Fatima Bash: అందం... ఆత్మవిశ్వాసానికి అందలం
ABN , Publish Date - Nov 22 , 2025 | 03:46 AM
మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకోకముందే 25 ఏళ్ళ ఫాతిమా బాష్ పేరు చాలామందికి పరిచయమైపోయింది. వాస్తవానికి... ఈ పోటీలో పాల్గొన్న దాదాపు 120 దేశాల సుందరీమణుల్లో ఒకరుగా మాత్రమే అప్పటివరకూ కొందరికైనా ఆమె పేరు తెలుసు. పోటీలకు కొద్దిరోజుల ముందు..
‘మిస్ యూనివర్స్-2025’ కిరీటాన్ని గెలుచుకోకముందే 25 ఏళ్ళ ఫాతిమా బాష్ పేరు చాలామందికి పరిచయమైపోయింది. వాస్తవానికి... ఈ పోటీలో పాల్గొన్న దాదాపు 120 దేశాల సుందరీమణుల్లో ఒకరుగా మాత్రమే అప్పటివరకూ కొందరికైనా ఆమె పేరు తెలుసు. పోటీలకు కొద్దిరోజుల ముందు... మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మిస్ యూనివర్స్ థాయిలాండ్ నేషనల్ డైరెక్టర్ నవాత్ ఆమె మీద విరుచుకుపడ్డారు. ‘తెలివితక్కువ మనిషి’గా ఆమెను అభివర్ణించారు. ఈ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న థాయిలాండ్‌ను సోషల్ మీడియాలో ఆమె ప్రమోట్ చేయకపోవడం దీనికి ప్రధాన కారణం కాగా... ఒక ఫొటోషూట్‌కు ఆమె హాజరు కాకపోవడం సాకుగా చూపి... ఫాతిమాను ఆయన నిందించారు. దీనికి ఫాతిమా దీటుగా సమాధానం ఇచ్చారు. నవాత్‌కు, ఆమెకు మధ్య తలెత్తిన ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవాత్ తీరుకు నిరసనగా ఫాతిమా, ఈ పోటీల్లో పాల్గొంటున్న మరికొందరు యువతులు సంబంధిత ఈవెంట్‌ను బహిష్కరించారు. చివరకు నవాత్, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఆమెకు క్షమాపణ చెప్పాయి. పోటీలో పాల్గొంటూ... దాని నిర్వాహక సంస్థను నిలదీసి, తన ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న ఫాతిమా సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు. ‘‘ఆ పోటీలో పాల్గొనకుండా, కిరీటం సాధించకుండా నన్నెవరూ ఆపలేరు’’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పిన ఆమె... అనుకున్నది సాధించారు. 74వ మిస్ యూనివర్స్ గా నిలిచారు. మన దేశం నుంచి రాజస్థాన్‌కు చెందిన మణికా విశ్వకర్మ టాప్-30లో స్థానం సంపాదించినా... టాప్-12కు చేరుకోలేక పోయారు.
అవహేళలను ఎదిరించి...
2000 మే 19న మెక్సికోలోని టాబాస్కో రాష్ట్రం టిపియాలో జన్మించిన ఫాతిమా బాల్యం మొత్తం పోరాటంగానే సాగింది. ఆరేళ్ళ వయసులో ఆమెకు హైపర్ యాక్టివిటీ, డిస్లెక్సియా లాంటి సమస్యలు ఉండేవి. సరిగ్గా మాట్లాడలేకపోవడంతో... తోటి పిల్లలు ఆమెను అవహేళన చేసేవారు. కానీ ఫాతిమాకు పట్టుదల ఎక్కువ. ఏ సమస్యా తన పురోగతిని నిరోధించకూడదనుకున్నారు. మానసిక దారుఢ్యాన్ని పెంచుకున్నారు. చదువులో, ఆటపాటల్లో ముందుండేవారు. విద్యార్థుల మార్పిడి కార్యక్రమం కింద... అమెరికాలోని లైన్డన్ ఇనిస్టిట్యూట్‌లో హైస్కూల్ విద్య అభ్యసించారు. అక్కడే ఆమె ఆంగ్లం బాగా నేర్చుకున్నారు. ఆ తరువాత ఫాతిమా దృష్టి సృజనాత్మకతవైపు మళ్ళింది. మెక్సికోలోనే ఫ్యాషన్ అండ్ అపెరల్ డిజైన్‌లో డిగ్రీ చేశారు. ఆ తరువాత ఇటలీలోని మిలన్‌లో ప్రతిష్టాత్మకమైన ఎన్‌ఎబిఎలో మాస్టర్స్ పూర్తి చేశారు. అందాల పోటీల్లో ఆమె విజయాలు... 2018లోలో ‘ఫ్లోర్ టబాస్కో’ టైటిల్ గెలుచుకోవడంతో మొదలయ్యాయి. దాన్ని సాధించడం తన చిన్ననాటి కల అని ఒక సందర్భంలో ఆమె చెప్పారు. ఆ తరువాత జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చినా... చదువుకే ప్రాధాన్యం ఇచ్చారు. మళ్ళీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ‘మిస్ యూనివర్స్-మెక్సికో’గా నిలిచారు. ఇప్పుడు ‘మిస్ యూనివర్స్’గా గెలిచారు. టొబాస్కోకు చెందిన ఒక మహిళ ఈ ఘనతను సాధించడం అదే మొదటిసారి.
సామాజిక సేవలో...
ఇష్టంగా నేర్చుకున్న ఫ్యాషన్ డిజైనింగ్‌నే ఫాతిమా వృత్తిగా చేసుకున్నారు. తను రూపొందించినవన్నీ పర్యావరణానికి అనుకూలంగా ఉండాలని ఆమె ఆశిస్తారు. సామాజిక సేవ పట్ల కూడా మక్కువ ఎక్కువే. తమ ప్రాంతంలోని ఒక ఆసుపత్రిలో క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు సాయపడడం కోసం పదేళ్ళుగా ఆమె పాటుపడుతున్నారు. టోబాస్కోలోని ఆంకాలజీ ఆసుపత్రిలో ... వార్షిక సెలవుల్లో పిల్లలకోసం కార్యక్రమాలను కూడా ఆమె నిర్వహిస్తూ ఉంటారు. ఫాతిమాకు జంతువులంటే ఇష్టం. గుర్రపుస్వారీ, పుస్తక పఠనం, చిత్రలేఖనం, టెన్నిస్... ఇలా అనేక అభిరుచులు ఉన్నాయి. ఆమె ప్రేమగా పెంచుకున్న కుక్కపిల్ల ఈ పోటీలకు కొద్దిరోజుల ముందే మరణించింది. దానికి నివాళిగా... పోటీ సమయంలో తన దుస్తులకు ఒక చిన్న పిన్నును ఫాతిమా ధరించారు. ‘‘ఆడపిల్లలు తమ కలలను సాకారం చేసుకోవడమే ధ్యేయంగా పాటుపడాలి. తమ సామర్థ్యం, విలువ పట్ల ఎప్పుడూ నమ్మకంతో ఉండాలి’’ అంటారామె. పోటీల్లో న్యాయవిజేతలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా... మహిళల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తానని చెప్పిన ఈ నవ విశ్వ సుందరి... ఇప్పటికే ఆ దారిలో పయనిస్తున్నారు.