Share News

ప్రతిదీ పాఠం చెబుతుంది!

ABN , Publish Date - Apr 11 , 2025 | 04:26 AM

ఒకప్పుడు చైనాలో అత్యంత ప్రాచుర్యం పొందిన గురువుల్లో లావోట్జూ ముఖ్యుడు. అతనికి ప్రధాన శిష్యుడు, చైనా తాత్త్వికుల్లో పేరుపొందినవాడు చువాంగ్‌ట్జూ. అతను ఎల్లప్పుడూ ఒక మానవ కపాలాన్ని (పుర్రెను) తన దగ్గరే...

ప్రతిదీ పాఠం చెబుతుంది!

సద్బోధ

ఒకప్పుడు చైనాలో అత్యంత ప్రాచుర్యం పొందిన గురువుల్లో లావోట్జూ ముఖ్యుడు. అతనికి ప్రధాన శిష్యుడు, చైనా తాత్త్వికుల్లో పేరుపొందినవాడు చువాంగ్‌ట్జూ. అతను ఎల్లప్పుడూ ఒక మానవ కపాలాన్ని (పుర్రెను) తన దగ్గరే ఉంచుకొనేవాడు. ఇది చాలాకాలం పాటు గమనించిన అతని శిష్యులు ‘‘గురువుగారూ! మీరు ఎప్పుడూ ఆ పుర్రెను మీ దగ్గరే పెట్టుకుంటారు. అది ఎందుకనేది మాకు అర్థం కావడం లేదు. దాన్ని చూసినప్పుడల్లా మాకు వెగటు కలుగుతోంది. దాన్ని మీతోనే ఎందుకు ఉంచుకుంటారు?’’ అని అడిగారు.

‘‘దాన్ని ఎప్పుడూ, నా ఎదురుగా ఉంచుకోవడానికి కారణం ఏమిటంటే... ఇప్పుడు మీరు నన్ను ఎలా గౌరవిస్తున్నారో... ఈ పుర్రె ఉన్న వ్యక్తిని ఒకనాడు కొందరు గౌరవించి ఉంటారు. కానీ ఇప్పుడేమయింది? దాన్ని చూస్తేనే మీకు వెగటు కలుగుతోంది. రేపు నా పుర్రె గతీ అంతేకదా! ఆ సంగతి నిరంతరం గుర్తుంచుకోవడానికే ఈ పుర్రెను ఎల్లప్పుడూ నా ముందు ఉంచుకుంటాను. ఇది ఒక రకంగా నన్ను మెళకువతో ఉంచే గురువు. దానికి నేను కృతజ్ఞుణ్ణి. నిజానికి అది ఒకప్పుడు నన్ను కాపాడింది. ఒక వ్యక్తి నా మీద విపరీతమైన కోపంతో... నా తలమీద పాదరక్షతో కొట్టడానికి వచ్చాడు. ఆ వ్యక్తి మాటలకు, చేతలకు నాకు విపరీతమైన కోపం వచ్చింది. నా సహనాన్ని కోల్పోయి ఏం చేసేవాణ్ణో? ఆ తరువాత ఎంత ఘోరమైన నరకాన్ని అనుభవించేవాణ్ణో? ఆ సమయంలో నా ఎదురుగా ఉన్న పుర్రె... ‘ఇప్పుడు నాకు పట్టిన గతే నీకు రేపోమాపో పడుతుంది. అటు పోయేవారు, ఇటు వచ్చేవారు నిన్ను కాలితో తంతారు. ఆ వ్యక్తి ఏదో తెలీక నీ మీద కోపగించాడు.


ఆ మాత్రం దానికే నువ్వు రెచ్చిపోతే ఎలా? రేపటి సంగతి ఆలోచించు’ అనే ఆలోచనను నాలో రెకేత్తించింది. అది నూరుపాళ్ళూ సత్యమే అని తెలుసుకొన్నాను. ‘‘సోదరా! ఇలారా! నీకు ఇష్టం వచ్చినంత సేపు నన్ను కొట్టు, తృప్తిగా తిరిగి వెళ్ళు’’ అని ఆ వ్యక్తిని ఆహ్వానించాను. అతను వెంటనే తన పాదరక్షలను దూరంగా విసిరేసి, నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి’’ అని వేడుకున్నాడు. నాకు ఆ గౌరవాన్ని, ఆ వ్యక్తిలో మార్పును తీసుకువచ్చింది ఈ పుర్రే కదా!’’ అన్నాడు చువాంగ్‌.

నేర్చుకోవడానికి సిద్ధపడితే రాయి, రప్ప, చెట్టు, గుట్ట... చివరకు పుర్రె కూడా మనకు విలువైన పాఠాలు నేర్పిస్తాయి, మనల్ని ఉద్ధరిస్తాయి. ఈ సంగతి చువాంగ్‌కు బాగా తెలుసు. కాబట్టే ఒక రోజు రాత్రి శ్మశానంలోంచీ వెళుతూ ఉండగా... చీకట్లో తన కాలికి తగిలిన పుర్రెకు క్షమాపణ చెప్పి, తన నివాసానికి దాన్ని తీసుకువచ్చాడు. దాన్ని గురువులా గౌరవించాడు.

రాచమడుగు శ్రీనివాసులు

ఇవి కూడా చదవండి..

Tahawwur Rana: తహవ్వుర్ రాణా అప్పగింత ప్రక్రియ మా హయాంలోనే మొదలైంది : చిదంబరం

Tahawwur Rana Extradition: తహవ్వుర్ రాణా కెనడా పౌరుడే.. పాక్ బుకాయింపు

Maoist Party: చర్చలపై ప్రకటన విడుదల..

Ramdev Baba: మరో కాంట్రవర్సీలో రాందేవ్ బాబా.. ఈసారి షర్బత్ జిహాద్

Updated Date - Apr 11 , 2025 | 04:26 AM