Fake ORS Labeling: వైద్యురాలి విజయం
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:44 AM
ఇది నా ఒక్కదాని విజయం కాదు. వైద్యులు, న్యాయవాదులు, తల్లులు... ఇలా ఎంతో మంది సమష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యపడింది. ప్రతి వంద మరణాల్లో..
‘ఇది నా ఒక్కదాని విజయం కాదు. వైద్యులు, న్యాయవాదులు, తల్లులు... ఇలా ఎంతో మంది సమష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యపడింది. ప్రతి వంద మరణాల్లో 13 మరణాలు డయారియాతో ముడిపడి ఉంటున్నాయి. డయేరియా ఫలితంగా తలెత్తే డీహైడ్రేషన్ వల్లే ఇలాంటి ముప్పు వాటిల్లుతూ ఉంటుంది. ఆ ముప్పు నుంచి తప్పించుకోవడం కోసం ఓఆర్‌ఎస్ అనే అద్భుత ఔషధాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం. 20వ శతాబ్దపు అద్భుత ఔషథంగా వైద్యులు ఓఆర్‌ఎ్‌సను పరిగణిస్తూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణిక ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని సూచించింది. దాంతో మాత్రమే పిల్లలు డయేరియా నష్టం నుంచి పూర్తిగా కోలుకోగలుగుతారు. కానీ కొన్ని కంపెనీలు ఓఆర్‌ఎస్ పేరుతో అధిక చక్కెరలు కలిపిన పానీయాలను ఆకట్టుకునే ప్యాకెట్లలో విక్రయించడం మొదలుపెట్టాయి. ఫార్మసీలు, ఆస్పత్రులు, బడులు, ఔషథ దుకాణాలు.. ఇలా అన్ని చోట్లా నకిలీ ఓఆర్‌ఎ్‌సలు విస్తృతంగా అందుబాటులో ఉండడంతో, సాధారణ ప్రజలు వీటినే అసలైన ఓఆర్‌ఎ్‌సలుగా భ్రమపడుతూ కొనుగోలు చేసి వాడుకుంటున్నారు.
అలుపెరగని పోరాటంతో...
అసలైౖన ఓఆర్‌ఎ్‌సలో వంద మిల్లీలీటర్లకు 1.3 మిల్లీగ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. కానీ ఇదే పరిమాణంలోని ఇతరత్రా ఓఆర్‌ఎ్‌సలలో ఏకంగా 12 గ్రాముల చక్కెర ఉంటోంది. ఫలితంగా అప్పటికే డయారియాతో నీరసించిపోయిన పిల్లలు ఈ పానీయాలతో మరింత డీహైడ్రేషన్‌కు లోనై ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తుతోంది. ఇలాంటి పానీయాలతో పిల్లలు చనిపోయినప్పటికీ, డయేరియా వల్ల చనిపోయారనే భావిస్తారు తప్ప నకిలీ ఓఆర్‌ఎ్‌సల వల్ల చనిపోయారని ఎవరూ గ్రహించలేకపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలను ప్రత్యక్షంగా చూశాను కాబట్టే 2018 నుంచి అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టాను. ఆ తర్వాత 2021లో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు ఉత్తరం రాశాను. వాళ్లు వెంటనే స్పందించి, మార్కెట్లో దొరుకుతున్న నకిలీ ఓఆర్‌ఎస్ పానీయాలకు తాము అనుమతి ఇవ్వలేదనీ, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను సంప్రతించాలని సమాధానమిచ్చారు. వాళ్లకు, ఆరోగ్య మంత్రికీ పదే పదే ఉత్తరాలు రాసిన తర్వాత చివరకు వాళ్లు 2012, ఏప్రిల్ 8న... ఏ ఆహారపదార్థం, ఏ పానీయం మీదా పేరుకు ముందు లేదా వెనక... ఓఆర్‌ఎస్ అనే అక్షరాలను వాడకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ కంపెనీల ఒత్తిడి మేరకు ఆ ఆదేశాన్ని ఉపసంహరించుకుని, ‘ఇది ఓఆర్‌ఎస్ కాదు’ అనే సూచనను ముద్రించి విక్రయించుకోవచ్చని తిరిగి ఆదేశాలను సరిదిద్దడం జరిగింది. దాంతో 2022లో కోర్టులో పిల్ వేశాను. ఆ తర్వాత 2024, ఫిబ్రవరి 24న, ఏ కంపెనీ అయినా డిస్‌క్లెయిమర్‌తో పాటు ఓఆర్‌ఎస్ అని ముద్రించి ఉత్పత్తులను విక్రయించుకోవచ్చనే ఆదేశాలొచ్చాయి. ఈ పరిస్థితి నన్నెంతో బాధ పెట్టింది. దాంతో నా ఆవేదనను వ్యక్తం చేస్తూ భావోద్వేగపూరితమైన వీడియోను విడుదల చేశాను.
దానికి మంచి స్పందన వచ్చింది. చివరకు ఈ ఏడాది జూన్‌లో మళ్లీ ఆరోగ్య మంత్రికి ఉత్తరం రాసి, ప్రధానికి ఒక కాపీ పంపించాను. ఈసారి వీడియో క్లిప్పింగ్స్, ఉదంతాలకు సంబంఽధించిన అన్ని రకాల రుజువులను కూడా జత చేశాను. అయితే ఆ ఉత్తరమే వాళ్లను కదిలించిందో, నా భావోద్వేగ వీడియో ఆలోచింపచేసిందో తెలియదు కానీ, అక్టోబరు 15న మునుపటి ఆదేశాలను రద్దు చేస్తూ... ఎలాంటి పదార్థం, పానీయం ప్యాక్‌ల మీద ఓఆర్‌ఎ్‌సల అక్షరాలను ముద్రించడానికి వీల్లేదంటూ ఆదేశాలు వచ్చేశాయి. ఈ పోరాటంలో నేను ఎన్నో బెదిరింపులు, అవహేళనలను ఎదుర్కొన్నాను. కానీ కుటుంబసభ్యులు, సాటి వైద్యులు, యువత, మీడియా ప్రతినిధుల ప్రోత్సాహంతో పట్టుదలగా పోరాడి, అంతిమంగా విజయం సాధించగలిగాను.’’
గోగుమళ్ల కవిత