Dr. Pragya Chigurupati: బస్సుతో భరోసా
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:17 AM
రొమ్ము క్యాన్సర్ పట్ల మహిళల్లో అవగాహన పెంచడం కోసం కేవలం వైద్య వృత్తికే పరిమితం కాకుండా సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు హైదరాబాద్‌కు చెందిన బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్ఞ చిగురుపాటి. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా ‘బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రెస్’ను నడుపుతున్న ప్రజ్ఞను ‘నవ్య’ పలకరించింది.
‘‘మన దేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు త్వరితంగా పెరిగిపోడానికి కారణం అవగాహనా రాహిత్యమే! మరీ ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన చాలా తక్కువ. దాంతో ఎంతో ఆలస్యంగా వైద్యులను ఆశ్రయిస్తూ, వ్యాధి ముదిరిపోయి, మృత్యువాత పడుతున్న సందర్భాలు కోకొల్లలు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో, వ్యాధి నిర్థారణ పరీక్షలను మహిళలకు చేరువ చేయడం కోసం ‘బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రెస్’ పేరిట ఒక బస్సును ప్రారంభించాను. రొమ్ము క్యాన్సర్ నివారణ వైపు నా ప్రయాణం సాగడం వెనకొక ఆసక్తికరమైన కథ ఉంది. దీనికి కారణం అమ్మ. 2012లో అమ్మకు రొమ్ములో సమస్య తలెత్తింది. దాంతో అమ్మ తనకు క్యాన్సర్ సోకిందేమోనని చాలా భయపడి పోయింది. వైద్యం కోసం ఏ డాక్టర్‌ను కలవాలో కూడా మాకు ఆ రోజుల్లో తెలియదు. దాంతో మేము క్యాన్సర్ వైద్య నిపుణుడిని కలిసాం.
ఆయన కొన్ని పరీక్షలు రాశారు. ఆ పరీక్షలు చేయించుకుంటున్న సమయంలో కూడా విపరీతమైన భయం. ఆ పరిస్థితులు నాపై బలమైన ముద్ర వేశాయి. అమ్మకు క్యాన్సర్ లేదని పరీక్షల్లో తేలిపోయింది. దాంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. నేను వైద్య విద్య చదవాలని.. అది కూడా రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన స్పెషాలిటీ ఎంచుకోవాలని ఆ సమయంలో నిర్ణయించుకున్నా. అలా అమ్మకొచ్చిన అస్వస్థత నన్ను క్యాన్సర్ వైద్య విద్య వైపు నడిపించింది. చెన్నైలో రామచంద్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి అయిన తర్వాత ముంబయిలోని టాటా మెమోరియల్‌లో ఫెలోషిప్ పూర్తి చేసుకున్నా. క్యాన్సర్ రోగులకు రొమ్ము పునర్‌నిర్మాణంలో నైపుణ్యం సాధించటం కోసం యూకేలో ఒక కోర్సు ఉంది. అది పూర్తి చేశాక, హైదరాబాద్ వచ్చి వైద్య వృత్తిని ప్రారంభించాది.

మొదట్లో...
నేను వైద్య వృత్తిని ప్రారంభించిన రోజుల్లో రొమ్ము క్యాన్సర్‌పై ప్రజల్లో ఎక్కువ అవగాహన ఉండేది కాదు. క్యాన్సర్‌ను గుర్తించే పద్ధతులు కూడా ఎక్కువ ప్రచారంలో లేవు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎంతో నష్టపోతున్నారని గమనించాం. ఎక్కువ మంది మహిళలు రొమ్ములలో సమస్యలతో డాక్టర్‌ల దగ్గరకు వెళ్లటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. డాక్టర్ల దగ్గరకు వారు రారు కాబట్టి.. మనమే వాళ్ల దగ్గరకు వెళ్తే బావుంటుందనే ఉద్దేశంతో బ్రెస్ట్ హెల్త్ ఎక్స్‌ప్రె్‌సను ప్రారంభించాం. దీనిలో అన్ని అత్యాధునిక రోగ నిర్ధారణ పద్ధతులు ఉంటాయి. వీటి ద్వారా మహిళలను పరీక్షించి వారికి ఏవైనా సమస్యలు న్నాయా అనే విషయాన్ని నిర్ధారిస్తారు. ఇలా ఇప్పటి దాకా తెలంగాణలోని అనేక జిల్లాలలో వేల సంఖ్యలో మహిళలను పరీక్షించాం. రొమ్ము క్యాన్సర్ ఉన్నవారికి ఉచితంగా చికిత్సను కూడా అందిస్తున్నాం. కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని పేద మహిళలకు మాత్రమే కాకుండా- వారితో మమేకమయిపోయిన ఆశా వర్కర్స్‌కు కూడా పరీక్షలు నిర్వహించాం. దీని వల్ల రెండు రకాల లాభాలు ఉంటాయి. ఆశా వర్కర్లకు సరైన వైద్య సదుపాయం లభిస్తుంది.. అంతే కాకుండా వారికి ఈ అంశంపై అవగాహన ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇతరులకు వారు ఈ సమస్య తీవ్రత చెప్పగలుగుతారు. దీని వల్ల మంచి ఫలితాలు లభించాయి.
ఉచితంగానే...
రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే పరీక్షలు కూడా ఒక క్రమ పద్ధతిలో సాగాలి. సాధారణంగా రొమ్ములో గడ్డ అనగానే వైద్యులు మామోగ్రాఫ్ పరీక్షనే సూచిస్తూ ఉంటారు. కానీ 40 ఏళ్ల లోపు మహిళలు మామోగ్రామ్ చేయించుకోవడం సరి కాదు. కాబట్టి మేం భౌతిక పరీక్షలు, ఇతరత్రా పరీక్షలతో వ్యాధిని అంచనా వేసి, అవసరమైన వారికే మామోగ్రామ్ చేపడతాం. పరీక్షలో వ్యాధి నిర్థారణ అయిన పక్షంలో తదుపరి చికిత్సల గురించి వివరిస్తాం. ఆర్థిక పరిస్థితి సహకరించని వారికి మేమే ఉచితంగా పూర్తి చికిత్సను అందిస్తాం. కొన్ని సందర్భాల్లో రొమ్ముల్లో క్యాన్సర్ కాని గడ్డలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన చికిత్సలను కూడా ఉచితంగా అందిస్తున్నాం. మా దగ్గర చికిత్స పొంది మళ్లీ సాధారణ జీవితం జీవిస్తున్న వారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా మరింత మందికి సాయం చేయాలనే ఉత్సాహం కలుగుతుంది.’’
గోగుమళ్ల కవిత
మర్చిపోలేని అనుభవం
కొందరు మహిళలకు గర్భిణిగా ఉన్నప్పుడు, లేదా ప్రసవం తర్వాత ఏడాది లోపు రొమ్ము క్యాన్సర్ సోకవచ్చు. ఒక సారి 29 ఏళ్ల గర్భిణి నన్ను కలిసింది. ఆమెకు రెండు రొమ్ముల్లోను గడ్డలు ఉన్నాయి. మొదట్లో అవి క్యాన్సర్‌కు సంబంధించినవి కావని వైద్యులు నిర్ధారించారు. కానీ నేను పరీక్షలు చేయిస్తే అవి క్యాన్సర్ గడ్డలని తేలింది. అప్పుడు వైద్యం మొదలుపెట్టి.. మళ్లీ ఆమెకు రొమ్ములు పునర్‌నిర్మించటానికి రెండేళ్ల సమయం పట్టింది. ఆ సమయంలో ఆమె తన స్థైర్యం కోల్పోలేదు. శరీరంలోని క్యాన్సర్‌తో పోరాడి గెలిచింది. ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. వారందరి గురించి ప్రపంచానికి తెలిస్తే- క్యాన్సర్ బాధితులకు స్ఫూర్తి కలుగుతుం.