Unique Rangoli Designs: నీళ్ల మీద రంగోలీ
ABN , Publish Date - Jul 28 , 2025 | 04:05 AM
నీళ్ల మీద రంగవల్లులు దిద్దుతూ వినూత్నమైన కళకు శ్రీకారం చుడుతున్నారు హైదరాబాద్‌కు చెందిన సమ్మెట రేవతి. ఆకర్షణీయమైన రంగుల ముగ్గులతో ఇప్పటివరకూ వందకు పైగా...
వినూత్నం
నీళ్ల మీద రంగోలీ
నీళ్ల మీద రంగవల్లులు దిద్దుతూ వినూత్నమైన కళకు శ్రీకారం చుడుతున్నారు హైదరాబాద్‌కు చెందిన సమ్మెట రేవతి. ఆకర్షణీయమైన రంగుల ముగ్గులతో ఇప్పటివరకూ వందకు పైగా దేవతామూర్తుల రూపాలను నీళ్ల మీద సృష్టించారామె. ఈ కళ పట్ల ఏర్పడిన మక్కువ గురించీ, పొందుతున్న ఆదరణ గురించీ ‘నవ్య’తో ఇలా ముచ్చటించారు.
నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలేయడమంటే ఇష్టం. అలాగే ముగ్గులు కూడా ఇష్టంగా వేసేదాన్ని. చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉన్న రామాలయం ముందు పండుగల్లాంటి ప్రత్యేకమైన రోజుల్లో రంగులతో రంగవల్లులు దిద్దుతూ ఉండేదాన్ని. ముగ్గు వేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం కోసం నీళ్లు పక్కనే పెట్టుకుంటూ ఉంటాను. అయితే ఒకసారి ముగ్గు వేస్తున్న సమయంలో నా చేతిలో నుంచి రంగు ముగ్గు జారి నీళ్లలో పడిపోయింది. అది నీళ్ల మీద తేలుతూ ఉండడంతో నీళ్ల మీద రంగవల్లులు దిద్దితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. అలా గత ఫిబ్రవరిలో నీళ్ల మీద ముగ్గులేసే ‘ఫ్లోటింగ్ ఆర్ట్’కు బీజాలు పడ్డాయి. అంతకు ముందు ఆరేళ్ల నుంచీ ఆర్ట్ వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తున్నప్పటికీ శివరాత్రి నాడు, నీళ్ల మీద వేసిన శివుడి రంగోలీతో మంచి ఆదరణ దక్కింది. పలువురు ఫలానా దేవుడి బొమ్మ వేయండి అంటూ సోషల్ మీడియా ద్వారా నన్ను అడుగుతూ ఉంటారు. తాజాగా కొమరవెల్లి మల్లన్న రంగోలీ వేయమని ఎంతో మంది నన్ను అడిగారు. కానీ ఆంధ్రలో పుట్టి పెరిగిన నాకు తెలంగాణా మల్లన్న స్వామి గురించిన అవగాహన లేదు. దాంతో గూగుల్‌లో వెతికి మల్లన్న స్వామి రూపురేఖలను గమనించి, ఆ తర్వాత రంగోలీకి పూనుకున్నాను. అలాగే అభిమానుల కోరిక మేరకు స్థానిక దేవతలు, గ్రామ దేవతల రంగోలీలు కూడా వేస్తూ ఉంటాను. ఇలా ఇప్పటివరకూ వందకు పైగా దేవతా రంగోలీలు వేశాను.
భక్తిశ్రద్ధలతోనే...
నీళ్ల మీద ముగ్గు వేయడం ఒకింత కష్టమేనని చెప్పాలి. ముగ్గు బరువుగా ఉంటుంది కాబట్టి చటుక్కున పోసేస్తే నీళ్లలో మునిగిపోతుంది. కాబట్టి నీళ్ల మీద తేలేలా ముగ్గును నెమ్మదిగా పోయాలి. బొమ్మ వేసే ముందు నేనెలాంటి సాధనా చేయను. వేయబోయే దేవతా చిత్రాన్ని, ధరించిన నగలనూ పది నిమిషాల పాటు గమనించి, నీళ్ల మీద రంగోలీ మొదలుపెట్టేస్తూ ఉంటాను. ముగ్గు వేసే సమయంలో ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండడం కోసం భక్తి పాటలు వింటాను. దేవునికి ఉపయోగించే సామాగ్రిని కూడా దైవసమానంగానే భావించాలని సనాతన ధర్మం చెప్తోంది. కాబట్టి రంగోలీ కోసం నీళ్లు నింపే స్టీలు పళ్లెం, ముగ్గు భరిణెలను పూజా సామాగ్రితో సమానంగా భావిస్తాను. రంగోలీ పూర్తి అయిపోయిన తర్వాత, ఆ నీళ్లను అందరూ తొక్కే వీల్లేకుండా పార్కులో ఓ మూలన పోరబోస్తాను. అడుగున పేరుకున్న ఇసుకను కూడా దగ్గర్లోని కాల్వల్లో కలిపేస్తూ ఉంటాను. అలాగే రంగోలీకి ముందూ, తర్వాత సదరు దేవతలకు నమస్కరించుకుంటూ ఉంటాను.

లక్ష మంది సబ్‌స్ర్కైబర్లు ఆ దేవుడి చలవే!
అమ్మవార్ల బొమ్మలైనా, ఇతర దేవతల బొమ్మలైనా బొమ్మ మొత్తం పూర్తయిన తర్వాత చివర్లో బొట్టు పెట్టి ముగించడం నాకు అలవాటు. అలా ఒకసారి నాలుగున్నర గంటల పాటు కష్టపడి నీళ్ల మీద వేంకటేశ్వర స్వామి వారి రంగోలీ వేశాను. కానీ చివర్లో నామం పెట్టే సమయంలో, కాస్త ఎక్కువ ముగ్గు జారి పడిపోవడంతో, ఆ ప్రదేశం నుంచి నీళ్లు బయటకు వచ్చేయడం మొదలుపెట్టాయి. ఎంత సరిదిద్దే ప్రయత్నం చేసినా వీలు పడలేదు. దాంతో నాకు ఏడుపొచ్చేసింది. అయినా వీడియోలో ఎడిట్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసుకోవచ్చు. కానీ అందుకు నాకు మనస్కరించలేదు. మళ్లీ ఆ నీళ్లన్నీ ఒంపేసి, ఇంకొక నాలుగున్నర గంటల పాటు కష్టపడి అదే బొమ్మను సృష్టించాను. ఆ బొమ్మతో యూట్యూబ్‌లో నాకు లక్ష మంది సబ్‌స్ర్కైబర్లు పూర్తవడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ప్రస్తుతం నాకు ఒక లక్ష 65 వేల మంది యూట్యూబ్ సబ్‌స్రైబర్లు ఉన్నారు. పేపర్ లేదా కాన్వా్‌సల మీద వేసే బొమ్మలు శాశ్వతంగా ఉండిపోతాయి. కానీ నీళ్ల మీద వేసే రంగోలీలను అలాగే ఉంచుకోలేం! మరొక రంగోలీ వేయాలంటే, ఆ నీళ్లను ఒంపేసి, తాజా నీళ్లను నింపుకోక తప్పదు. ఇదెంతో బాధాకరమైన విషయం. అయితే ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదు కాబట్టి మరొక కొత్త రంగోలీ కోసం పాత రంగోలీని తొలగిస్తున్నట్టు నాకు నేను సర్దిచెప్పుకుంటూ ఉంటాను. నిజానికి రంగోలీని తొలగించేటప్పుడు బాధ కలగకుండా ఉండడం కోసం, రంగోలీని కలిపే దృశ్యాన్ని వీడియో తీసి, దాన్ని రివర్స్ చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను.
గోగుమళ్ల కవిత
నేను క్లాసికల్ డాన్సర్‌ను. ఐదేళ్ల వయసు నుంచి ఇప్పటివరకూ 350 కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చాను. అలాగే బాధ్యత, భగవంత్ కేశరి, గుంటూరు కారం, ఖుషి మొదలైన సినిమాల్లో చిన్న పాత్రల్లో కూడా నటించాను. పలు టీవీ సీరియల్స్‌లో కూడా నటించాను. మాది ఏలూరు జిల్లా, కలిదిండి. నేను అక్కడే పుట్టి పెరిగాను. నాన్న సమ్మెట రామారావు, జనరల్ స్టోర్ నడుపుతూ ఉంటారు. అమ్మ అమ్మాజీ టైలర్. మావారు సివిల్ ఇంజనీర్. మాకొక బాబు. నీళ్ల మీద రంగోలీ నాతోనే మొదలైందని అందరూ అంటూ ఉంటారు. ఇంటర్నెట్‌లో కూడా ఇలాంటి కళ నాకెక్కడా కనిపించలేదు. ఈ ఫ్లోటింగ్ ఆర్ట్ ఎంతలా విస్తరిస్తే, నేను కూడా అంతలా అందరికీ గుర్తుండిపోతాను. కాబట్టి భవిష్యత్తులో ఈ కళను పలువురికి నేర్పించాలనే ఆలోచన ఉంది.
ఇవి కూడా చదవండి
మామ, అల్లుడి గొడవ.. ఆపడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దారుణం..
ఈ ఒక్క జ్యూస్‌తో గుండె జబ్బులన్నీ మాయం..