Share News

Martha and Mary: మార్త మరియ

ABN , Publish Date - Oct 17 , 2025 | 03:44 AM

ఏసు క్రీస్తు తన పన్నెండు మంది శిష్యులతో గ్రామగ్రామానికీ సంచరిస్తూ, ప్రజల్ని పలకరించి... వారికి బోధలు చేస్తున్న కాలం అది. వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు...

Martha and Mary: మార్త మరియ

ఏసు క్రీస్తు తన పన్నెండు మంది శిష్యులతో గ్రామగ్రామానికీ సంచరిస్తూ, ప్రజల్ని పలకరించి... వారికి బోధలు చేస్తున్న కాలం అది. వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు... తమతో పాటు ఏదీ తీసుకువెళ్ళేవారు కాదు. కట్టుబట్టలతోనే పర్యటించేవారు. కనీసం ఒక జోలె కూడా ఉండేది కాదు. ఎవరైనా ఆహ్వానిస్తే తప్ప ఏ ఇంట్లోనూ అడుగుపెట్టేవారు కాదు. ఎవరినీ ఏదీ అడిగేవారు కాదు.

ఒకసారి ఏసు శిష్యసమేతంగా ఓ కుగ్రామంలో అడుగు పెట్టాడు. ఆయన గురించి అప్పటికే ఎన్నో విషయాలు విన్న మార్త అనే యువతి... ఏసును, ఆయన శిష్యులను తన ఇంటికి ఆహ్వానించింది. ఇంటికి వచ్చిన వారికి మర్యాదలు చేయాలి. కానీ వారు పదమూడు మంది. అలాగే గ్రామానికి చెందిన మరికొందరు పెద్దలు కూడా వారి వెనుక ఉంటారు. ఏ సౌకర్యాలు లేని పల్లెలో... వారందరికీ సంతృప్తిగా ఆతిథ్యం ఇవ్వడం మాటలు కాదు. కాబట్టి అతిథులకు మర్యాదలు చేయాలన్న ఆత్రుతతో ఆమె పనిలో నిమగ్నమైపోయింది.

మార్తకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు మరియ. వచ్చినవారిని వినయ విధేయతలతో ఆహ్వానించింది. నమస్కారాలతో, ఆత్మీయమైన మందహాసంతో పలకరించింది. ప్రభువు మాట్లాడుతూ ఉంటే... వినసొంపుగా ఉన్న ఆయన సంభాషణలకు ఆకర్షితురాలైన మరియ... ఆయన పాదాల చెంతనే కూర్చుంది. ఆయన ప్రసంగాన్ని శ్రద్ధాసక్తులతో వింటోంది. ఇదంతా చూసిన మార్తకు మనసు మండిపోయింది. కోపం వచ్చింది. విసుక్కొంది. నేరుగా ప్రభువును సమీపించి... ‘‘స్వామీ! ఏమిటిది? నేను హడావిడిగా గొడ్డుచాకిరీ చేస్తూ ఉంటే... మరియ పనీపాటా లేకుండా మీ దగ్గర కూర్చుంది. ఆమెను కనీసం మందలించరా? మీరు చెప్పేవి వింటూ కూర్చుంటే పనులన్నీ ఎవరు చేస్తారు?’’ అని అడిగింది.

అప్పుడు ప్రభువు చిన్నగా నవ్వి... ‘‘ఆమె తన జీవితానికి ఏది అవసరమో దాన్నే వెతుక్కుంటూ వచ్చింది తల్లీ! ఆమె చేసిన పనిలో నాకు దోషం కనిపించలేదు. నీవు చేసే అనవసరమైన అనేక పనుల కన్నా... మరియ చేసేదే మిన్న. మనిషికీ, మనసుకు కావలసిన దాన్నే ఆమె ఎంపిక చేసుకుంది’’ అంటూ మరియలోని ఆధ్యాత్మిక కోణాన్ని మార్తకు చూపించాడు అజ్ఞానంతో మూసుకుపోయిన ఆమె కళ్ళు తెరిపించాడు.

డాక్టర్‌ యం. సోహినీ బెర్నార్డ్‌, 9866755024

Updated Date - Oct 17 , 2025 | 03:45 AM