ice: ఫ్రీజర్‌లో మంచు గడ్డ కడుతోందా?
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:30 AM
ఫ్రిజ్‌లో ఉండే ఫ్రీజర్‌లో తరచూ మంచు గడ్డలా ఏర్పడడం మనం చూస్తూనే ఉంటాం. దీనిని ఇలాగే వదిలేస్తే ఫ్రిజ్ పనితీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా మంచు పేరుకోవడానికి గల కారణాలు, దాన్ని తొలగించే చిట్కాల గురించి ఇలా సూచిస్తున్నారు.
మంచు ఎందుకు ఏర్పడుతుంది?
ఫ్రిజ్ తలుపు సరిగా మూసుకోకపోతే బయటి గాలి లోపలికి వెళ్లి మంచును ఏర్పరుస్తుంది. తలుపు అంచులకు లోపల ఉండే రబ్బరు పట్టీ పాడయినా ఈ సమస్య వస్తుంది.
ఫ్రిజ్‌లోని అదనపు నీటిని బయటికి పంపడంలో ముఖ్య పాత్ర వహించే కాయిల్ దెబ్బతింటే లోపల మంచు పేరుకుంటుంది.
ఫ్రిజ్‌లో ఉండే వాటర్ ఫిల్టర్ సరిగ్గా పనిచేయకపోయినా ఫ్రీజర్‌లో మంచు గడ్డలా ఏర్పడుతుంది.
ఫ్రీజర్ పైప్ మూసుకున్నప్పుడు కూడా లోపల భారీగా మంచు తయారవుతుంది.
మంచును వెంటనే తొలగించే చిట్కాలు...
ముందుగా ఫ్రిజ్‌కు విద్యుత్ సరఫరా ఆపివేయాలి. ఒక గ్లాసు వేడినీళ్లను ఫ్రీజర్‌లో పోయాలి. వెంటనే మంచు కరిగిపోతుంది
వెడల్పాటి పాత్రలో వేడి నీళ్లు పోసి ఫ్రీజర్‌లో ఉంచి తలుపు వేయాలి. పావు గంటలో మంచు మొత్తం కరిగిపోతుంది
ఫ్రీజర్ తలుపు తీసి హెయిర్ డ్రైయర్ ఆన్ చేయాలి. డ్రైయర్ నుంచి వచ్చే వేడి గాలికి మంచు గడ్డ కరుగుతుంది.
ఫ్రీజర్ నుంచి మంచు ముక్కలను తొలగించడానికి స్టీల్ లేదా ఇనప చెంచాలు, గంటెలు ఉపయోగించ కూడదు. చెక్క చెంచాలు మాత్రమే వాడాలి.