Dipti Tiwari Special School: అమ్మ మనసు పాఠం చెబుతోంది
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:53 AM
వైకల్యాల కారణంగా అవహేళనలు ఎదుర్కొన్న కుమారుడి కోసం డాక్టర్ వృత్తిని వదిలేసి టీచర్‌గా మారారు దీప్తి తివారీ.కాన్పూర్‌లో ఆమె ఏర్పాటు చేసిన స్పెషల్ స్కూల్... వైకల్యాలున్న కొన్ని వందలమంది పిల్లలను...
వైకల్యాల కారణంగా అవహేళనలు ఎదుర్కొన్న కుమారుడి కోసం డాక్టర్ వృత్తిని వదిలేసి టీచర్‌గా మారారు దీప్తి తివారీ.కాన్పూర్‌లో ఆమె ఏర్పాటు చేసిన స్పెషల్ స్కూల్... వైకల్యాలున్న కొన్ని వందలమంది పిల్లలను అక్కున చేర్చుకుంది. ఆ పిల్లలకు నైపుణ్యాలను, వారి తల్లితండ్రులకు ఊరటను అందిస్తోంది.
అది నాకు జీవితాంతం గుర్తుండిపోయే సంఘటన. మా అబ్బాయి భరత్‌ను ఆ రోజే కొత్త స్కూల్‌లో చేర్పించాం. అతణ్ణి తరగతి గదిలోకి పంపించి... నేను బయట బెంచీ మీద కూర్చున్నాను. కొద్ది సేపటికి భరత్ ఏడుపు వినిపించింది. క్లాస్‌లోకి తొంగి చూశాను. మిగిలిన పిల్లలు అతణ్ణి ఆట పట్టిస్తున్నారు. టీచర్ దాన్ని పట్టించుకోనట్టు ఉన్నారు. నేను వెళ్ళి ఆమెను అడిగాను. ‘ఈ స్కూల్ మీ అబ్బాయిలాంటి వాళ్ళ కోసం కాదు’ అన్నట్టు మాట్లాడారు. వెంటనే భరత్‌ను తీసుకొని బయటకి వచ్చేశాను. ఇలాంటి అనుభవాలు మాకు ఎన్నో ఎదురయ్యాయి.
తెల్లకోటు వదలేసి...
డాక్టర్ కావాలనేది నా చిన్ననాటి లక్ష్యం. దాన్ని నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. ఎంబీబీఎస్ పూర్తి చేశాను. వివాహం అయ్యాక... నా స్వస్థలమైన కాన్పూర్‌లోనే ప్రాక్టీస్ పెట్టాను. 1998లో భరత్ పుట్టాడు. కొన్ని నెలల తరువాత తనకు ఆరోగ్యపరమైన లోపాలు ఉన్నట్టు గ్రహించాను. వైద్య పరీక్షలు చేయించాక... భరత్‌కు శారీరకంగాను, మానసికంగాను వైకల్యాలు ఉన్నట్టు తేలింది. కాన్పూర్‌తో పాటు లఖ్‌నవూ, ఢిల్లీ, బెంగళూరు... ఇలా ఎన్నో నగరాలకు చికిత్స కోసం అతణ్ణి తీసుకువెళ్ళాను. కానీ భరత్ పరిస్థితిలో మెరుగుదల కనిపించలేదు. తను ఈ సమస్యతో జీవితాంతం బాధపడాల్సిందేనని తెలిశాక... ఎంతో వేదన అనుభవించాం. కానీ ధైర్యం మాత్రం కోల్పోలేదు. మాకు వీలైనంత వరకూ భరత్‌కు అన్నీ నేర్పించాలని అనుకున్నాం. అయితే బడిలో అడ్మిషన్ సంపాదించడం కష్టమయింది. మా అబ్బాయి మిగిలిన పిల్లల కన్నా భిన్నమైనవాడని మాకు తెలుసు. కానీ ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే తను అర్థం చేసుకోగలడు. భరత్‌ను ఎవరైనా వెక్కిరించినా, అల్లరి పెట్టినా తన బాధను, కోపాన్ని వ్యక్తం చెయ్యగలడు. మామూలు స్కూళ్ళ వాతావరణంలో తను ఇమడలేడని గ్రహించాం. భరత్ లాంటి ఎందరో పిల్లల తల్లితండ్రులు కూడా నాకు పరిచయం అయ్యారు. వారి ఆవేదనను కూడా గమనించిన తరువాత... శారీరక, మానసిక వైకల్యాలు, ఆటిజం సమస్య ఉన్న పిల్లల కోసం నేనే ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. 2007లో ‘సంకల్ప్ స్పెషల్ స్కూల్’ స్థాపనతో తొలి అడుగు వేశాను. దానికోసం నేనే టీచర్‌గా మారాను. తెల్ల కోటు వదిలేసి... బ్లాక్ బోర్డు మీద పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను.
చదువుతో పాటు నైపుణ్యాలు కూడా...
పిల్లలు సంతోషంగా ఉండడం, ఒత్తిడి లేకుండా తమకు వీలైనవి నేర్చుకోవడం, తోటి పిల్లలతో కలిసి ఆటపాటలతో గడపడం... ఇదీ ఈ పాఠశాల ఏర్పాటు వెనుక ప్రధానమైన ఆశయం. గత 18 ఏళ్ళలో కొన్ని వందలమంది పిల్లలు మా పాఠశాలలో చేరి, వివిధ నైపుణ్యాలు నేర్చుకున్నారు. ప్రస్తుతం అయిదు నుంచి ఇరవై ఎనిమిదేళ్ళ మధ్య వయసున్న వారు మా బడిలో చదువుతున్నారు. నిర్దిష్టమైన ఫీజులేవీ ఇక్కడ లేవు. ఎవరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వొచ్చు. అది కూడా చెల్లించలేనివారికి అంతా ఉచితంగానే అందిస్తున్నాం. చదవడం, రాయడంతోపాటు హస్త కళలు, ఆట పాటలు, వివిధ నైపుణ్యాలను మా విద్యార్థులు నేర్చుకుంటున్నారు.
నాటికలు, ఏకపాత్రాభినయాలు కూడా వివిధ వేదికల మీద ప్రదర్శించి ప్రశంసలందుకుంటున్నారు. ఇంతకుముందు మా అబ్బాయి ఎక్కువ సమయం నాతో గడిపేవాడు. ఇప్పుడు తనకు ఎంతోమంది స్నేహితులు. నా మీద తను ఆధారపడడం తగ్గించుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. అలాగే మా బడి పిల్లల తల్లితండ్రుల్లో సంతోషాన్ని చూస్తున్నప్పుడు ఎంతో సంతృప్తి కలుగుతోంది.’’
ఇవి కూడా చదవండి
మామ, అల్లుడి గొడవ.. ఆపడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దారుణం..
ఈ ఒక్క జ్యూస్‌తో గుండె జబ్బులన్నీ మాయం..