Benefits of Pointed Gourd: భోజన కుతూహలం కొమ్ముపొట్లను ఆదరించండి!
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:34 AM
కొమ్ముపొట్లకాయలు ఆకుపచ్చగా, తెల్లచారలతో మెరుస్తూ దొండకాయలా అనిపిస్తాయి. పేరులో ’పొట్ల‘ ఉన్నా ఇది పొట్లకాయ కుటుంబానికి చెందినది కాదు....
కొమ్ముపొట్లకాయలు ఆకుపచ్చగా, తెల్లచారలతో మెరుస్తూ దొండకాయలా అనిపిస్తాయి. పేరులో ’పొట్ల‘ ఉన్నా ఇది పొట్లకాయ కుటుంబానికి చెందినది కాదు; ఆకారం దొండలా ఉన్నా ఇది దొండకాయ కుటుంబానికి చెందినదీ కాదు. గుమ్మడి కుటుంబానికి చెందిన మొక్క. పైన తొక్క గట్టిగా ఉంటుంది. తొక్కను తీసి, దొండకాయల మాదిరిగా తరిగి వండుతారు. రెండు అంచులా మొనదేలిన రూపం వలన దీనిని ఆంగ్లంలో ‘పాయింటెడ్ గోర్డ్’ అని పిలుస్తారు. ఇది దక్షిణాదిలో తక్కువగా, ఉత్తరాదిలో ఎక్కువగా పండుతుంది. ఉత్తరాదిన దీన్ని ’పర్వల్‘ అని పిలుస్తారు. మన ఆయుర్వేద గ్రంథాల్లో దీని విశిష్టతలను వివరించారు.
పర్వల్ మన జీర్ణవ్యవస్థను బలపరిచి పైత్యాన్ని తగ్గిస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. చరకుడు దీనిని ‘శాంతకారిణి ఔషధ కూరగాయ’గా పేర్కొన్నాడు.‘చరక సంహిత’ ప్రకారం ఇది తృప్తిఘ్న (కొంచెం తినగానే కడుపునిండిపోయేలా ఉండటాన్ని తగ్గిస్తుంది), తృష్ణానియంత్రక (దప్పికను తగ్గిస్తుంది) గుణాలు కలిగి ఉంటుంది. వేడి వల్ల కలిగే చర్మమంటలు, చేతుల కాలిన భావనలకు ఉపశమనం ఇస్తుంది.
‘భోజనకుతూహలం’ గ్రంథంలో పర్వల్ వల్ల కలిగే ప్రయోజనాలను పేర్కొన్నారు. వాటి ప్రకారం- ఇది జ్వరాలను తగ్గిస్తుంది. బలం, పుష్టి, సంతృప్తి, ఆనందం అన్నింటినీ కలిగిస్తుంది.
పర్వల్‌లో విటమిన్ ఏ, ఇ, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం లాంటివి సమృద్ధిగా ఉంటాయి. దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది మధుమేహం, స్థూలకాయం ఉన్నవారికి మేలు చేస్తుంది.
పర్వల్‌ను దొండకాయల మాదిరిగా వండుకోవచ్చు. ఇది ప్రధానంగా జీర్ణకోశ అవయవాల బలవృద్ధికి సహాయపడుతుంది. బలహీన జీర్ణక్రియ, లివర్, పాంక్రియాజ్ సమస్యలున్న వారికి ఇది ఉపకరిస్తుంది.
పర్వల్ పండ్లను గుజ్జుగా చేసి చర్మమంటలపై రాస్తే చల్లదనం కలుగుతుంది. ఆకుల రసం చర్మవ్యాధులకు, వేరుతో కషాయం ఉదర వ్యాధులకు, పండ్ల కషాయం జ్వర నివారణకు ఉపయోగిస్తారు.
పర్వల్‌ను క్రమం తప్పకుండా తింటే చర్మం నున్నగా అవుతుంది. మెరుపు వస్తుంది.
-గంగరాజు అరుణాదేవి