Share News

Deepika Inspiring Journey: విజయ దీపిక

ABN , Publish Date - Nov 29 , 2025 | 03:00 AM

ఆకలి బాధలు తట్టుకుంది. అవమానాలను భరించింది. అంధురాలనే వెక్కిరింతలు.. హేళనలకు భయపడి ఆగిపోకుండా ముందడుగు వేసింది. కష్టాలను అధిగమించి...

Deepika Inspiring Journey: విజయ దీపిక

ఆకలి బాధలు తట్టుకుంది. అవమానాలను భరించింది. అంధురాలనే వెక్కిరింతలు.. హేళనలకు భయపడి ఆగిపోకుండా ముందడుగు వేసింది. కష్టాలను అధిగమించి, కన్నీళ్లను దిగమింగి తనకు ఆసక్తి ఉన్న క్రికెట్‌ను కెరీర్‌గా మార్చుకుంది. ‘అంధురాలివి నీకెందుకు ఆటలు ఒక మూలన కూర్చోక’ అని వెక్కిరించిన వాళ్లకు తానేంటో నిరూపించింది. దేశానికి తొలి మహిళల అంధుల వరల్డ్‌కప్‌ను అందించి సామాన్యుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరకు అందరి ప్రసంశలను అందుకుంటున్న భారత జట్టు కెప్టెన్‌, రాయలసీమ అమ్మాయి దీపిక ‘నవ్య’తో పంచుకున్న విశేషాలు.

‘‘మాది సత్యసాయు జిల్లా, మడకశిరలోని తంబలహట్టి అనే చిన్న గ్రామం. అమ్మ చిట్టమ్మ, నాన్న తిమ్మప్ప వ్యవసాయ కూలీలు. ముగ్గురు సంతానంలో నేను పెద్దమ్మాయిని. నాకు ఇద్దరు తమ్ముళ్లు. మాకు రెండెకరాల భూమి ఉంది కానీ, నీళ్ల సదుపాయం లేకపోవడంతో సాగు చేసే అవకాశం లేక అమ్మనాన్న కూలీలుగా మారారు. నాకు ఐదు నెలలప్పుడు కంటిలో నా చేతి వేలితో పొడుచుకోవడంతో బొబ్బ వచ్చింది. అది తగ్గకపోవడంతో నాన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చూసి ఇప్పుడు సర్జరీ చేయడం కుదరదు. పదేళ్లు నిండాక శస్త్రచికిత్స చేద్దామని చెప్పారు. నా వయసుతో పాటు కుడి కంటిలో ఆ బొబ్బ కూడా పెరిగి చూపు పోయింది.

బడిలో కలవనిచ్చేవారు కాదు..

బడిలో నన్ను అందరితో పాటు కలవనిచ్చేవారు కాదు. ఆటలు ఆడనిచ్చే వారు కాదు. ‘‘గుడ్డిదానివి. పోయి ఒక పక్కన కూర్చో’’ అనేవారు. ఇంటికి వచ్చి అమ్మకు చెప్పేదాన్ని. ‘‘బాధపడకు. బాగా చదువుకో. దేవుడే నీకు దారి చూపిస్తాడు’’ అని అమ్మ ఓదార్చేది, ధైర్యం చెప్పేది. మా పొలంలో బోర్లు వేసేందుకు, కూలీ పనులు లేకపోవడంతో కుటుంబాన్ని పోషించేందుకు నాన్న అప్పులు చేశారు. అవి తిరిగి చెల్లించలేకపోవడంతో అప్పు ఇచ్చిన వారు మా ఇంటిపైకి వచ్చి గొడవ చేసేవారు. వారి మాటలు భరించలేక నాన్న పక్క ఊరిలో పగలంతా పని చేసేవారు. రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వచ్చి, మాకు తినడానికి రాగులు, బియ్యం ఇచ్చేవారు. మళ్లీ ఆ చీకట్లోనే వెళ్లిపోయే వారు. నాన్న ఇంటికి రాని రోజు మేము పస్తులు ఉండాల్సి వచ్చేది. మా ఊర్లో పండ్ల చెట్లు వెతుక్కొనే వాళ్లం. ఆకలి భరించలేక సగం కుళ్లిన పండ్లు కూడా తినేవాళ్లం. అన్నం వండిన రోజు కూడా సరిపోక నేను, తమ్ముడు కొట్టుకొనేవాళ్లం. సరైన దుస్తులు లేక చిరిగినవి, పాడైనవి వేసుకొనేవాళ్లం. పదేళ్లు నిండాక నాకు ఆపరేషన్‌ చేయించేందుకు నాన్న రూ.2 లక్షలు అప్పు చేశారు. వైద్యులు సర్జరీ చేసినా చూపు వస్తుందని హామీ ఇవ్వలేమన్నారు. అప్పుడు ‘‘ఆపరేషన్‌ చేయించి డబ్బులు వృధా చేయొద్దు నాన్నా... నాకు ఇలా బతకడం అలవాటు అయిపోయింది’’ చెప్పా. ఆ మాటలకు నాన్న గుండెలు పగిలేలా రోధించారు. అంత దయనీయమైన జీవితం గడిపిన నాకు క్రికెట్‌ కొత్త బతుకును ఇచ్చింది.


క్రికెట్‌ మలుపు తిప్పింది..

కర్ణాటకలోని తుమ్ముకూర్‌లో ఉన్న శివకుమార్‌ స్వామిజీ స్కూల్‌లో అంధులకు ఉచితంగా చదువు చెబుతారని తెలిసి.. అమ్మా నాన్నా నన్ను అక్కడ చేర్పించారు. స్కూల్‌లో మంచి భోజనం పెట్టి, బాగా చూసుకొనే వారు. అయితే, అన్నం తింటున్నప్పుడల్లా తమ్ముళ్లు ఏం తింటున్నారోనని గుర్తొచ్చి బాగా ఏడ్చేదాన్ని.. స్కూల్‌లో టీచర్ల ప్రోత్సాహంతో పదో తరగతి నుంచి క్రికెట్‌ ఆడడం ప్రారంభించా. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌కు అంఽధ మహిళల జట్టు ఉండేది కాదు. దాంతో కర్ణాటక జట్టు తరఫున ఆడడం ప్రారంభించా. 2019లో జాతీయ అంధుల క్రికెట్‌ బోర్డు ఏర్పడిన తర్వాత మాకు ఆడేందుకు ఒక వేదిక దొరికింది. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటడంతో 2023లో జాతీయ జట్టులో స్థానం లభించింది. అదే ఏడాది బర్మింగ్‌హామ్‌లో జరిగిన అంధుల వరల్డ్‌ గేమ్స్‌లో క్రికెట్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో నేను సభ్యురాలిని. సమర్ధానం ట్రస్టు వారి డిగ్రీ కళాశాలలో పరిచయమైన సీనియర్‌ అన్న మోహన్‌ నన్ను బాగా ప్రోత్సహించారు. రెండేళ్లు తిరిగేసరికి నా ప్రతిభను గుర్తించి టీమిండియాకు కెప్టెన్‌ చేశారు. నా సారథ్యంలో భారత జట్టుకు తొలి మహిళల టీ-20 వరల్డ్‌కప్‌ అందించడం చాలా గర్వంగా ఉంది. ఒక మారుమూల గ్రామంలో మొదలైన నా ప్రయాణం, ఈ స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉంది.

ప్రభుత్వం చేయూత ఇవ్వాలి..

నేను ప్రస్తుతం ముంబైలో ఇన్‌కమ్‌టాక్స్‌ విభాగంలో రూ.25 వేలకు ఉద్యోగం చేస్తున్నా. నా ఖర్చులకు కూడా ఆ డబ్బు సరిపోవడం లేదు. ఇప్పటికీ మా కుటుంబం కోసం చేసిన అప్పులను నాన్న తీరుస్తూనే ఉన్నారు. ఇన్ని కష్టాల్లో కూడా క్రికెట్‌ పైన ఉన్న మక్కువ, దేశంపై ఉన్న ప్రేమతో కష్టాలను దిగమింగి వరల్డ్‌కప్‌ సాధించా. నాలాంటి అంధ క్రికెటర్లను ప్రభుత్వాలు, కార్పొరేట్‌ సంస్థలు ప్రోత్సహిస్తే మాకు జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల మరింత పెరుగుతుంది.’’

-ఎస్‌.ఎస్‌..బి.సంజయ్‌


ప్రధాని తండ్రిలా మాట్లాడారు

ప్రధాని నరేంద్ర మోదీతో గత గురువారం జరిగిన 45 నిమిషాల ఇష్టాగోష్ఠిలో ఆయన ఒక కుటుంబ పెద్దలా, తండ్రిలా మాట్లాడారు. మా వ్యక్తిగత నేపధ్యాలను, జీవిత విశేషాలను అడిగి తెలుసుకున్నారు. నేను పాటలు బాగా పాడతానని తెలిసి, నన్ను పాడమని అడిగారు. నేను శివుడి భక్తి గీతం ఒకటి పాడి వినిపిస్తే. బాగా పాడావని అభినందించారు. వరల్డ్‌కప్‌లో ఎదురైన సవాళ్ల గురించి, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మా ఆట గురించి అడిగి తెలుసుకున్నారు. మా అందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

3.jpg

Updated Date - Nov 29 , 2025 | 03:00 AM