Collector Pamela Satpathy: పాటతో మేలుకొలుపు
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:12 AM
ఓ చిన్న పిచ్చుక... చిన్నారి పిచ్చుక... రావమ్మా నీ ఇంటికి ఈ గీతం ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో మారుమోగుతోంది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆలపించిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారులు, మహిళల కోసం ఈ గీతానికి రూపకల్పన చేసిన పమేలా చేపడుతున్న పలు కార్యక్రమాలు సర్వత్రా ప్రశంసలు పొందుతున్నాయి....
‘ఓ చిన్న పిచ్చుక... చిన్నారి పిచ్చుక... రావమ్మా నీ ఇంటికి’- ఈ గీతం ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో మారుమోగుతోంది. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆలపించిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారులు, మహిళల కోసం ఈ గీతానికి రూపకల్పన చేసిన పమేలా చేపడుతున్న పలు కార్యక్రమాలు సర్వత్రా ప్రశంసలు పొందుతున్నాయి.
ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలోని సునాబెడాలో పమేలా సత్పతి పుట్టి పెరిగారు. ఆమె డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ ఆర్గనైజేషన్ అధికారి ఆర్.కె.సత్పతి కుమార్తె. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసి, ఇన్ఫోసి్‌సలో క్యాంపస్ ప్లేస్‌మెంట్ పొందిన పమేలా... ఆ తరువాత 2015లొ సివిల్స్ ద్వారా ఐఏఎ్‌సకు ఎంపికయ్యారు. భద్రాచలం సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. అక్కడ ఆమె 19 నెలలు పని చేశాక, భద్రాచలం ఈవోగా, అనంతరం భూసేకరణ విభాగంలో విధులు నిర్వర్తించారు. 2019 డిసెంబర్‌లో వరంగల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం యాదాద్రి-భువనగిరి కలెక్టర్‌గా ఉన్నారు. 2023లో కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె భర్త దీపాంకర్ వైద్య వృత్తిలో ఉన్నారు.
సమాజంలో అవగాహన కోసం...
‘సత్యమేవ జయతే’ హిందీ ధారావాహికలో స్వానంద్ కిర్కిరే అనే రచయిత రాసి, పాడిన ‘ఓరి చిరయ్య’ అనే పాట పమేలాను ఆకట్టుకుంది. దాన్ని తెలుగులోకి అనువదిస్తే సమాజంలో అవగాహన పెరుగుతుందని ఆమె భావించారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నంది శ్రీనివా్‌సకు తన ఆలోచనను తెలిపారు. ఆయన ‘ఓ చిన్ని పిచ్చుక... చిన్నారి పిచ్చుక’ అనే శీర్షికతో ఆ పాటను తెలుగులోకి అనువదించారు. బధిర విద్యార్థుల కోరిక మేరకు పమేలా ఆ పాటను స్వయంగా పాడి వీడియో, ఆడియో ఆల్బంను రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలికలు, అంధులు, దివ్యాంగులతో కలిసి సంతోష్, రాంబాబు అనే ఉద్యోగులు, శర్మ అనే ఉపాధ్యాయుడి సహకారంతో ఆ ఆల్బం రూపకల్పన జరిగింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో దాన్ని ఆవిష్కరించారు. సోషల్ మీడియాలో ఆ పాటకు విశేష ఆదరణ లభించింది. జిల్లా అంతటా ఆ గీతం మారుమోగుతోంది. భ్రూణ హత్యలను నిరసిస్తూ, బాలికా సంరక్షణ, మహిళా సాధికారతను చాటే ఈ పాట సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. .
మహిళలకు అండగా...
మహిళా సంక్షేమం, ఆరోగ్య సంరక్షణ, విద్యార్థులకు మెరుగైన బోధన కోసం కలెక్టర్ పమేలా పలు కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో... ఆమె ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘శుక్రవారం సభ’కు ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించే ఈ సభల్లో అంగన్‌వాడీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య ఆరోగ్యశాఖల సిబ్బంది, ఐసీడీఎస్, సఖీ సెంటర్, మహిళా శిశు సంక్షేమ, విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మహిళా ఆరోగ్య మేళా నిర్వహించి 50 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తారు. ముఖ్యంగా క్యాన్సర్ స్ర్కీనింగ్ నిర్వహించడంతో పాటు రక్తపోటు, మధుమేహం, రుతుస్రావం తదితర సమస్యలకు దారితీసే కారణాల గురించి, పౌష్టికాహారం ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేస్తారు. చికిత్సలు కూడా చేయిస్తారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మహిళల కోసం రూపొందించిన ‘పోక్సో’ చట్టంపై తదితర అంశాల గురించి వివరిస్తారు. మహిళలు ఎదుర్కొంటున్న కుటుంబ, సామాజిక సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి అధికారులు సూచనలు చేస్తారు. ప్రతి శుక్రవారం జిల్లాలో ఏదో ఒక చోట ఈ సభల్లో కలెక్టర్ పాల్గొని అధికారులు, ఉద్యోగులతోపాటు కింది స్థాయి సిబ్బంది, మహిళలు, బాలికల ఇబ్బందులు తెలుసుకుంటారు. మరోవైపు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఈవీ ఆటో వాహనాల డ్రైవింగ్‌లో పలువురు మహిళలకు శిక్షణ ఇప్పించి, ఆటోల కొనుగోలుకు రుణ సౌకర్యం కల్పించారు.
అందరికీ ఆదర్శం...
ఉన్నతాధికారులు తమకు తమ ఆరోగ్య సమస్యలకు కార్పొరేట్ ఆసుపత్రులకే వెళ్తారనేది సర్వత్రా ఉన్న భావన. కానీ కలెక్టర్ పమేలా... వైద్య పరీక్షల కోసం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికే వెళ్తారు. తనకు ముక్కులో ఇబ్బంది ఏర్పడినప్పుడు ప్రభుత్వాసుపత్రిలో చేరి, శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్య ఆరోగ్య శిబిరాల్లో కూడా పరీక్షలు చేయించుకుంటూ... ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగేలా చేస్తున్నారు. పిల్లలు, మహిళల ఆరోగ్యంపై గ్రామైక్య సంఘాల సభ్యులకు అవగాహన కలిగిస్తున్నారు. ఆమె సేవలకు ‘యూనిసెఫ్’ గుర్తింపు సైతం లభించింది. 2022లో భువనగిరి కలెక్టర్‌గా పనిచేసినప్పుడు తన రెండున్నర ఏళ్ల కుమారుడిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
-గజవాడ ఆంజనేయులు

విద్యార్థుల కోసం ‘బుధవారం బోధన’
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కఠినమైన పాఠ్యాంశాలు బోధించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రతి బుధవారం అన్ని పాఠశాలల్లో ‘బుధవారం బోధన’ కార్యక్రమాన్ని కలెక్టర్ పమేలా ప్రారంభించారు. దీనిలో భాగంగా... కఠినమైన పాఠాలను విద్యార్థులతో చదివించి, అవి చక్కగా అర్థమయ్యేలా ఉపాధ్యాయులు సూచనలు ఇస్తారు. ప్రతి విద్యార్థి చేతి రాతను మెరుగుపరచడానికి, కృషి చేస్తారు. పాఠశాలలను కలెక్టర్ సందర్శించినప్పుడు విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేస్తారు. విద్యార్థులతో కలిసి పాఠాలు వినడం, బోధకురాలిగా మారి పాఠాలు చెబుతారు. బాలికలకు రక్షణ కల్పించడానికి ‘స్నేహిత క్లబ్’లను ఏర్పాటు చేసి చట్టాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గత విద్యాసంవత్సరంలో 4,300 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా... ఈ ఏడాది ఆ సంఖ్య 7,600కు పెరిగింది.