Cricket: క్రికెట్ గేమ్‌లో అమ్మాయిలకే భవిష్యత్తు
ABN , Publish Date - Jun 02 , 2025 | 05:03 AM
రియల్ క్రికెట్ అనే మొబైల్ గేమ్‌ను ఆరుగురితో ప్రారంభించి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల డౌన్‌లోడ్స్ సాధించటంతో ఇది విజయవంతమైన గేమింగ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. గేమింగ్ పరిశ్రమలో మహిళల పాత్రను ప్రోత్సహిస్తూ, క్రికెట్‌ను ఆడుతున్న అమ్మాయిల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుండటం విశేషం.
మన వాళ్లకు క్రికెట్ అంటే పిచ్చి. గ్రౌండ్‌లో అయినా మొబైల్‌లో అయినా.. ‘‘ఈ మధ్యకాలంలో
అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా క్రికెట్ గేమ్ ఆడటం బాగా పెరిగింది..’’ అంటారు ‘రియల్
క్రికెట్’ అనే మొబైల్ గేమ్‌ను అభివృద్ధి చేసిన టీమ్‌లో ఒకరైన అంజూ మన్‌కర్. ఆమెను నవ్య
పలకరించినప్పుడు ఈ గేమ్‌కు సంబంధించిన అనేక విశేషాలు వెల్లడించారు.
‘‘క్రికెట్ చాలా మందికి జీవితాల్లో ఒక భాగం. వీరిలో ఎక్కువ మంది గ్రౌండ్స్‌కు వెళ్లి ఆడలేరు. దీనితో మానిటర్స్ ముందు.. మొబైల్స్‌లోను ఆడుతూ ఉంటారు. గతంలో ఈ గేమ్స్‌కు కొన్ని పరిమితులు ఉండేవి. మాకు 2013లో ఒక మంచి క్వాలిటీ ఉన్న క్రికెట్ గేమ్‌ను తయారుచేయాలనే ఆలోచన కలిగింది. ఫుట్‌బాల్‌లో మనకు మంచి మంచి మొబైల్ గేమ్స్ ఉన్నాయి. అలాంటిది మనం కూడా తయారుచేస్తే- ప్రపంచమంతా దానిని ఆడతారు అనే ఆలోచనతో రియల్ క్రికెట్‌ను అభివృద్ధి చేయటం ప్రారంభించాం. అప్పుడు మా టీమ్ కేవలం ఆరుగురు మాత్రమే! మేము దీనిని అభివృద్ధి చేసిన తర్వాత 2020లో జాక్‌సన్ డైస్ అనే కంపెనీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలోనే క్రాఫ్టన్ అనే కంపెనీ కూడా భాగస్వామిగా చేరింది. క్రాఫ్టన్ మాతో చేరటం వల్ల అంతర్జాతీయంగా ఈ గేమ్‌కు మరింత ఆదరణ లభిస్తుందని భావిస్తున్నా. మొదట్లో ఈ గేమ్‌ను తయారుచేసినప్పుడు కొన్ని లక్షల మంది మాత్రమే డౌన్‌లోడ్ చేసేకొనేవారు. ఇప్పుడు ఈ సంఖ్య 50 కోట్లకు చేరింది.
చాలా కష్టం..
గేమింగ్ అంటే చాలా మంది సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తే చాలు అనుకుంటారు. గేమింగ్‌లో సాఫ్ట్‌వేర్ ఎంత ప్రధానమో.. కళాత్మకంగా ఉండటం కూడా అంతే ప్రధానం. క్రికెట్‌లాంటి గేమ్‌ను అభివద్ధి చేయటం ఒక కోణం నుంచి చూస్తే పెద్ద సవాల్ అనే చెప్పాలి. మరో కోణం నుంచి చూస్తే కొంత సులువు అనే చెప్పాలి. ఈ కారణాలు నేను వివరిస్తాను. షూటింగ్‌లాంటి గేమ్‌ను తయారుచేస్తున్నామనుకుందాం. చాలా మందికి షూటింగ్‌లో రూల్స్ తెలియవు. అందువల్ల వారికి ఆ రూల్స్ సులభంగా అర్ధమయ్యేలా గేమ్‌ను తయారుచేయాలి. ఇది ఒక పెద్ద సవాల్. క్రికెట్ లాంటి గేమ్‌లో రూల్స్ అందరికీ తెలుసు. అందువల్ల ఈ రూల్స్‌ను ఆడేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండదు. అయితే ఈ గేమ్ వాస్తవిక ప్రపంచానికి దగ్గరగా ఉండాలి. భావోద్వేగాలు ఉండాలి. ఆడేవ్యక్తికి నిజంగా గ్రౌండ్‌లో ఉన్నంత భావన కలగాలి. ప్రతి రోజు గ్రౌండ్‌లో ఆడినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో.. వాటన్నింటినీ బేరీజు వేసుకుంటూ ఈ గేమ్‌ను అభివృద్ధి చేయాలి. ఒక రోజులో రెండు గంటలు ఈ గేమ్ ఆడినా బోరు కొట్టకూడదు. లేకపోతే గేమర్స్ దీనిని ఆదరించరు. అందువల్ల మేము ఈ గేమ్‌ను తయారుచేసేటప్పుడు చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి పెట్టాం. లేకపోతే గేమర్స్ దీనిని వదిలేసి ఇతర గేమ్స్‌లోకి వెళ్లిపోతారు.
గేమింగ్‌లో తక్కువే..
గేమింగ్ అనేది ఒక ప్రత్యేకమైన క్రీడ. ఈ గేమ్స్‌ను తయారుచేసే కంపెనీలు కూడా ప్రత్యేకమైనవే! అయితే మహిళా గేమింగ్ డెవలపర్స్ ప్రస్తుతం తక్కువనే చెప్పాలి. ఒక కంపెనీలో 10 మంది మగ డెవలపర్స్ ఉంటే.. అమ్మాయిలు ఇద్దరు మాత్రమే ఉంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ఒకటి- గేమింగ్‌ను ఒక సీరియస్ ఐటీ పరిశ్రమగా భావించకపోవటం. ప్రతి ఏడాది కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న పరిశ్రమ ఇది. కానీ దీనిని ఐటీలో భాగంగా భావించరు. ఈ ధోరణిలో మార్పు వస్తే ఎక్కువ మంది అమ్మాయిలు గేమింగ్ అభివృద్ధిలో పాలుపంచుకుంటారు. ఇక చిన్నప్పటి నుంచి అమ్మాయిలు కళల వైపు వెళ్లాలని.. అబ్బాయిలు ప్లే స్టేషన్స్ వంటివి ఆడాలనే భావన తల్లితండ్రుల్లో ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ విభజన చెరిగిపోతోంది. అమ్మాయిలు కూడా ప్లేస్టేషన్ల వంటివి ఆడుతున్నారు. ఇంకో పదేళ్లలో ఈ విభజన పూర్తిగా చెరిగిపోతుంది. ఆ సమయానికి గేమింగ్‌కు ఐటీ పరిశ్రమలో ఒక సముచిత స్థానం లభిస్తుంది. అప్పుడు క్రికెట్ గేమ్‌లో అమ్మాయిలకే భవిష్యత్తు ఉందని చెప్పాలి.
అమ్మాయిలు కూడా..
ఒకప్పుడు క్రికెట్ కేవలం పురుషుల ఆట మాత్రమే. భారత ఉపఖండంలో ఇప్పటికీ ఎక్కువ మంది అబ్బాయిలే ఈ గేమ్‌ను ఆడతారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ గేమ్‌ను ఆడుతున్న అమ్మాయిల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఉదాహరణకు ప్రతి రోజూ మా గేమ్‌ను 20 లక్షల మంది ఆన్‌లైన్‌లో ఆడుతూ ఉంటారు. వీరిలో 11 శాతం అమ్మాయిలు ఉంటారు. మా దగ్గర ఉన్న గణాంకాల ఆధారంగా చూస్తే వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. భవిష్యత్‌లో మరింతగా పెరుగుతుంది. మేము అమ్మాయిల టీమ్‌లతో ప్రత్యేకమైన గేమ్‌ను తయారుచేయాలనుకుంటున్నాం. ఇక ఏ ప్రాంతంలో ఎక్కువగా క్రికెట్ గేమ్‌ను ఆడతారు అనే విషయాన్ని గమనిస్తే- మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు.. హైదరాబాద్ అని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి మా గేమ్‌ను ఎక్కువగా ఆడతారు.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి