Bollywood Fusion Sarees: కలర్‌ఫుల్ కాన్స్ చీరలు
ABN , Publish Date - May 28 , 2025 | 07:02 AM
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ తారలు ఫ్యూజన్ చీరలతో విశిష్టంగా మెరిశారు. ఐశ్వర్య, జాన్వీ, ఆలియా ధరించిన ఆధునిక డిజైన్ల చీరలు అంతర్జాతీయంగా ఆకర్షణగా నిలిచాయి.
ఫ్యాషన్
చీరకట్టు కొత్త పంథా పట్టింది. కొత్త పోకడలతో పూర్తి స్వరూపాన్ని మార్చుకుని అంతర్జాతీయ వేదికల్లో వినూత్నంగా వెలిగిపోతోంది. తాజా 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో అవాక్కయ్యే రూపాల్లో వెలుగులు విరజిమ్మిన బాలీవుడ్ భామలు, వాళ్లు ధరించిన ఫ్యూజన్ చీరల విశేషాల గురించి తెలుసుకుందాం!
చీరలు, హూందాతనానికీ, నిండుదనానికీ ప్రతీకలు. ప్రత్యేకించి దక్షిణ భారతదేశపు సంప్రదాయ వస్త్రధారణలో చీరలదే అగ్రస్థానం. ఆరు గజాల అందమైన చీర, రమ్యమైన రవిక, కట్టిపడేసే కుచ్చిళ్లు, కవ్వించే కొంగు... ఇలా చీరలోని ఒక్కో అంశానిదీ ఒక్కో ప్రత్యేకత. చీరలో ఈ అంశాలన్నీ ఉండాలనే నియమానికి రోజులు చెల్లి, నేటి డిజైనర్ల సృజనాత్మకతకు అద్దం పట్టే ఆధునిక పోకడలు నేడు మనుగడలోకొచ్చాయి. తాజా కాన్స్ వేడుకల్లో రెడ్ కార్పెడ్ మీద అడుగుపెట్టిన ఐశ్వర్యా రాయ్ మొదలు ఆలియా భట్ వరకూ ఎంతో దర్జాగా ఈ ఫ్యూజన్ చీరలను ప్రదర్శించి ప్రపంచాన్ని విస్మయపరచడం విశేషమనే చెప్పుకోవాలి.
ఐశ్యర్యా రాయ్ బచ్చన్
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్, ప్రముఖ డిజైనర్ రూపొందించిన చేనేత కడ్వా చీర కట్టింది. బ్రొకేడ్ మోటిఫ్స్, వెండి జరీ పనితనం ఈ చీర ప్రత్యేకతలు. బంగారం, వెండితో రూపొందిన సున్నితమైన జర్దోజి ఎడ్జింగ్‌తో ఈ చీరకట్టుకు అదనపు ఆకర్షణ తోడైంది. ఈ చీరకు జోడీగా ఐశ్వర్య ధరించిన, 500 క్యారెట్ల మొజాంబిక్ కెంపులు, అన్‌కట్ డైమండ్స్‌తో తయారుచేసిన భారీ నెక్లెస్ అందర్నీ ఆకట్టుకుంది.
జాన్వికపూర్
లండన్ ఆధారిత లేబుల్ డి పెట్సా రూపొందించిన తెల్ల షిఫాన్ చీరను ఎంచుకుంది జాన్వీ. ఈ బ్రాండ్... నీళ్లలో తడిచినట్టు కనిపించే వెట్ లుక్‌కు పేరు పొందింది. జాన్వీ ఈ చీరను పచ్చలు, నీలాలతో తయారైన చొపార్డ్ నెక్లెస్‌తో మ్యాచ్ చేసింది.
ఆలియా భట్
ఆలియా సంప్రదాయ చీరకు సమకాలీన ముద్రను జోడించే ప్రయత్నం చేసింది. అందుకోసం చీరను తలపించే కస్టమ్ మేడ్ గుచి గౌన్‌ను ఎంచుకుంది. అలాగే బ్రాలెట్ స్టైల్ బ్లౌజ్, ఫిట్టెడ్ స్కర్ట్, పవిటను పోలిన డ్రేప్‌ను చీరకు జోడించింది.