రకళనే కెరీర్‌గా మలుచుకోవాలనే ఆలోచన ఉన్నా, సరైన గైడెన్స్ లేకపోవడంతో చదువు మీదే దృష్టి పెట్టాను. అలా తిరుపతిలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశాను. ఓ పక్క చదువు కొనసాగుతున్నా, చిత్రకళను నిర్లక్ష్యం చేయకుండా, సాధన చేస్తూనే ఉన్నాను. చదువు పూర్తయ్యాక పెళ్లైపోయింది. దాంతో మా వారి ఉద్యోగరీత్యా హైదరాబాద్, బెంగుళూరు వెళ్లాను. తర్వాత డాటా అనలిస్ట్‌గా కెరీర్ మొదలుపెడదామని అనుకుంటున్న సమయంలో పాప పుట్టింది. దాంతో మా వారు చిత్రకళ నే కెరీర్‌గా ఎందుకు మలుచుకోకూడదు? అని ప్రశ్నించారు. అలాగే చిత్రకళకు సంబంధించిన కోర్సు పూర్తి చేయమని కూడా ప్రోత్సహించారు. దాంతో నాలో ఉత్సాహం పెరిగింది. అప్పటివరకూ గీసిన బొమ్మలను ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించడం కోసం సిద్ధపడ్డాను.
గ్రామీణ వాతావరణమే స్ఫూర్తిగా...
బెంగుళూరులో సాటి చిత్రకారులతో కలిసి ఎగ్జిబిషన్స్‌లో బొమ్మలు ప్రదర్శించినప్పుడు, వాటికి మంచి స్పందన వచ్చింది. కొందరు సీనియర్ ఆర్టిస్టులు నేను వేసిన బొమ్మల్లో కొన్ని సవరణలు చేయడంతో నాలో మరింత ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత, కర్నాటక చిత్రకళా పరిషత్‌లో చిత్రకళలో ఏడాది పాటు డిప్లొమా కోర్సు చేసి, కళకు మరింత మెరుగులు దిద్దుకున్నాను. అలా అప్పటి నుంచి నాదైన శైలిని సృష్టించుకోవడం మొదలుపెట్టాను. అందుకోసం నా చుట్టూరా ఉన్న ప్రకృతినీ, గ్రామీణ వాతావరణాన్ని, గ్రామీణుల జీవనవిధానాన్ని పరిశీలిస్తూ, ఫొటోలు తీసుకుంటూ, వాటినే నాదైన శైలిలో చిత్తరువులుగా మలచడం మొదలుపెట్టాను. అలా గీసిన బొమ్మలతో బెంగుళూరు, హైదరాబాద్, పాలకొల్లులో 10 ఎగ్జిబిషన్లు పెట్టాను. 2023లో బెంగుళూరులో వంద మంది మహిళా ఆర్టిస్టులతో ఒక చిత్రకళా పోటీ ఏర్పాటు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ సెల్ఫ్ పొరె్ట్రయిట్ కాంపిటీషన్‌లో ప్రధమ బహుమతిని గెలుచుకున్నాను. అలాగే కళారత్న, చిత్రకళ అవార్డులు కూడా అందుకున్నాను. బెంగుళూరులో ఉన్న 15 ఏళ్లలో చిత్రకళకు మెరుగులు దిద్దుకోవడంతో పాటు దాన్నే కెరీర్‌గా మలుచుకోగలిగాను.

దేశవిదేశాల విద్యార్థులకు బోధిస్తూ...
ప్రస్తుతం విజయవాడలో స్థిరపడ్డాను. ఇక్కడ స్టూడియో ఏర్పాటు చేసుకుని ఓ పక్క బొమ్మలు గీస్తూనే, మరో పక్క చిత్రకళను బోధిస్తున్నాను. బొమ్మలు గీయడం కోసం అన్ని రకాల మీడియమ్స్‌నూ ప్రయత్నించాను. చివరకు నాకు తగిన మీడియం అక్రిలిక్ అనే విషయాన్ని గ్రహించాను. ప్రస్తుతం నా బొమ్మలన్నిటినీ ప్రధానంగా ఆక్రిలిక్స్‌తోనే రూపొందిస్తూ ఉంటాను. చార్కోల్‌తో కూడా బొమ్మలు గీయగలుగుతాను. గత పదిహేనేళ్లుగా విద్యార్థులకు కూడా చిత్రకళను నేర్పిస్తున్నాను. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు మార్గాల్లోనూ బోధిస్తున్నాను. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఫిన్‌ల్యాండ్, సింగపూర్‌లో స్థిరపడిన భారతీయులతో పాటు మన దేశంలో ఢిల్లీ, లడక్‌కు చెందిన విద్యార్థులు నా దగ్గర చిత్రకళను నేర్చుకుంటున్నారు. వీళ్లలో 6 నుంచి 60 ఏళ్ల వయసు వాళ్లున్నారు. ప్రస్తుతం 200 మంది విద్యార్థులకు నేను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పాఠాలు నేర్పిస్తున్నాను.
-గోగుమళ్ల కవిత