Dr. B. Amudha: సంకల్పం అది పెద్ద సవాలు
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:40 AM
సైన్స్ అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. అందుకే... ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు వచ్చినా... కోరిమరీ వాతావరణ శాఖను ఎంచుకున్నారు. సీనియర్ అబ్జర్వర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి... నేడు ఆ శాఖ దక్షిణభారత కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేనేజర్ (డీడీజీఎం) స్థాయికి ఎదిగారు. ఈ పదవిని అలంకరించిన తొలి మహిళగా రికార్డులుకెక్కారు. మూడు దశాబ్దాలకు పైగా వాతావరణ శాఖలో సేవలు అందిస్తూ... డీడీజీఎంగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సైంటిస్ట్-ఎఫ్, డాక్టర్ బి.అముదను ‘నవ్య’ పలుకరించింది.

‘‘మాది తెలుగు వ్యవసాయ కుటుంబం. మా ముత్తాతల మూలాలు ఆంధ్రాలో ఉన్నాయి. అమ్మ సరస్వతి, నాన్న భక్తవత్సలు. మేం ముగ్గురం సంతానం. నాన్న మొదట్లో వేలూరు జిల్లా పల్లికొండలో టీచర్‌గా, ఆ తరువాత 1971లో చెన్నైలోని పచ్చయప్పాస్ కళాశాల ప్రొఫెసర్‌గా పని చేశారు. దాంతో నా బాల్యం, విద్యాభ్యాసం అంతా ఇక్కడే గడిచిపోయాయి. నేను ‘క్వీన్ మేరీస్ కళాశాల’లో బీఎస్సీ, ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాను. ఎంఎస్సీలో గోల్డ్ మెడలి్‌స్టను. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనేది నాన్న ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే నా బీఎస్సీ కాగానే ప్రభుత్వ ఉద్యోగం కోసం రకరకాల పరీక్షలు రాయించేవారు. ఇన్‌కంట్యాక్స్, ఎల్‌ఐసీ, వాతావరణశాఖ, ఇంకా తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు వచ్చాయి.
వాతావరణశాఖనే ఎంచుకున్నా...
నేను చేసింది బీఎస్సీ ఫిజిక్స్ కాబట్టి అందుకు తగిన ఉద్యోగం వాతావరణ శాఖలో ఉంటుందని, భవిష్యత్తు కూడా బాగుంటుందని పెద్దలు చెప్పారు. అందుకే వాతావరణ శాఖను ఎంచుకున్నాను. 1991 ఏప్రిల్‌లో సీనియర్ అబ్జర్వర్‌గా ఉద్యోగంలో చేరాను. ఎంఎస్సీ అయ్యాక డిపార్ట్‌మెంటల్ పరీక్ష రాశాను. అందులో ఆలిండియా మొదటి ర్యాంకు వచ్చింది. దాంతో 1997లో సైంటిఫిక్ అసిస్టెంట్‌ను అయ్యాను. కొన్నాళ్లకు యూపీఎస్‌సీ రాసి, మెట్ గ్రేడ్-2 అయ్యాను. ఏడాది ట్రైనింగ్ పూర్తయ్యాక పుణేలో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడే ఐదున్నరేళ్లపాటు పని చేశాను. అయితే సొంతూరుపై ఉన్న అభిమానం, అమ్మానాన్నలకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో బదిలీపై చెన్నైకి వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే పని చేస్తున్నాను. 2020 కొవిడ్ కాలంలో ఏవియేషన్ హెడ్‌గా పని చేశాను. ఆ సమయంలో మిషనరీని ఆధునీకరించడంతో పాటు అప్‌గ్రేడ్ చేసే అవకాశం వచ్చింది.
డాక్టరేట్ నా కల...
పీహెచ్‌డీ చేయాలనేది నా కల. పుణేలో ఉన్నప్పుడే ఆ ప్రయత్నం చేశాను. కానీ చెన్నై వచ్చాక కానీ అది ఫలించలేదు. 2018లో పీహెచ్‌డీ పూర్తి చేశాను. యాభయ్యేళ్ల ప్రాయంలో డాక్టరేట్ అందుకున్నాను. 1999లో బీఎల్ పట్టా పొందాను. 19 జర్నల్స్‌లో నా పరిశోధనా పత్రాలు ముద్రితమయ్యాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నాను.
2008లో పుణెలో ఉండగా ‘ఎక్స్‌లెన్స్ ఫర్ ఔట్‌స్టాండింగ్ పెర్ఫామెన్స్’ అవార్డు, 2011లో ఐఎండీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గ్రూప్1 ఆఫీసర్స్ విభాగంలో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు, 2016లో ప్రపంచ వాతావరణ సంస్థ నుంచి ‘ప్రొఫెసర్ విల్హో వైశాల’ అవార్డు వచ్చాయి. ‘ఆల్టర్‌నేటివ్స్ ఫర్ డేంజరస్ అండ్ అబ్సలేట్ ఇన్‌స్ట్రుమెంట్స్’ (ప్రమాదకరమైన మరియు వాడుకలో లేని పరికరాలకు ప్రత్యామ్నాయాలు) అనే అంశంపై నేను చేసిన కృషికి గుర్తుగా ప్రొఫెసర్ విల్హో వైశాల అవార్డు ప్రదానం చేశారు. దేశంలోనే వాతావరణ శాఖలో ఈ అవార్డు స్వీకరించిన తొలి సైంటి్‌స్టని నేనే. 2003-2008 కాలంలో పుణే రీజన్‌లో ఉండగా 550 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల కమిషన్‌కు ప్రాజెక్టు డైరెక్టర్‌గా వ్యవహరించడం సవాలుతో కూడుకున్నది.
ధైర్యంగా రావచ్చు...
వాతావరణశాఖలోకి మహిళలు ధైర్యంగా రావచ్చు. ఈ శాఖలో మాకన్నా ముందు ఉద్యోగాల్లో చేరిన వారు రోస్టర్ డ్యూటీలు కూడా చేసేవారు. 1970ల నుంచే మహిళలు విమానాశ్రయాల్లోని కార్యాలయాల్లో నైట్ డ్యూటీలు కూడా చేసేవారు. అయితే ఇప్పుడు మహిళలకు జనరల్ డ్యూటీలు వేస్తున్నారు. మా విభాగంలో మహిళలకు ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. సంస్థ తరుఫున అంటార్కిటికా వెళ్లేందుకు చాలామంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. అక్కడ ఏడాది పాటు విధులు నిర్వర్తించాలి. అలాగే పలు దీవుల్లో పని చేసేందుకు కూడా ఇప్పుడు మహిళా ఉద్యోగులు ముందుకు వస్తున్నారు. ఇది శుభ పరిణామం.
సవాళ్లు ఎదురైనా...
నేను ఇన్‌స్టలేషన్, ఏవియేషన్ విభాగాల్లో కూడా పని చేశాను. విమానాలు ల్యాండ్ అవ్వాలన్నా, టేకాఫ్ అవ్వాలన్నా ముందుగా వాతావరణ శాఖ నుంచి క్లియరెన్స్ అడుగుతారు. మనం ఏమాత్రం పొరపాటుగా నివేదిక ఇచ్చినా, కోట్లాది రూపాయలతో పాటు ఎంతో ప్రాణనష్టం జరుగుతుంది. అక్కడ బాధ్యతలు నిర్వర్తించడం సవాలుతో కూడుకున్నది. అలాంటి ఏవియేషన్‌కు నేను మూడేళ్లపాటు నేతృత్వం వహించాను. నాకు అప్పగించిన ఏ పని అయినా, ప్రాజెక్టు అయినా కష్టంగా భావించలేదు. అదంతా ఒక శిక్షణలా అనుకున్నాను.
ప్రకృతిని అంచనా వేయడం కష్టం...
సైక్లోన్ మూమెంట్‌ని బట్టి ఫలానా చోట తీరం దాటుతుందని సాంకేతికత సాయంతో ఇప్పటి వరకూ చెబుతున్నాం. రాడార్, శాటిలైట్ల సాయంతో సైక్లోన్‌ను అంచనా వేసి, ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేయగలుగుతున్నాం. సముద్రంలో జరిగే పరిణామాలు, మార్పులను అంచనా వేయడం పెద్ద సవాలు. ఒక్కోసారి తుఫాను సముద్రంలో రాత్రిపూట వేగంగా పయనిస్తుంది. ఒక్కోసారి ఆరు గంటల పాటు ఒకేచోట ఆగిపోతుంది. లేదంటే నెమ్మదిగా పయనిస్తుంది. ఎందుకిలా జరుగుతుందన్నదానిని అంచనా వేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాం. మన దేశంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల వాటిని అంచనా వేయడం క్లిష్టతరమైన పని. అందుకే కొన్నిసార్లు అంచనాలు తలకిందులవుతాయి. దేశ వ్యాప్తంగా 39 రాడార్లు ఉన్నాయి. ఒక్కో రాడార్ ఏర్పాటుకు రూ.25 కోట్లు ఖర్చవుతుంది. రాడార్ల సంకేతాలను అంచనా వేసి కచ్చితమైన సమాచారం అందించేందుకు వాతావరణశాఖ శాయాశక్తులా ప్రయత్నిస్తోంది. చాలామంది విదేశాల్లో అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారని అడుగుతుంటారు. కానీ అక్కడా తుఫానులను అంచనా వేయడంలో సవాళ్లు ఉంటాయి. వాతావరణ స్థితిగతుల్లో వారికి, మనకు చాలా వ్యత్యాసం ఉంది.
ఎప్పుడూ అనుకోలేదు...
ఎంతో ఘన చరిత్ర గల చెన్నైలోని వాతావరణ కేంద్రం దక్షిణభారత డీడీజీఎం అవడం, అందులోనూ ఈ పదివిని చేపట్టిన తొలి మహిళను నేనే కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ పదవి నన్ను వరిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నాకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. అంతేకాదు... నా సాధారణ విధులతో పాటు ‘ఆర్‌ఎంసీ చెన్నై’ హెడ్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాను. ఏదిఏమైనా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి ఎంతోమంది ప్రాణాలను రక్షించే వాతావరణ శాఖలో పని చేయడం నాకు ఎంతో గర్వంగా ఉంది.’’
డాక్టర్ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై
ఫొటో: కర్రి శ్రీనివాస్
ప్రపంచ వాతావరణ సంస్థలో...
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) నిపుణుల బృందంలో సభ్యురాలిగా నాకు మూడు అసైన్‌మెంట్లు అప్పగించారు. విధుల్లో భాగంగా ఓ ప్రాజెక్టు కోసం 2006 అమెరికాలోని వర్జీనియాకు, 2013లో కెన్యాకు, ‘ప్రొఫెసర్ విల్హో వైశాల’ అవార్డు స్వీకరణకు 2016లో స్పెయిన్‌కు వెళ్లాను.