Dr. Sujata Guttala: స్వస్థత అందిస్తూ... సాంత్వన కలిగిస్తూ..!
ABN , Publish Date - Mar 03 , 2025 | 01:09 AM
వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, పౌష్టికాహారం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. యుక్తవయసు పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి... వారిలో మానసిక, భయాందోళనలు పోగొడుతున్నారు.
డాక్టర్ సుజాత గుత్తాల... విశాఖ స్టీల్ ప్లాంటు జనరల్ ఆసుపత్రిలో గైనకాలజీ విభాగం ఇన్‌చార్జ్... చీఫ్ స్పెషలిస్టు డాక్టర్. కానీ ఆమె కేవలం ఒక వైద్యురాలిగా ఆసుపత్రికే పరిమితం కాలేదు. సామాజిక కార్యకర్తగా పరిసర గ్రామాలకు వెళ్లి... వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, పౌష్టికాహారం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. యుక్తవయసు పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చి... వారిలో మానసిక, భయాందోళనలు పోగొడుతున్నారు. ఉత్తమ
వైద్యురాలిగా ఇటీవల ‘ప్రభుత్వరంగ సంస్థల మహిళా ఉద్యోగుల వేదిక’ (విప్స్) జాతీయ
అవార్డు అందుకున్న డాక్టర్ సుజాతను ‘నవ్య’ పలుకరించింది.
‘‘విశాఖ స్టీల్ జనరల్ ఆస్పత్రిలో రెండు దశాబ్దాలుగా నేను సేవలు అందిస్తున్నాను. ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రికి హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేకమంది వస్తుంటారు. వీరిలో ప్రముఖులూ ఉన్నారు. ముఖ్యంగా కాన్పుల కోసం వచ్చేవారు అధికం. ఆసుపత్రి గైనకాలజీ విభాగం ఇన్‌చార్జిగా, చీఫ్ స్పెషలిస్టు డాక్టర్‌గా నాపై విశ్వాసమే వారిని ఇక్కడవరకు రప్పిస్తోందని అనుకొంటున్నా. ఇక్కడ నామమాత్రపు ఫీజుతో బయటి రోగులకు వైద్య సేవలు అందిస్తాం. ఏడాదికి 350 నుంచి 400 మేజర్ ఆపరేషన్లు, మరో 450 వరకు మైనర్ ఆపరేషన్లు చేస్తున్నా. వీటివల్ల ఆసుపత్రి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఒక్క గైనకాలజీ విభాగం నుంచే రూ.30 లక్షలు సమకూరింది. కుట్లు లేకుండా హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయడం ఇక్కడి ప్రత్యేకత.

అలాగే పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్లు ఉన్నా కుట్లు వేయకుండా ఆపరేషన్ చేస్తాం. పిల్లలు లేని దంపతులకు కూడా చికిత్స అందిస్తున్నాను. చికిత్స ఫలించి, ఇప్పటికి యాభైకి పైగా జంటలకు సంతాన ప్రాప్తి కలిగింది. ఆసుపత్రిలో ఉన్న పరిమిత వనరులతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం.
సామాజిక సేవ...
ఆసుపత్రిలో వైద్యం ఒక్కటే కాదు... ఖాళీ ఉన్నా లేకపోయినా సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా కొంత సమయం కేటాయిస్తాను. స్టీల్‌ప్లాంటు పరిసర ప్రాంతాల్లో మహిళలు, యువతకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నాను. యుక్తవయసు పిల్లల్లో మానసిక ఒత్తిడి, భయాందోళనలు పోగొట్టేందుకు కౌన్సెలింగ్ ఇస్తున్నాను. వీలు చూసుకొని పరిసర గ్రామాలు, విద్యా సంస్థలకు వెళ్లి వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, జీవన విధానం, పౌష్టికాహారం, భద్రత, సామాజిక బాధ్యతల గురించి వివరించి చెబుతున్నాను.
కొవిడ్ పాజిటివ్ గర్భిణికి సర్జరీ...
కరోనా సమయంలో రోగులకు సాధారణ వైద్యం అందించడానికి చాలామంది డాక్టర్లు భయపడేవారు. కాన్పులు చేయడానికి అంగీకరించేవారు కాదు. ఇది నన్ను కలవరపెట్టింది. ఆ సమయంలో నిండు గర్భిణి డెలివరీ కోసం నా వద్దకు వచ్చింది. ఆమెకు కొవిడ్ పాజిటివ్. కానీ నేను వెనకడుగు వేయలేదు. సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశాను. తరువాత తెలిసింది... తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్‌లో సిజేరియన్ చేసిన తొలి వైద్యురాలిని నేనేనని. వైద్య వృత్తితో పాటు పరిశోధనలు కూడా కొనసాగిస్తున్నాను. గైనకాలజీకి సంబంధించి అనేక సమస్యలపై పరిశోధనా పత్రాలు సమర్పించాను. ఈ క్రమంలో పలు అవార్డులు కూడా అందుకున్నాను.
సమస్యను తెలుసుకొని...
నన్ను నమ్మి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నదే నా లక్ష్యం. బాధతో వచ్చినవారిని తిరిగి చిరునవ్వుతో పంపించడానికి నా శక్తిమేరకు ప్రయత్నిస్తా. ఆస్పత్రికి వచ్చేవారితో నవ్వుతూ మాట్లాడటం, సమస్యను పూర్తిగా తెలుసుకొని సరైన చికిత్స అందించడం... ఇదే నాకు తెలిసిన వైద్యం. అందుకే నన్ను వెతుక్కొంటూ ఇంతమంది పేషెంట్లు వస్తున్నారని అనుకొంటున్నా. అంతేకాదు... సహోద్యోగులతో కలివిడిగా ఉంటూ, ఏ కార్యక్రమం నిర్వహించినా ఉత్సాహంగా పాల్గొంటాను. కార్యక్రమం విజయవంతం చేయడానికి నావంతు కృషి చేస్తాను. బహుశా అందుకేనేమో నన్ను అందరూ అభిమానిస్తారు. నా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. మరింతమందికి అత్యుత్తమ వైద్య సేవలు అందించి, అందరి ఆదరాభిమానాలకు పాత్రురాలిని కావాలని కోరుకొంటున్నాను.’’
యర్రా శ్రీనివాసరావు, విశాఖపట్నం
సేవకు పురస్కారం...
‘ప్రభుత్వ రంగ సంస్థల మహిళా ఉద్యోగుల వేదిక’ (విప్స్) ఇటీవల న్యూఢిల్లీలో జాతీయ సమ్మేళనం నిర్వహించింది. అందులో నాకు ఉత్తమ వైద్యురాలిగా ఎగ్జిక్యూటివ్ విభాగంలో జాతీయ అవార్డు లభించింది. నా సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉంది. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.
Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..
Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..
Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా