Share News

Varalakshmi Vratham: అందంగా ఇస్తినమ్మ వాయినం...

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:01 AM

వరలక్ష్మీ వ్రతం చేసుకున్న తరవాత బంధుమిత్రులను, ఇరుగు-పొరుగు మహిళలను పిలిచి వాయినాలు ఇస్తూ ఉంటాం.

Varalakshmi Vratham: అందంగా ఇస్తినమ్మ వాయినం...

వరలక్ష్మీ వ్రతం చేసుకున్న తరవాత బంధుమిత్రులను, ఇరుగు-పొరుగు మహిళలను పిలిచి వాయినాలు ఇస్తూ ఉంటాం. తాంబూలం లేదా పసుపు-బొట్టు అని పిలిచే ఈ వాయినంలో పసుపు కొమ్ములు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, పూలు, పండ్లు, గాజులు, చీర లేదా రవికెల గుడ్డ, నానబెట్టిన శనగలు, జాజికాయ, రూపాయి బిళ్ల, చెక్క దువ్వెన, చిన్న అద్దం, కాటుక భరిణె, గోరింటాకు, కొబ్బరికాయ, పసుపు తాడు తదితరాలు ఉంటాయి. ఇలా వాయినంతోపాటు చిన్న బహుమతిని కూడా ఇస్తూ మురిసిపోతుంటారు మహిళలు. అలా ఇవ్వదగ్గ బహుమతుల గురించి తెలుసుకుందాం...

  • ప్రస్తుతం రకరకాల పోట్లీ బ్యాగ్‌లు లభ్యమవుతున్నాయి. ఇవి చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి కూడా. వీటి ధర అంత ఎక్కువగా ఉండదు. ఈ పోట్లీ బ్యాగ్‌లను తీసుకువచ్చి వాటిలో వాయినాన్ని అందంగా సర్ది ఇవ్వవచ్చు. కాటన్‌ వస్త్రంతో తయారుచేసిన చిన్న చిన్న బ్యాగ్‌లు, పర్సులు కూడా విరివిగానే దొరుకుతున్నాయి. వీటిమీద చక్కని పెయింటింగ్‌, ఎంబ్రాయిడరీ, అద్దాలు లేదా పూసల వర్క్‌లు చేసి ఉంటున్నాయి. వీటిని కూడా గిఫ్ట్‌ కింద ఇవ్వవచ్చు. ఇవి మహిళలకు పలువిధాలుగా ఉపయోగపడతాయి.

  • మట్టి, ఇత్తడి, పంచలోహాలతో రూపొందించిన చిన్న లక్ష్మీదేవి బొమ్మను ఇవ్వవచ్చు. అలాగే దీపం కుందులు, పసుపు-కుంకుమ గిన్నెల స్టాండ్‌, అగరుబత్తులు గుచ్చే స్టాండ్‌, కర్పూరం వెలిగించే పళ్లెం, రాగి చెంబు ఇచ్చినా ఉపయోగకరంగానే ఉంటాయి. పూలు, లతలు, నెమళ్లతో తెల్లగా మెరిసే హారతి పళ్లెం, సింహాసనం, పూల సజ్జ లాంటి వాటిని కూడా మహిళలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీటిని వైట్‌ మెటల్‌తో తయారు చేస్తారు కాబట్టి ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి.

  • చక్కని జరీ బోర్డర్‌ ఉన్న జాకెట్‌ గుడ్డను బ్యాగ్‌లా మడత పెట్టి అందులో వాయినాన్ని సర్ది ఇవ్వడం నేటి ట్రెండ్‌.

  • చెక్క, ఇత్తడి లేదా వైట్‌ మెటల్‌తో రూపొందించిన ట్రే లేదా తాంబాళంలో వాయినాన్ని సర్ది ఇవ్వవచ్చు. తామర పువ్వు ఆకారంలో ఉండే వెడల్పాటి గిన్నెను ఇచ్చినా బాగుంటుంది.

  • వరలక్ష్మి వ్రత కథలు, మణిద్వీప వర్ణన, లలిత సహస్రనామాలు, లక్ష్మీదేవి స్తోత్రాలు లాంటి వాటిని పెద్ద అక్షరాలతో ప్రింట్‌ చేసిన పుస్తకాలు ఇస్తే పెద్దవారికి ఉపయోగకరంగా ఉంటుంది.

Updated Date - Aug 06 , 2025 | 01:01 AM