Dr Rani Maria Thomas: మూగజీవాలకు రక్ష
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:08 AM
మంచి ర్యాంకుతో మెడిసిన్‌లో సీటు వస్తే ఎవరైనా వెటర్నరీ వైపు చూస్తారా కానీ డాక్టర్ రాణి మరియా థామస్ కోరి మరీ ఆ కోర్సునే ఎంచుకున్నారు. మూగ జీవాలకు తన జీవితాన్ని అంకితం చేశారు....
మంచి ర్యాంకుతో మెడిసిన్‌లో సీటు వస్తే ‘ఎవరైనా వెటర్నరీ వైపు చూస్తారా? కానీ డాక్టర్ రాణి మరియా థామస్ కోరి మరీ ఆ కోర్సునే ఎంచుకున్నారు. మూగ జీవాలకు తన జీవితాన్ని అంకితం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించేలా వాటి కోసం ఐసీయూ సైతం ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నా... సొంత ఊళ్లోనే హాస్పిటల్ నెలకొల్పి... మన చుట్టూ ఉండే జీవజాతులను రక్షిస్తున్నారు.
‘‘మూగ జీవాల కోసం ప్రత్యేక ఐసీయూ ఏర్పాటు చేస్తున్నానని చెప్పినప్పుడు అందరూ వింతగా చూశారు. ‘వాటి కోసం అంత అవసరమా?’ అనేది వాళ్ల ఆలోచన. కానీ నాకు మాత్రం అవి కేవలం జంతువులు, పక్షులు మాత్రమే కాదు... నా తోడబుట్టినవారిలా భావిస్తాను. అవే నా ప్రపంచం. కేరళ రాష్ట్రం అలప్పుళ మా స్వస్థలం. చిన్నప్పటి నుంచి నాకు జంతు ప్రేమ ఎక్కువ. మా ఇంట్లో మకావూ ఉండేది. ఎంతో ఇష్టంగా, మా కుటుంబ సభ్యురాలిగా దాన్ని చూసుకొనేవాళ్లం. ఒకరోజు దానికి అస్వస్థత చేసింది. దగ్గర్లోని వెటర్నరీ ఆసుపత్రులకు వెళ్లాను. కానీ ఇలాంటి అరుదైన పక్షులకు సంబంధించి సరైన ఆసుపత్రులు అందుబాటులో లేవని అప్పుడే అర్థమైంది. సాధ్యమైన అన్ని దారుల్లోనూ ప్రయత్నించా. అయినా పెద్దగా ఫలితం కనిపించలేదు. దాన్ని ఎలా బతికించుకోవాలంటే ఇంకా ఏంచేయాలి? ఎక్కడకు వెళ్లాలి? నాకు ఏ మాత్రం అవగాహన లేదు. చివరకు మృత్యువుతో పోరాడిన మకావూ మా కళ్లముందే ఊపిరి వదిలింది. అది మా కుటుంబాన్ని, ముఖ్యంగా నన్ను తీవ్రంగా కలచివేసింది. అంతులేని బాధను మిగిల్చింది. ఆ క్షణమే ఒక నిర్ణయానికి వచ్చాను... ఈ పరిస్థితిలో మార్పు తేవాలని.
మంచి ర్యాంకు వచ్చినా...
ప్రపంచం ఆధునికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా జంతువుల వైద్యానికి సంబంధించి ఆ స్థాయిలో సేవలు మనకు అందుబాటులో లేవు. ఇదే నన్ను ఆలోచనలో పడేసింది. అందుకే మెడిసిన్‌లో మంచి ర్యాంకు వచ్చినా నేను అందరిలా కాకుండా వెటర్నరీనే కోరుకున్నా. అందుకు మా నాన్న కూడా మద్దతుగా నిలిచారు. ఎందుకంటే అవసరానికి సరిపడా పశువైద్యులు లేరనేది ఆయనకు కూడా అనుభవమే.. పశువైద్యం చదవాలని అనుకున్నప్పుడు... నా భవిష్యత్తు ఏమైపోతుందోనని నాన్న ఆందోళన చెందలేదు. అది నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. విశేషం ఏమిటంటే... నేను చదివిన కాలేజీలో ఈ కోర్సు తీసుకున్నదీ, లైబ్రరీ నుంచి ఆ పుస్తకాలు తెచ్చుకున్నదీ నేనొక్కదాన్నే.
వైద్యం... ఆవాసం
నేడు మా హాస్పిటల్ ఎన్నో మూగ జీవాలకు వైద్యం అందించింది. అత్యవసర సమయాల్లో మెరుగైన చికిత్సలు చేసి, ప్రాణం పోసింది. ముఖ్యంగా అరుదైన పక్షి జాతులకు నేను వైద్యం చేస్తాను. మా పట్టణంలోనే కాదు, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచీ మా పశువైద్యశాలకు వస్తారు. వైద్యం ఒక్కటే కాకుండా... ఎన్నో మూగ జీవాలకు మా కేంద్రం చక్కని ఆవాసం కూడా. ప్రస్తుతం దాదాపు వంద కుక్కలు, పిల్లులు, మకావూ తదితర పక్షులు పెరుగుతున్నాయి.
అదే నా జీవితం
ఎప్పుడైతే ఈ వృత్తిని ఎంచుకున్నానో నాటినుంచీ నా జీవితం జంతువులు, పక్షులతోనే మమేకమైంది. వాటితో కలిసి జీవిస్తున్నాను. అందుకే అవి నాకు తోబుట్టువులు లాంటివని చెప్పాను. అవే నా ప్రపంచం కూడా. వివిధ దేశాల నుంచి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు ఇస్తాం, రమ్మని ఆహ్వానిస్తున్నారు. నిజమే... అక్కడకు వెళితే దేనికీ లోటు లేకుండా, నా తరువాత రెండు మూడు తరాలకు సరిపడా సంపాదించుకోవచ్చు. ఆనందంగా జీవించవచ్చు. కానీ నా ఆలోచనలు వేరు. నా లక్ష్యం వేరు. నా దృఢ సంకల్పం ఏమిటంటే... భారత్‌లో పశు వైద్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలి. ఊపిరి ఉన్నంతవరకు ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి పాటుపడాలి. మరింతమంది పశువైద్యులు తయారయ్యేలా యువతరంలో స్ఫూర్తి నింపాలి. అంతిమంగా మూగజీవాలకు అత్యుత్తమమైన చికిత్స అందాలి. అప్పటివరకు విశ్రమించేది లేదు.’’
అబుదాబి వెళ్లి...
వెటర్నరీ మెడిసిన్ పూర్తవగానే హడావుడిగా ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు. అందులో మరింత లోతుగా అధ్యయనం చేయాలనే ఉద్దేశంతో అబుదాబి వెళ్లాను. అక్కడి ఫాల్కన్ హాస్పిటల్‌లో శిక్షణ తీసుకున్నాను. అరుదైన పక్షులకు అక్కడ అంతర్జాతీయ స్థాయి వైద్యం అందుతుంది. ఆ స్థాయి వైద్యాన్ని భారత్‌కు తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో తిరిగి వచ్చాను. రాగానే మా పట్టణంలో రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఆధునిక హంగులతో ‘సారాస్ బర్డ్స్ అండ్ ఎగ్జాటిక్ యానిమల్ హాస్పిటల్’ ప్రారంభించాను. అంతేకాదు... ఎక్కడా లేని విధంగా ఐసీయూ ఏర్పాటు చేశాను. ఎండోస్కోపీ, ఎక్స్‌రేతో పాటు గ్రూమింగ్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చాను.