Share News

Diwali preparation: పండక్కి కొత్తగా...

ABN , Publish Date - Oct 20 , 2025 | 05:52 AM

దీపావళి పండుగ రోజున పూజ సామాగ్రి కొత్తగా తళతళలాడాలని మహిళలంతా ఆరాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా దీపపు కుందులు, మట్టి ప్రమిదల విషయంలో అస్సలు రాజీ పడరు. ఎక్కువగా శ్రమపడకుండా చిటికెలో వాటిని మెరిపించే చిట్కాలు ఇవిగో...

Diwali preparation: పండక్కి కొత్తగా...

దీపావళి పండుగ రోజున పూజ సామాగ్రి కొత్తగా తళతళలాడాలని మహిళలంతా ఆరాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా దీపపు కుందులు, మట్టి ప్రమిదల విషయంలో అస్సలు రాజీ పడరు. ఎక్కువగా శ్రమపడకుండా చిటికెలో వాటిని మెరిపించే చిట్కాలు ఇవిగో...

2.jpg

వెండి కుందుల కోసం...

  • వెండి కుందుల మీద తెల్లని టూత్‌పేస్ట్‌ రాసి లేదా టూత్‌పౌడర్‌ చల్లి పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఆపైన చేతి రుమాలుతో గట్టిగా తుడిచేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. మెత్తటి స్క్రబ్బర్‌ మీద టమాటా కెచప్‌ వేసి దానితో మెల్లగా తోమినా వెండి కుందులు మెరిసి పోతాయి.

  • వెడల్పాటి గిన్నెలో ఒక గ్లాసు వేడినీళ్లు పోసి, అందులో నాలుగు చెంచాల వెనిగర్‌, రెండు చెంచాల బేకింగ్‌ సోడా వేసి బాగా కలపాలి. అందులో వెండి కుందులు ఉంచి అరగంటసేపు నాననివ్వాలి. తరువాత లిక్విడ్‌ డిటర్జెంట్‌తో రుద్ది కడిగితే జిడ్డు, మురికి తొలగిపోయి వెండి దీపాలు కొత్తవాటిలా మారతాయి.

  • చిన్న గిన్నెలో రెండు చెంచాల డిటర్జెంట్‌ పౌడర్‌ వేసి నీళ్లు చిలకరిస్తూ పేస్టులా చేయాలి. ఈ పేస్టుని వెండి కుందులకు పట్టించాలి. పావుగంట తరువాత పాత టూత్‌బ్రష్‌తో తోమి మంచినీళ్లతో కడిగితే సరిపోతుంది.


3.jpg

మట్టి ప్రమిదల కోసం...

  • వెడల్పాటి గిన్నెలో సగానికిపైగా నీళ్లు పోయాలి. అందులో నాలుగు చెంచాల నిమ్మరసం, రెండు చెంచాల రాళ్ల ఉప్పు, ఒక చెంచా డిష్‌ వాషింగ్‌ లిక్విడ్‌ వేసి బాగా కలపాలి. తరువాత ఈ నీళ్లలో మట్టి ప్రమిదలను ఉంచి అరగంటసేపు నాననివ్వాలి. ఆపైన స్క్రబ్బర్‌తో రుద్ది కడిగితే జిడ్డు, మరకలు వదిలిపోయి ప్రమిదలు కొత్తగా కనిపిస్తాయి.

  • చిన్న గిన్నెలో నాలుగు చెంచాల డిటర్జెంట్‌ పౌడర్‌, ఒక చెంచా వెనిగర్‌ వేసి బాగా కలిపి పేస్టులా చేయాలి. ఈ మిశ్రమాన్ని ప్రమిదలకు పట్టించి అరగంట తరువాత బ్రష్‌తో రుద్ది కడిగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

1.jpg

ఇత్తడి కుందుల కోసం...

  • చిన్న గిన్నెలో నాలుగైదు చింతపండు రెమ్మలను తీసుకుని వాటిమీద కొద్దిగా నీళ్లు చిలకరించి అయిదు నిమిషాలు ఉంచితే అవి మెత్తపడతాయి. వాటితో తోమితే ఇత్తడి కుందులు బంగారంలా మెరుస్తాయి. కుందులు జిడ్డుగా అనిపిస్తే వాటిమీద కొద్దిగా డిటర్జెంట్‌ పౌడర్‌ చల్లి చేత్తో రుద్ది కడిగితే సమస్య తీరుతుంది.

  • వాడేసిన నిమ్మచెక్కతో కొద్దిగా ఉప్పు అద్ది తోమినా ఇత్తడి కుందులు కొత్తవాటిలా మెరుస్తాయి.

Updated Date - Oct 20 , 2025 | 06:29 AM